Ind vs Pak: ఆదాయం కోసం ఈసీబీ కక్కుర్తి.. భారత్, పాక్‌ల మధ్య సిరీస్‌కు ప్రతిపాదనలు.. బీసీసీఐ ఏమందో తెలుసా?
India vs Pakistan: ఇండియా వర్సెస్ పాకిస్తాన్ క్రికెట్ మ్యాచ్ అంటే ఏ రేంజ్‌లో కిక్ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. స్టేడియాలు అభిమానులతో పోటెత్తిపోతాయి. టీవీ రేటింగ్స్ టాప్‌లోకి దూసుకెళ్లుతాయి. వెరసి దాయాదుల పోరుతో డబ్బే డబ్బు.
India vs Pakistan: ఇండియా వర్సెస్ పాకిస్తాన్ క్రికెట్ మ్యాచ్ అంటే ఏ రేంజ్‌లో కిక్ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. స్టేడియాలు అభిమానులతో పోటెత్తిపోతాయి. టీవీ రేటింగ్స్ టాప్‌లోకి దూసుకెళ్లుతాయి. వెరసి దాయాదుల పోరుతో డబ్బే డబ్బు. ఈ నేపథ్యంలోనే ఐసీసీ ఈ క్రేజ్‌ను క్యాష్ చేసుకునే విధంగా ప్రతీ ఐసీసీ టోర్నీలో ఇరు జట్లు తలపడేలా షెడ్యూల్ రూపొందిస్తున్నారు. ఇప్పుడు ఇదే క్రేజ్‌ను ఇంగ్లండ్ వేల్స్ క్రికెట్ బోర్డు (ఈసీబీ) క్యాష్ చేసుకోవాలనుకుంటోంది. అదేంటి.. ఇండియా, పాకిస్తాన్ మ్యాచ్‌లకు ఈసీబీతో ఏం సంబంధం అంటున్నారా? ఇక్కడ ఉంది అసలైన ట్రిక్.. భారత్, పాక్ దేశాల మధ్య సరిహద్దుల్లో నెలకొన్న ఉద్రిక్తత పరిస్థితుల నేపథ్యంలో 2012-13 తర్వాత నుంచి ఇరు దేశాలు ద్వైపాక్షిక సిరీస్‌లు ఆడడం లేదు. కేవలం మల్టీ నేషన్ టోర్నమెంట్లు, ఐసీసీ ఈవెంట్లలోనే తలపడుతున్నాయి. పాక్‌తో దౌత్యపరంగా ఎంతో కఠినంగా వ్యవహరిస్తోన్న భారత ప్రభుత్వం.. క్రీడా సంబంధాల విషయంలోనూ అదే నిబంధనలు పాటిస్తోంది. బీసీసీఐ కూడా భారత ప్రభుత్వ నిర్ణయాలను తూచా తప్పకుండా ఫాలో అవుతోంది. దీంతో ఇరు జట్ల మధ్య ద్వైపాక్షిక సిరీస్‌లకు అవకాశం లేకుండా పోయింది. ఈనేపథ్యంలోనే భారత్, పాక్‌ల మధ్య టెస్ట్ సిరీస్‌కు ఆతిథ్యమిచ్చేందుకు ఈసీబీ ముందుకొచ్చింది. తన స్వలాభం కోసం ఈసీబీ ఈ ఆఫర్ చేయగా..బీసీసీఐ ఏ మాత్రం ఆలోచించకుండా నో చెప్పేసింది.
బీసీసీఐ ససేమిరా..
భారత్-పాకిస్థాన్ మధ్య మ్యాచ్ జరిగినప్పుడల్లా స్టేడియాలు కిక్కిరిసిపోతున్నాయి. ఇటీవల, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లో జరిగిన ఆసియా కప్-2022లో ఇది కనిపించింది. ఈ మ్యాచ్‌లు ప్రేక్షకులను తమ స్టేడియానికి తీసుకువస్తాయనే కోణంలో ఈసీబీ కూడా ఈ ప్రతిపాదన చేసింది. మరోవైపు ఇంగ్లండ్‌లో అటు భారతీయులు, ఇటు పాకిస్తానీయులు పెద్ద సంఖ్యలో ఉన్నారు. దీంతో ఇరు జట్ల మధ్య మ్యాచ్‌లు నిర్వహిస్తే భారీ ఆదాయం పొందవచ్చని ఈసీబీ భావించింది. అదే ప్రతిపాదనను పాక్, భారత్‌ల ముందు ఉంచింది. దీనిపై స్పందించిన బీసీసీఐ అధికారు ఒకరు..’ ఇండో-పాక్ సిరీస్‌కు సంబంధించి పీసీబీతో ఈసీబీ మాట్లాడింది. ఇది మాకు కొంచెం వింతగా అనిపిస్తోంది. పాక్‌తో సిరీస్ విషయంలో భారత ప్రభుత్వం చెప్పిన ఆదేశాలనే బీసీసీఐ ఫాలో అవుతుంది. ఇరు జట్ల మధ్య యథాతథ స్థితి కొనసాగుతుంది. మల్టీనేషన్ ఈవెంట్లలో మాత్రమే మేం పాకిస్థాన్‌తో ఆడతాం’ అని స్పష్టం చేశారు.
మరోవైపు పీసీబీతో సహా పాక్ మాజీ ఆటగాళ్లు సైతం భారత్‌తో ద్వైపాక్షిక సిరీస్‌లు ఆడేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. భారత్ తమతో ఒక్క సిరీస్ ఆడినా.. తమకు ఆర్థికంగా బలం చేకూరుతుందని పీసీబీ భావిస్తోంది. ఈ నేపథ్యంలోనే ఈసీబీ ఈ ప్రతిపాదనను పంపించినట్లు తెలుస్తోంది. అయితే బీసీసీఐ దీనికి మాత్రం ససేమిరా అంది.
మరిన్ని క్రీడా వార్తల కోసం క్లిక్ చేయండి..