AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఇక..రేషన్ కార్డ్ ఉంటే చాలు.. ఏపీలో రెసిడెన్స్ సర్టిఫికెట్ కొత్త రూల్స్

ఇక..రేషన్ కార్డ్ ఉంటే చాలు.. ఏపీలో రెసిడెన్స్ సర్టిఫికెట్ కొత్త రూల్స్

Phani CH
|

Updated on: Sep 20, 2026 | 5:01 PM

Share

ఏపీలో ప్రభుత్వ పథకాలు, సేవల కోసం నివాస ధ్రువీకరణకు సంబంధించి కొత్త మార్గదర్శకాలపై చర్చ జరుగుతోంది. రాష్ట్ర ప్రభుత్వ ప్రయోజనాల కోసం ఆధార్‌, రేషన్‌ కార్డులను నివాస రుజువుగా వినియోగించేలా ప్రభుత్వం సూచనలు ఇచ్చినట్లు సమాచారం. అయితే కొన్ని ప్రత్యేక అవసరాలకు మాత్రం తహసీల్దార్‌ జారీ చేసే రెసిడెన్స్‌ సర్టిఫికెట్‌ అవసరం ఉంటుంది. కేంద్ర విద్యాసంస్థల అడ్మిషన్లు, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు, రక్షణ రంగ నియామకాలు వంటి సందర్భాల్లో సంబంధిత నిబంధనలను పరిశీలించాల్సి ఉంటుంది.

