Suryapet: ఆవులను తోలుకెళ్లిన దంపతులు.. తెల్లారేసరికి విగతజీవులు
రోజూ మాదిరిగానే ఆవులను తోలుకుని పొలం వద్దకు బయల్దేరిన ఆ దంపతులకు అదే చివరి ప్రయాణమైంది. రాత్రి పది గంటల సమయంలో సీసీ కెమెరాల్లో కనిపించిన భార్యాభర్తలు.. ఆ తర్వాత ఏమయ్యారో ఎవరికీ తెలియలేదు. తెల్లారేసరికి ఓ మట్టి రోడ్డు పక్కన గుంతలో విగత జీవులుగా పడి ఉన్నారు. పూడ్చిపెట్టిన రెండు మృతదేహాలు తీవ్ర కలకలం రేపాయి. తల వెనుక భాగంలో బలమైన గాయాలు.. రక్తపు మరకలు.. మృతదేహాలను పాతిపెట్టిన ఆనవాళ్లు.. అసలు ఈ దంపతులను ఎవరు చంపారు? ఎందుకు చంపారు? మిస్టరీగా మారిన డబుల్ మర్డర్ ఎక్కడ జరిగిందో తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే.

సూర్యాపేట జిల్లా మోతె మండలం భీక్యా తండాకు చెందిన హలావత్ నాగులు, బూబా దంపతులకు ఇద్దరు కుమార్తెలు. వారికి పెళ్లిళ్లు కూడా చేశారు. జీవనోపాధి కోసం కొన్నేళ్లుగా రాఘవాపురంలో భూమిని కౌలుకు తీసుకుని వ్యవసాయం చేసుకుంటూ ఉన్నారు. మూడేళ్లుగా మోతెలోనే ఉంటూ.. స్థానిక రైతు అమృతారెడ్డికి చెందిన భూమిని కౌలుకు తీసుకుని సాగు చేస్తున్నారు. రోజు మాదిరిగానే తమకు ఉన్న రెండు ఆవులను కూడా పొలంలోనే కట్టేసి.. రాత్రికి ఇంటికి తిరిగి వస్తుంటారు. మంగళవారం రాత్రి సుమారు 10:30 గంటల సమయంలో నాగులు, బూబా ఆవులను తోలుకుని వెళ్తున్న దృశ్యాలు సీసీ కెమెరాల్లో నమోదయ్యాయి. ఆ తర్వాత వారు ఇంటికి తిరిగి రాలేదు.
మట్టి రోడ్డు పక్కన రెండు మృతదేహాలు..
సూర్యాపేట-ఖమ్మం జాతీయ రహదారి సమీపంలోని మట్టి రోడ్డు వెంట ఓ గుంతలో పూడ్చిపెట్టిన మృతదేహాలు స్థానిక రైతులకు కనిపించాయి. ఈ సమాచారాన్ని పోలీసులకు తెలిపారు. రంగంలోకి దిగిన పోలీసులు మట్టిలో పూడ్చిపెట్టిన మృత దేహాలను బయటకు తీశారు. వాటిని పరిశీలించగా అవి నాగులు, బూబా దంపతులుగా గుర్తించారు. మృతదేహాలపై గాయాల ఆనవాళ్లు కనిపించాయి. ప్రాథమిక పరిశీలనలో ఇరువురి తల వెనుక భాగంలో బలంగా కొట్టిన ఆనవాళ్లు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. రక్తపు మరకలు కూడా కనిపించడంతో దంపతులను హత్య చేసి అక్కడే పాతిపెట్టారా? లేక మరోచోట హత్య చేసి మృతదేహాలను తీసుకొచ్చి ఇక్కడ పడేశారా? అన్న కోణంలో పోలీసులు ఆధారాలు సేకరిస్తున్నారు. క్లూస్ టీమ్, డాగ్ స్క్వాడ్‌ను రంగంలోకి దించారు. పోలీస్ డాగ్ భీక్యా తండా వైపు వెళ్లి అక్కడ ఆగిపోవడం దర్యాప్తులో ఆసక్తికర అంశంగా మారింది.
ఈ దంపతులకు ఎవరితోనైనా భూవివాదాలు ఉన్నాయా? కౌలు భూమికి సంబంధించి ఏమైనా గొడవలు జరిగాయా? డబ్బు లావాదేవీలేమైనా ఉన్నాయా? లేక వ్యక్తిగత కక్షలతోనే హత్య చేశారా? అన్న కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పటికే పలువురు అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. సీసీ కెమెరాల ఫుటేజీ, ఫోన్ కాల్ వివరాలు, దంపతుల పరిచయాలు, వారి కదలికలను పోలీసులు పరిశీలిస్తున్నారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నామని జిల్లా ఎస్పీ నరసింహ తెలిపారు.
గిరిజన దంపతుల హత్యతో భీక్యా తండా..కన్నీటి సంద్రమైంది. వ్యవసాయాన్ని నమ్ముకుని బతికిన దంపతులు.. రాత్రికి రాత్రే విగతజీవులుగా మారడంతో భీక్యా తండాలో విషాదం నెలకొంది. కుమార్తెలకు పెళ్లిళ్లు చేసి.. కౌలు వ్యవసాయంతో కుటుంబాన్ని నెట్టుకొస్తున్న నాగులు, బూబాలకు ఇలా దారుణ హత్యకు గురి కావడం కలకలం రేపుతోంది.
