Ranji Trophy 2024: సెంచరీలతో బౌలర్లను చితకాబాదిన టీమిండియా ఆటగాళ్లు.. రంజీల్లో దున్నేస్తున్నారుగా..

Devdutt Padikkal: పంజాబ్ జట్టు ఆలౌటయ్యాక తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన కర్ణాటక జట్టుకు శుభారంభం లభించలేదు. కెప్టెన్ మయాంక్ అగర్వాల్ (0) సున్నాకి అవుటయ్యి నిరాశపరిచాడు. ఈ దశలో రవికుమార్ సమర్థ్ (38), దేవదత్ పడిక్కల్ రెండో వికెట్‌కు 76 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఆ తర్వాత వచ్చిన నికిన్ జోస్ 8 పరుగులు మాత్రమే చేసి నిష్క్రమించాడు. ఈ దశలో చెలరేగిన పడిక్కల్, మనీష్ పాండేలు సెంచరీలతో అదరగొట్టారు.

Ranji Trophy 2024: సెంచరీలతో బౌలర్లను చితకాబాదిన టీమిండియా ఆటగాళ్లు.. రంజీల్లో దున్నేస్తున్నారుగా..
Devdutt Padikkal
Follow us
Venkata Chari

|

Updated on: Jan 06, 2024 | 3:50 PM

Devdutt Padikkal: హుబ్లీలోని కేఎస్‌సీఏ క్రికెట్ గ్రౌండ్‌లో జరుగుతున్న రంజీ టోర్నీ గ్రూప్-సి మ్యాచ్‌లో కర్ణాటక యువ బ్యాట్స్‌మెన్ దేవదత్ పడిక్కల్ భారీ సెంచరీతో చెలరేగాడు. ఈ మ్యాచ్‌లో పంజాబ్ జట్టు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. దీంతో తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్ జట్టుకు శుభారంభం లభించలేదు. వాసుకి కౌశిక్ ధాటికి పంజాబ్ జట్టు కేవలం 89 పరుగులకే 5 వికెట్లు కోల్పోయింది. ఈ దశలో జాగ్రత్తగా బ్యాటింగ్ చేసిన నేహాల్ వధేరా 44 పరుగులు చేశాడు.

అయితే, మ్యాచ్‌పై పట్టు సాధించిన కర్ణాటక బౌలర్లు పంజాబ్ జట్టును కేవలం 152 పరుగులకే కట్టడి చేశారు. కర్ణాటక తరపున 15 ఓవర్లు బౌలింగ్ చేసిన వాసుకి కౌశిక్ కేవలం 41 పరుగులిచ్చి 7 వికెట్లు పడగొట్టాడు.

దేవదత్ అద్భుత సెంచరీ..

పంజాబ్ జట్టు ఆలౌటయ్యాక తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన కర్ణాటక జట్టుకు కూడా శుభారంభం లభించలేదు. కెప్టెన్ మయాంక్ అగర్వాల్ (0) సున్నాకి అవుటయ్యి నిరాశపరిచాడు. ఈ దశలో రవికుమార్ సమర్థ్ (38), దేవదత్ పడిక్కల్ రెండో వికెట్‌కు 76 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఆ తర్వాత వచ్చిన నికిన్ జోస్ 8 పరుగులు మాత్రమే చేసి నిష్క్రమించాడు.

మరోవైపు అద్భుతంగా బ్యాటింగ్ కొనసాగించిన దేవదత్ పడిక్కల్ 115 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేశాడు. సెంచరీ తర్వాత ధీటుగా బ్యాటింగ్ కొనసాగించిన పడిక్కల్‌కు మనీష్ పాండే చక్కటి సహకారం అందించాడు.

దూకుడు బ్యాటింగ్‌పై దృష్టి పెట్టాడు. అందుకు తగ్గట్టుగానే 216 బంతుల్లో 4 భారీ సిక్సర్లు, 24 ఫోర్లతో 193 పరుగులు చేశాడు. దీంతో అతను కేవలం 7 పరుగుల తేడాతో డబుల్ సెంచరీని కోల్పోయాడు.

పాండే పవర్..

ఆకట్టుకునే షాట్లతో అందరి దృష్టిని ఆకర్షించిన మనీష్ పాండే కూడా అద్భుతమైన ఫామ్ కనబరిచాడు. ఫలితంగా పాండే బ్యాట్‌తో కేవలం 142 బంతుల్లోనే సెంచరీ సాధించాడు. 79 ఓవర్లు ముగిసే సమయానికి కర్ణాటక జట్టు 4 వికెట్లు కోల్పోయి 358 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజులో మనీష్ పాండే (104), శ్రీనివాస్ శరత్ (9) బ్యాటింగ్ చేస్తున్నారు.

కర్ణాటక ప్లేయింగ్ 11: మయాంక్ అగర్వాల్ (కెప్టెన్), దేవదత్ పడిక్కల్, రవికుమార్ సమర్థ్, మనీష్ పాండే, నికిన్ జోస్, శ్రీనివాస్ శరత్ (వికెట్ కీపర్), శుభాంగ్ హెగ్డే, విజయ్ కుమార్ వైషాక్, రోహిత్ కుమార్, విద్వాత్ కావీరప్ప, వాసుకి కౌశిక్.

పంజాబ్ ప్లేయింగ్ 11: ప్రభ్‌సిమ్రాన్ సింగ్, అభిషేక్ శర్మ, మన్‌దీప్ సింగ్ (కెప్టెన్), నెహాల్ వధేరా, నమన్ ధీర్, గీతాంష్ ఖేరా (వికెట్ కీపర్), బల్తేజ్ సింగ్, మయాంక్ మార్కండే, ప్రీత్ దత్తా, సిద్ధార్థ్ కౌల్, అర్షదీప్ సింగ్.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..