Mohammed Siraj: మియా భాయ్ కి రెస్ట్ అవసరం.. మాజీ క్రికెటర్ ఘాటు వ్యాఖ్యలు
BGT 2024లో మహ్మద్ సిరాజ్ ప్రదర్శన ఆశించిన స్థాయికి అందలేదు. సిరాజ్ పై సునీల్ గవాస్కర్ తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. జట్టు పనితీరును మెరుగుపరచడానికి సిరాజ్‌కి విశ్రాంతి అవసరమని, అతని స్థానంలో హర్షిత్ రాణా లేదా ప్రసిద్ధ్ కృష్ణను ఆడించాలని సూచించారు. ఈ వ్యాఖ్యలు క్రికెట్ ప్రపంచంలో చర్చనీయాంశంగా మారాయి.
BGT 2024లో భారత పేసర్ మహ్మద్ సిరాజ్ ప్రదర్శన పట్ల మాజీ క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. గత బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భారత విజయానికి కీలకంగా నిలిచిన సిరాజ్, ఈ సారి మాత్రం తగిన స్థాయిలో ప్రభావం చూపలేకపోయాడు. ఆరు ఇన్నింగ్స్‌లలో 49 స్ట్రైక్ రేట్‌తో కేవలం 13 వికెట్లు తీసిన సిరాజ్, బుమ్రాపై మరింత భారం మోపినట్లు అయ్యింది.
గవాస్కర్ అభిప్రాయంలో, సిరాజ్‌కి విశ్రాంతి ఇచ్చి, అతనికి స్పష్టంగా చెప్పాలని సూచించారు. “మీ ప్రదర్శన తగినంత స్థాయిలో లేదు, అందుకే మేము మిమ్మల్ని జట్టు నుంచి తప్పిస్తున్నాం” అని నేరుగా చెప్పడం అవసరమని గవాస్కర్ అభిప్రాయపడ్డారు. ఆటగాళ్లు తనలోని లోపాలను సరిదిద్దుకోవడానికి ఇది అవసరమని అన్నారు.
ప్రస్తుతం టెస్టు సిరీస్‌లో, సిరాజ్ అత్యధిక పరుగులు ఇచ్చిన పేసర్‌గా నిలిచాడు. 4.07 ఎకానమీతో, బాక్సింగ్ డే టెస్టులో అతని ప్రదర్శన మరింత దిగజారింది. మొదటి ఇన్నింగ్స్‌లో 23 ఓవర్లలో 122 పరుగులు ఇచ్చి, ఒక్క వికెట్ కూడా తీయలేకపోయాడు.
సిరాజ్ స్థానంలో హర్షిత్ రాణా లేదా ప్రసిద్ధ్ కృష్ణను జట్టులో చేర్చి జస్ప్రీత్ బుమ్రాకు మద్దతుగా ఆడించాల్సిన అవసరం ఉందని గవాస్కర్ అభిప్రాయపడ్డారు. ఈ వ్యాఖ్యలు క్రికెట్ అభిమానుల మధ్య చర్చనీయాంశంగా మారాయి.