AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

MS Dhoni : రూ. 14 కోట్లు వచ్చాయని షికార్లు చేయకమ్మా.. ధోనీ హితబోధ మాములుగా లేదుగా

MS Dhoni : ఐపీఎల్ 2026 వేలంలో రూ. 14.2 కోట్లు దక్కించుకున్న ప్రశాంత్ వీర్‌కు , డబ్బును జాగ్రత్తగా దాచుకోవాలని ధోనీ హితబోధ చేశాడు. క్రికెట్ టెక్నిక్స్ కంటే ముందు జీవిత పాఠాలు నేర్పుతూ ధోనీ తన ప్రత్యేకతను చాటుకున్నాడు.

MS Dhoni : రూ. 14 కోట్లు వచ్చాయని షికార్లు చేయకమ్మా.. ధోనీ హితబోధ మాములుగా లేదుగా
Ms Dhoni
Rakesh
|

Updated on: Mar 17, 2026 | 11:43 AM

Share

MS Dhoni : ఐపీఎల్ 2026 వేలంలో చెన్నై సూపర్ కింగ్స్ (CSK) టీమ్ అన్ క్యాప్డ్ ప్లేయర్స్ అయిన కార్తీక్ శర్మ, ప్రశాంత్ వీర్ ల కోసం ఏకంగా ఒక్కొక్కరికి రూ.14.2 కోట్లు వెచ్చించి అందరినీ ఆశ్చర్యపరిచింది. అయితే, జట్టులో చేరిన తర్వాత ఈ యువ ఆటగాళ్లకు ఎంఎస్ ధోనీ నుంచి ఎదురైన అనుభవం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ముఖ్యంగా 20 ఏళ్ల ఆల్ రౌండర్ ప్రశాంత్ వీర్ కు ధోనీ ఇచ్చిన మొదటి సలహా క్రికెట్ గురించి కాదట. “డబ్బులు జాగ్రత్తగా దాచుకో.. అనవసరమైన ఖర్చులు చేయకు” అని ధోనీ చెప్పినట్లు ప్రశాంత్ వెల్లడించాడు. కోట్లాది రూపాయల సంపాదన ఒక్కసారిగా వచ్చిపడినప్పుడు యువ ఆటగాళ్లు దారి తప్పకుండా ఉండేందుకే ధోనీ ఈ మనీ మేనేజ్‌మెంట్ పాఠాలు చెప్పినట్లు అర్థమవుతోంది.

ఉత్తరప్రదేశ్ లోని సహజీపూర్ అనే చిన్న గ్రామం నుంచి వచ్చిన ప్రశాంత్ వీర్ కు ఇది ఒక కల నిజమైన అనుభూతి. “ప్రస్తుతానికి మా మధ్య క్రికెట్ గురించి పెద్దగా చర్చ జరగలేదు. ధోనీ గారు నన్ను ఫైనాన్షియల్ గా జాగ్రత్తగా ఉండమని చెప్పారు” అని ప్రశాంత్ స్పోర్ట్‌స్టార్ మ్యాగజైన్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపాడు. అలాగే తన బ్యాటింగ్ పొజిషన్ గురించి మాట్లాడుతూ.. ఓపెనింగ్ తప్ప ఏ స్థానంలోనైనా బ్యాటింగ్ చేయడానికి తాను సిద్ధంగా ఉన్నానని, జట్టు అవసరాలకు తగ్గట్టుగా ఏ రోల్ నైనా పోషిస్తానని ధీమా వ్యక్తం చేశాడు. సీఎస్కే లాంటి గొప్ప ఫ్రాంచైజీలో భాగం కావడం తన కుటుంబానికి, తన ఊరికి గర్వకారణమని ఆనందం వ్యక్తం చేశాడు.

ఇక స్టార్ ఆల్ రౌండర్ రవీంద్ర జడేజాతో వస్తున్న పోలికలపై ప్రశాంత్ చాలా పరిణతితో సమాధానమిచ్చాడు. “జడేజా భాయ్ స్థానాన్ని భర్తీ చేయడం అంత సులభం కాదు. ఆయన జట్టు కోసం, దేశం కోసం చేసిన కృషి అపారం. నేను ఆయన ప్లేస్ తీసుకోవాలని ఆలోచిస్తే అనవసరమైన ఒత్తిడి పెరుగుతుంది. అందుకే ప్రస్తుతం నా దృష్టి అంతా నా సహజమైన ఆటపైనే ఉంది” అని స్పష్టం చేశాడు. మరోవైపు 19 ఏళ్ల వికెట్ కీపర్ బ్యాటర్ కార్తీక్ శర్మ సైతం ధోనీ నుంచి గేమ్‌ను ఫినిష్ చేసే టెక్నిక్స్, ప్లానింగ్ నేర్చుకోవడానికి ఆసక్తిగా ఉన్నట్లు తెలిపాడు.

ప్రస్తుతం ఈ ఇద్దరు యువకులు సీఎస్కే ప్రాక్టీస్ సెషన్లలో చెమటోడుస్తున్నారు. మునుపెన్నడూ చూడని హై-ఇంటెన్సిటీ ప్రాక్టీస్ ఇక్కడ జరుగుతోందని, ఆ వాతావరణానికి అలవాటు పడటానికి కొంత సమయం పడుతుందని ప్రశాంత్ చెప్పాడు. ప్రపంచ క్రికెట్ లో 2019 నుంచి 2026 వరకు ఉన్న కాలాన్ని జై షా గోల్డెన్ పీరియడ్‎గా అభివర్ణించగా, అలాంటి కాలంలో ధోనీ లాంటి లెజెండ్ దగ్గర శిక్షణ పొందడం ఈ యువ ఆటగాళ్లకు దక్కిన గొప్ప వరంగా భావించవచ్చు. ధోనీ కేవలం కెప్టెన్ గానే కాకుండా, తండ్రిలాగా లేదా పెద్దన్నలాగా వీరికి జీవిత పాఠాలు నేర్పుతుండటం విశేషం.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us