ఐపీఎల్‌లో మరో కొత్త ఫ్రాంచైజీ.. ఒకే టీంలోకి ఇషాన్ కిషన్, వైభవ్ సూర్యవంశీ? రంగంలోకి భారతీయ బిలియనీర్!
Bihar IPL Team: ఐపీఎల్ 2026 సీజన్ సిక్సర్ల వర్షంతో క్రికెట్ ప్రియులను ఉర్రూతలూగిస్తోంది. ఈ ఉత్కంఠ భరిత పోరులో బీహార్ సంచలనం, 15 ఏళ్ల కుర్రాడు వైభవ్ సూర్యవంశీతో పాటు సన్‌రైజర్స్ హైదరాబాద్ తాత్కాలిక సారథి ఇషాన్ కిషన్ తమ అద్భుత బ్యాటింగ్‌తో సరికొత్త చరిత్ర సృష్టించారు. తాజాగా వీరిద్దరినీ ఒకే జట్టులో చూసేందుకు అడుగులు పడుతుండటం క్రీడాలోకంలో హాట్ టాపిక్‌గా మారింది.

Bihar IPL Team: భారత క్రికెట్ రంగానికి ఎందరో మహానుభావులను అందించిన ఘనత బీహార్ గడ్డకు ఉంది. దేశంలోనే అత్యంత విజయవంతమైన కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ సైతం ఉమ్మడి బీహార్‌లోనే జన్మించిన సంగతి తెలిసిందే. ప్రస్తుత ఐపీఎల్ సీజన్‌లో బిహార్‌కు చెందిన ఎడమచేతి వాటం బ్యాటర్లు వైభవ్ సూర్యవంశీ, ఇషాన్ కిషన్ ప్రత్యర్థి బౌలర్లకు చుక్కలు చూపిస్తున్నారు. కేవలం 15 ఏళ్ల వయసులోనే వైభవ్.. జస్ప్రీత్ బుమ్రా, పాట్ కమిన్స్, మిచెల్ స్టార్క్ వంటి ప్రపంచ స్థాయి బౌలర్లను భయపెడుతూ తానేంటో నిరూపించుకున్నాడు. మరోవైపు ఇషాన్ కిషన్ సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టును ముందుండి నడిపిస్తూ అగ్రెసివ్ బ్రాండ్ క్రికెట్‌ను పరిచయం చేశాడు. వీరితో పాటు గోపాల్‌గంజ్‌కు చెందిన సాకిబ్ హుస్సేన్ కూడా తన పదునైన బౌలింగ్‌తో ప్రపంచం దృష్టిని ఆకర్షిస్తున్నాడు.
బీహార్‌కు సొంత ఐపీఎల్ టీమ్.. అనిల్ అగర్వాల్ డిమాండ్..
బీహార్ క్రికెటర్ల అద్భుత ప్రదర్శన చూసిన ప్రముఖ పారిశ్రామికవేత్త, వేదాంత రీసోర్సెస్ లిమిటెడ్ వ్యవస్థాపకుడు అనిల్ అగర్వాల్ సోషల్ మీడియా వేదికగా ఒక సంచలన ప్రతిపాదనను తెరపైకి తెచ్చారు. చెన్నై సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్, కోల్‌కతా నైట్ రైడర్స్ తరహాలోనే బీహార్‌కు కూడా ఒక ప్రత్యేకమైన ఐపీఎల్ జట్టు ఉండాలని ఆయన బలంగా ఆకాంక్షించారు. బీహార్ మట్టిలో ఎంతో మంది అసాధారణ క్రికెటర్లు ఉన్నారని, పాట్నాలో జన్మించిన ఇషాన్ కిషన్ వన్డేల్లో అత్యంత వేగవంతమైన ద్విశతకం సాధిస్తే, సమస్తిపూర్‌కు చెందిన వైభవ్ అత్యంత పిన్న వయసులోనే ఐపీఎల్‌లోకి అడుగుపెట్టి చరిత్ర సృష్టించాడని కొనియాడారు. బీహార్‌కు సొంత జట్టు వస్తే ఇక్కడి యువతకు అంతర్జాతీయ స్థాయి మౌలిక వసతులు లభిస్తాయని ఆయన పేర్కొన్నారు.
ఇది కూడా చదవండి: IPL 2026: తొలి క్వాలిఫైయర్‌లో SRH ఎంట్రీ అవ్వాలంటే.. RCBపై ఎంత తేడాతో గెలవాలంటే?
ఐపీఎల్‌లో కార్పొరేట్ సంస్థల జోరు.. కొత్త ఫ్రాంచైజీగా బీహార్?
क्या आपको नहीं लगता Chennai Super Kings, Mumbai Indians और Kolkata Knight Riders की तरह बेमिसाल बिहार की भी एक टीम होनी चाहिए?
बिहार की मिट्टी ने देश को बहुत से बेहतरीन क्रिकेट खिलाड़ी दिए हैं।
पटना में जन्मे ईशान किशन ने सबसे कम गेंदों में ODI double century लगाई। समस्तीपुर… pic.twitter.com/bgScCh40Zd
— Anil Agarwal (@AnilAgarwal_Ved) May 22, 2026
ప్రస్తుతం ఐపీఎల్ ఫ్రాంచైజీల విలువ ఆకాశాన్ని తాకుతోంది. ఇటీవల రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టును ఆదిత్య బిర్లా గ్రూప్ కన్సార్టియం సుమారు 16,706 కోట్ల రూపాయలకు కొనుగోలు చేయగా, రాజస్థాన్ రాయల్స్ జట్టును లక్ష్మీ మిట్టల్ కుటుంబం, అదార్ పూనావాలా గ్రూప్ కలిసి 15,660 కోట్ల రూపాయల భారీ మొత్తానికి దక్కించుకున్నాయి. గతంలో ఎనిమిది జట్లు ఉన్న ఐపీఎల్‌ను బీసీసీఐ పది జట్లకు విస్తరించిన సంగతి తెలిసిందే. రాబోయే రోజుల్లో లీగ్‌ను మరింత విస్తరించాలని బీసీసీఐ భావిస్తే, బీహార్‌కు చెందిన బిలియనీర్ అనిల్ అగర్వాల్ కొత్త జట్టును కొనుగోలు చేసేందుకు ప్రధాన పోటీదారుగా నిలిచే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అదే జరిగితే వైభవ్ సూర్యవంశీ, ఇషాన్ కిషన్, సాకిబ్ హుస్సేన్ వంటి బిహార్ బిడ్డలంతా తమ సొంత రాష్ట్ర జట్టు తరపున కలిసి ఆడే రోజులు ఎంతో దూరంలో లేవు.
ఇది కూడా చదవండి: ‘ఎవరున్నా లేకపోయినా.. 2027 ప్రపంచకప్‌లో ఈ ఇద్దరు ఉంటే చాలు.. ట్రోఫీ టీమిండియాదే..’
బీహార్ క్రికెట్ ప్రతిభకు ప్రపంచ వేదికపై గుర్తింపు తేవాలనే అనిల్ అగర్వాల్ ఆలోచన అద్భుతమైనది. ఒకవేళ బీహార్‌కు సొంత ఐపీఎల్ ఫ్రాంచైజీ దక్కితే, అది దేశీయ క్రికెట్‌లోనే కాకుండా ఆ రాష్ట్ర క్రీడా రంగంలో ఒక సరికొత్త విప్లవానికి నాంది పలుకుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు.