ఆంధ్రప్రదేశ్ ప్రజలకు, ముఖ్యంగా విద్యార్థులకు, ఉద్యోగార్థులకు, సంక్షేమ పథకాలు అందుకుంటున్న ప్రతి ఒక్కరికీ ఇది చాలా కీలకమైన అప్‌డేట్. ఏపీ ప్రభుత్వం నివాస ధ్రువీకరణ పత్రాల కోసం, ఆధార్, రేషన్ కార్డుల వినియోగానికి సంబంధించి ముఖ్యమైన జీవోను జారీ చేసింది. మరి.. అసలు ఇప్పటివరకు ఉన్న రూల్స్ ఏంటి? కొత్తగా ప్రభుత్వం తీసుకువచ్చిన మార్పులు ఏంటి? ఎవరికి రెసిడెన్స్ సర్టిఫికెట్ అవసరం? ఎవరికి అసలు అవసరం లేదు? ఈ పూర్తి వివరాలన్నింటినీ ఈ వీడియోలో క్షుణ్ణంగా తెలుసుకుందాం. రాష్ట్రంలో వివిధ ప్రభుత్వ సంక్షేమ పథకాలు, కార్యక్రమాలు, ఇతర సేవలను పొందడానికి ప్రజలు నానా తంటాలు పడుతుంటారు. ఈ నేపథ్యంలో ఇప్పటివరకు పడుతున్న ఇబ్బందులకు ఏపీ ప్రభుత్వం చెక్ పెట్టింది. సాధారణంగా మనం ఏ చిన్న పథకానికైనా, లేదా స్థానికతను నిరూపించుకోవడానికైనా తహసీల్దార్ కార్యాలయాల చుట్టూ తిరుగుతూ రెసిడెన్స్ సర్టిఫికెట్ కోసం దరఖాస్తు చేసుకుంటూ ఉంటాం. కానీ, రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు స్పష్టమైన మార్గదర్శకాలను విడుదల చేసింది. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ సంక్షేమ పథకాలు, కార్యక్రమాలు, అన్ని రకాల ప్రభుత్వ ప్రయోజనాల కోసం రేషన్‌ కార్డు, ఆధార్‌ కార్డులనే నివాస రుజువుగా ఉపయోగించుకోవాలని స్పష్టం చేసింది. అంటే, కేవలం రాష్ట్ర ప్రభుత్వ పథకాల కోసం ప్రత్యేకంగా రెసిడెన్స్ సర్టిఫికెట్ తీసుకోవాల్సిన అవసరాన్ని ప్రభుత్వం గణనీయంగా తగ్గించింది. ఈ అంశంపై ప్రభుత్వం మొదట బుధవారం కొన్ని ఉత్తర్వులు జారీ చేసింది. వాటిలో కొన్ని సవరణలు చేస్తూ గురువారం మరో కొత్త జీవోను విడుదల చేసింది. తాజా మార్పుల ప్రకారం నివాస ధ్రువీకరణ పత్రాల జారీ అధికారాన్ని మళ్లీ తహసీల్దార్లకు అప్పగించారు. ఒకవేళ ఎవరికైనా నిజంగా రెసిడెన్స్ సర్టిఫికెట్ కావాలంటే, తగిన ఆధారాలతో తహసీల్దారుకు దరఖాస్తు సమర్పించాల్సి ఉంటుంది. ఒకవేళ సరైన ఆధారాలు లేకపోతే, తహసీల్దారు స్వయంగా స్థానికంగా విచారణ చేసి, నివాసాన్ని ధ్రువీకరించి పత్రం జారీ చేస్తారు. అయితే ఇక్కడే ఒక ముఖ్యమైన మెలిక ఉంది. రాష్ట్ర ప్రభుత్వ పథకాలకు ఆధార్, రేషన్ కార్డులే చాలని చెప్పిన ప్రభుత్వం… కొన్ని నిర్దిష్ట ప్రయోజనాల కోసం మాత్రం కచ్చితంగా తహసీల్దార్లు నివాస ధ్రువీకరణ పత్రాలు తీసుకోవాలని పేర్కొంది. అవేటంటే… పీవీటీజీ ఆదివాసీ గిరిజన కుటుంబాలు. వీరికి ఆధార్‌ నమోదు, ఆధార్‌ అప్‌డేట్‌ చేసుకోవడం కోసం తహసీల్దార్లు విధిగా నివాస ధ్రువీకరణ పత్రాలు జారీ చేయాలని ఆదేశించారు. దేశంలోని ప్రముఖ కేంద్ర విద్యా సంస్థల్లో అంటే IITs, IIMs, Central Universities మొదలైన వాటిలో అడ్మిషన్లు పొందడానికి ఆయా సంస్థలు నివాస రుజువు కోరినప్పుడు ఈ సర్టిఫికెట్ ఉపయోగపడుతుంది. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల్లో ఉద్యోగ నియామకాల సమయంలో నివాస రుజువుగా సమర్పించడానికి తహసీల్దార్లు జారీ చేసే నివాస ధృవీకరణ పత్రం ఉపయోగపడుతుంది. సైనిక దళాల రిక్రూట్‌మెంట్.. ఆర్మీ, నేవీ, ఎయిర్‌ఫోర్స్, ఇతర రక్షణ రంగ కొలువుల రిక్రూట్‌మెంట్‌లో లోకల్ రెసిడెన్స్ ప్రూఫ్ చూపించడానికి ఈ సర్టిఫికెట్ అవసరం అవుతుంది. ఇలాంటి నిర్దిష్టమైన, ప్రత్యేక ప్రయోజనాల కోసమే నివాస ధ్రువీకరణ పత్రాలు జారీ చేయాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఇక్కడ మరో ముఖ్యమైన అంశాన్ని ప్రభుత్వం స్పష్టం చేసింది. అదేంటంటే – ఒకవేళ ఎవరైనా ఇప్పటికే నిర్దిష్ట అవసరాల కోసం లేదా గతంలోనే తహసీల్దార్ల ద్వారా నివాస ధ్రువీకరణ పత్రాలను పొంది ఉంటే, వారు మళ్లీ కొత్తగా సర్టిఫికెట్లు జారీ చేయించుకోవాల్సిన అవసరం లేదు. పాత సర్టిఫికెట్లే చెల్లుబాటు అవుతాయి. దీనివల్ల ప్రజలు మళ్లీ మళ్లీ అధికారుల చుట్టూ తిరిగే శ్రమ తప్పుతుంది. ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయం వల్ల సామాన్య ప్రజలకు ఏన్నో రకాలుగా మేలు కలుగుతుంది. ముఖ్యంగా సమయం ఆదా అవుతుంది. అనవసరంగా ప్రతి చిన్న ప్రభుత్వ పథకానికి రెసిడెన్స్ సర్టిఫికెట్ కోసం దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం లేదు. ఆఫీసుల చుట్టూ తిప్పలు తప్పుతాయి. ఆధార్ కార్డ్, రేషన్ కార్డ్ మీ దగ్గర ఉంటే చాలు, రాష్ట్ర ప్రభుత్వ సేవలు సులభంగా అందుతాయి. పీవీటీజీ గిరిజన కుటుంబాలు ఆధార్ అప్డేట్ చేసుకోవడానికి ఇది ఎంతగానో సహాయపడుతుంది. కేవలం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు, ఆర్మీ రిక్రూట్‌మెంట్, సెంట్రల్ ఇన్‌స్టిట్యూట్ అడ్మిషన్ల వంటి వాటికి మాత్రమే రెసిడెన్స్ సర్టిఫికెట్ కావాలి కాబట్టి, ఎవరికి అవసరమో వారే అప్లై చేసుకునే అవకాశం ఉంటుంది. మొత్తానికి ఏపీ ప్రభుత్వం తీసుకువచ్చిన ఈ తాజా మార్పులు ప్రజలకు ఎంతో ఊరటనిచ్చేవిగా ఉన్నాయి.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

బియ్యంలో తేలే గింజలు.. అసలు నిజమేంటి?

Follow Us