Asia Cup 2022: టీమిండియా ఆటగాళ్లకు ఫిట్‌నెస్ టెస్ట్.. ఆ ఇద్దరికి మాత్రం మినహాయింపు.. ఎందుకో తెలుసా?
ఆసియా కప్ 2022 యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లో ఆగస్టు 27 నుంచి సెప్టెంబర్ 11 వరకు జరుగుతుంది. ఈ టోర్నీలో మొత్తం ఆరు జట్లు పాల్గొంటాయి.
Asia Cup 2022: ఇంగ్లండ్ వర్సెస్ వెస్టిండీస్‌లను ఓడించిన తర్వాత ప్రస్తుతం భారత క్రికెట్ జట్టు 2022 ఆసియా కప్‌ను గెలుచుకోవాలని కోరుకుంటోంది. ఈ టోర్నీ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లో ఆగస్టు 27 నుంచి సెప్టెంబర్ 11 వరకు జరగనుంది. ఈ టోర్నీలో మొత్తం ఆరు జట్లు పాల్గొంటాయి. అయితే యూఏఈకి వెళ్లే ముందు టీమిండియా ఆటగాళ్లు ఫిట్‌నెస్ టెస్ట్ చేయించుకోవాల్సి ఉంటుందని సమాచారం వినిపిస్తుంది.
ఆగస్ట్ 20న దుబాయ్‌కు బయల్దేరనున్న టీమిండియా..
2022 ఆసియా కప్‌లో 10 మ్యాచ్‌లు దుబాయ్‌లో జరగనున్నాయి. అదే సమయంలో షార్జాలో మూడు మ్యాచ్‌లు నిర్వహించనున్నారు. అన్ని మ్యాచ్‌లు స్థానిక కాలమానం ప్రకారం సాయంత్రం 6 గంటలకు అంటే భారత కాలమానం ప్రకారం రాత్రి 7:30 గంటలకు ప్రారంభమవుతాయి.
మీడియా కథనాల ప్రకారం.. ఆసియా కప్‌లో పాల్గొనేందుకు భారత జట్టు ఆగస్టు 20న దుబాయ్ వెళ్లనుంది. అయితే దీనికి ముందు బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీలో టీమిండియా ఆటగాళ్లు చాలా మంది ఫిట్‌నెస్ టెస్ట్ చేయించుకోవాల్సి ఉంటుంది. దుబాయ్ చేరుకున్నాక మూడు రోజుల శిక్షణ శిబిరం కూడా ఉంటుందని తెలుస్తోంది.
స్పోర్ట్స్ వెబ్‌సైట్ ఇన్‌సైడ్‌స్పోర్ట్ నివేదికలో, ఆగస్ట్ 18న NCAలో జట్టు సమావేశమవుతుందని, వారికి ఫిట్‌నెస్ టెస్ట్ ఉంటుందని BCCI అధికారి ఒకరు తెలియజేశారు. విరామం తర్వాత తప్పనిసరి ప్రోటోకాల్ ఉంది. ఆగస్ట్ 20న ఆటగాళ్లు దుబాయ్‌కి బయలుదేరుతారు. పాకిస్థాన్‌తో మ్యాచ్‌కి ముందు చిన్న క్యాంపు ఉంటుందంట.
ఆసియా కప్‌కు భారత జట్టులోకి ఎంపికైన దీపక్ హుడా, అవేష్ ఖాన్ జింబాబ్వే నుంచి నేరుగా దుబాయ్‌కు వెళ్లనున్నారు. ఈ ఇద్దరు ఆటగాళ్లు శిక్షణ శిబిరంలో కూడా పాల్గొనరు.