AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sachin Tendulkar : క్రికెట్ దేవుడికే రీప్లేస్‌మెంటా? సందీప్ పాటిల్ సంచలన వ్యాఖ్యలు.. ఆ రోజు ఫోన్‌లో అసలేం జరిగింది?

Sachin Tendulkar : సచిన్ టెండూల్కర్ వన్డే రిటైర్మెంట్ వెనుక ఉన్న షాకింగ్ నిజాన్ని మాజీ సెలక్టర్ అయిన సందీప్ పాటిల్ బయటపెట్టారు. రీప్లేస్‌మెంట్ గురించి చెప్పినప్పుడు సచిన్ షాక్ అయ్యారని , ఆ తర్వాతే రిటైర్మెంట్ నిర్ణయం తీసుకున్నారని తెలిపారు.

Sachin Tendulkar : క్రికెట్ దేవుడికే రీప్లేస్‌మెంటా? సందీప్ పాటిల్ సంచలన వ్యాఖ్యలు.. ఆ రోజు ఫోన్‌లో అసలేం జరిగింది?
Sachin
Rakesh
|

Updated on: Mar 18, 2026 | 1:26 PM

Share

Sachin Tendulkar : క్రికెట్ ప్రపంచంలో దేవుడిగా కొలిచే సచిన్ టెండూల్కర్ మైదానాన్ని వీడి దశాబ్ద కాలం దాటిపోయింది. అయినా సరే ఆయన నెలకొల్పిన రికార్డులు నేటికి చెక్కు చెదరలేదు. అయితే సచిన్ వన్డే క్రికెట్ నుంచి తప్పుకోవడం వెనుక ఉన్న ఒక ఆసక్తికరమైన, షాకింగ్ విషయాన్ని భారత మాజీ చీఫ్ సెలక్టర్ సందీప్ పాటిల్ తాజాగా వెల్లడించారు. 2012లో సచిన్ వన్డేలకు వీడ్కోలు పలికే సమయంలో బీసీసీఐ (BCCI) లోపల ఏం జరిగిందనేది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. సాధారణంగా ఆటగాళ్లు ఫామ్ కోల్పోయినప్పుడు సెలక్టర్లు తప్పించడం మామూలే.. కానీ సచిన్ లాంటి దిగ్గజం విషయంలో సెలక్టర్లు చాలా సున్నితంగా వ్యవహరించాల్సి వచ్చింది.

సందీప్ పాటిల్ తెలిపిన వివరాల ప్రకారం.. 2012 చివరలో సెలక్షన్ కమిటీ సచిన్ టెండూల్కర్ స్థానాన్ని భర్తీ చేసేందుకు మరొక ఆటగాడి కోసం వెతకడం ప్రారంభించింది. ఈ విషయాన్ని స్వయంగా సచిన్ కే చెప్పాలని కమిటీ నిర్ణయించింది. అప్పట్లో నాగ్‌పూర్ టెస్ట్ ముగిసిన తర్వాత, సందీప్ పాటిల్ నేరుగా సచిన్ కు ఫోన్ చేసి.. భవిష్యత్తు గురించి మీ ప్లాన్స్ ఏంటి? అని అడిగారు. దానికి సచిన్ ఆశ్చర్యంగా ఎందుకు? అని అడిగితే, మేము మీ స్థానంలో మరొకరిని చూడాలనుకుంటున్నాము అని సందీప్ బదులిచ్చారు.

సెలక్టర్ల నోట ఆ మాట వినగానే సచిన్ ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. కాసేపటి తర్వాత మళ్ళీ కాల్ చేసి, మీరు నిజంగానే సీరియస్‌గా చెబుతున్నారా? అని అడిగారట. దానికి సందీప్ పాటిల్ అవును అని సమాధానం ఇచ్చారు. ఆ సమయంలో సచిన్ ఇంకా ఆడాలని కోరుకున్నప్పటికీ, టీమిండియాలో మార్పులు అవసరమని సెలక్టర్లు భావించారు. ఈ సంభాషణ జరిగిన కొన్ని రోజులకే, సరిగ్గా డిసెంబర్ 23, 2012న పాకిస్థాన్‌తో సిరీస్‌కు ముందు సచిన్ తన వన్డే రిటైర్మెంట్‌ను ప్రకటించి అందరినీ ఆశ్చర్యపరిచారు.

సచిన్ తన కెరీర్‌లో ఆఖరి వన్డే మ్యాచ్‌ను మార్చి 18, 2012న ఆసియా కప్‌లో పాకిస్థాన్‌పై ఆడారు. ఆ మ్యాచ్‌లో ఆయన 52 పరుగులు చేసి భారత్ విజయంలో కీలక పాత్ర పోషించారు. అదే టోర్నమెంట్‌లో బంగ్లాదేశ్‌పై తన 100వ అంతర్జాతీయ సెంచరీని కూడా పూర్తి చేసి చరిత్ర సృష్టించారు. సచిన్ ని రిటైర్మెంట్ తీసుకోమని తాము ఎప్పుడూ ఒత్తిడి చేయలేదని, కేవలం జట్టు ప్రణాళికలను వివరించామని సందీప్ పాటిల్ స్పష్టం చేశారు. ఆ తర్వాత సచిన్ గౌరవప్రదంగా వన్డేల నుంచి తప్పుకుని, 2013లో తన 200వ టెస్ట్ తర్వాత క్రికెట్ కు పూర్తిగా వీడ్కోలు పలికారు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us