AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Raksha Bandhan 2022: సోదరీమణుల కారణంగా స్టార్ ప్లేయర్‌లుగా మారిన భారత క్రికెటర్లు.. లిస్టులో ఎవరున్నారంటే?

Indian Cricket Team: సోదరీమణులు లేకుంటే, వీరు క్రికెటర్స్‌గా కనిపించేవారు కాదు. వారు ఎవరు, ఆ వివరాలేంటో ఇప్పుడు చూద్దాం..

Raksha Bandhan 2022: సోదరీమణుల కారణంగా స్టార్ ప్లేయర్‌లుగా మారిన భారత క్రికెటర్లు.. లిస్టులో ఎవరున్నారంటే?
Raksha Bandhan 2022
Venkata Chari
|

Updated on: Aug 12, 2022 | 6:10 AM

Share

దేశ వ్యాప్తంగా రాఖీ పండుగను ఘనంగా చేసుకుంటున్నారు. ఈ క్రమంలో సంబరాలు చేసుకోవడంలో భారత ఆటగాళ్లు కూడా వెనుకంజ వేయడం లేదు. అయితే, ముఖ్యంగా భారత జట్టుకు చెందిన ఐదుగురు స్టార్ ప్లేయర్స్‌ విజయం మాత్రం వారి సోదరీమణుల వెనుక ఉంది. అదేంటని ఆశ్చర్యపోతున్నారా. అవునండీ, ఈ మాటలు నిజమే. సోదరీమణులు లేకుంటే, వీరు క్రికెటర్స్‌గా కనిపించేవారు కాదు. వారు ఎవరు, ఆ వివరాలేంటో ఇప్పుడు చూద్దాం..

సచిన్ టెండూల్కర్..

క్రికెట్ దేవుడిగా భావించే సచిన్ జీవితం తన సోదరి ప్రేమ లేకుండా అసంపూర్ణంగా నిలుస్తుంది. అయన సోదరి పేరు సవిత. ఆమె సచిన్ తండ్రి రమేష్ టెండూల్కర్ మొదటి భార్య కుమార్తె. సచిన్ చాలాసార్లు తన విజయాన్ని ఆమెకు అందించాడు. సచిన్ 200 టెస్టు మ్యాచ్‌లు ఆడిన తర్వాత క్రికెట్‌కు వీడ్కోలు పలికినప్పుడు, తన సోదరి తనకు మొదటి కాశ్మీరీ విల్లో క్రికెట్ బ్యాట్‌ను బహుమతిగా ఇచ్చిందని తన ప్రసంగంలో చెప్పుకొచ్చాడు. అంతే కాదు సచిన్ ఆడిన ప్రతి మ్యాచ్‌లోనూ సోదరి ఉపవాసం ఉండేదంట.

ఇవి కూడా చదవండి

హర్భజన్ సింగ్..

హర్భజన్ సింగ్, టీమిండియా మాజీ వెటరన్ ఆటగాడు. భారతదేశపు గొప్ప స్పిన్నర్లలో ఒకడిగా పేరుగాంచాడు. పంజాబ్‌కు చెందిన ఈ క్రికెటర్‌కు ఐదుగురు సోదరీమణులు ఉన్నారు. వారిలో నలుగురు అతని కంటే పెద్దవారు. ఒకామె చిన్నది. 1998లో భారత్ తరపున అరంగేట్రం చేసే అవకాశం భజ్జీకి లభించింది. అయితే వెంటనే జట్టుకు దూరమయ్యాడు. ఆ తర్వాత కొన్ని రోజులకే క్రికెట్ వదిలేసి ట్రక్ డ్రైవర్‌గా మారాడని చాలా తక్కువ మందికి తెలుసు. వాస్తవానికి, 2000 సంవత్సరంలో, అతని తండ్రి మరణించాడు. ఆ తర్వాత తల్లి, ఐదుగురు సోదరీమణుల బాధ్యత అతనిపై పడింది. అలాంటి పరిస్థితుల్లో కెనడా వెళ్లి ట్రక్కు నడిపి డబ్బు సంపాదించాలని నిర్ణయించుకున్నాడు. కానీ, అతను తన సోదరీమణుల సలహాతో క్రికెట్ ఆడుతూనే ఉన్నాడు. 2000 సంవత్సరంలో రంజీ ట్రోఫీలో అద్భుత ప్రదర్శన చేసి టీమిండియాలో చోటు సంపాదించాడు. అప్పుడు జరిగింది చరిత్ర. అక్కాచెల్లెళ్లు లేకుంటే భారత్‌కు మ్యాచ్ విన్నింగ్ స్పిన్నర్ లభించేవాడు కాదు.

మహేంద్ర సింగ్ ధోని..

టీమిండియా విజయవంతమైన కెప్టెన్లలో మహేంద్ర సింగ్ ధోనీ ఒకరు. ధోనీ కెప్టెన్సీలో టీమ్ ఇండియా ఎన్నో పెద్ద మైలురాళ్లను సాధించింది. మహి విజయం వెనుక సోదరి జయంతి హస్తం ఉంది. ఒకవైపు ధోనీ తండ్రికి అతను క్రికెటర్‌ కావడం ఇష్టం లేదు. అదే సమయంలో, ధోనీ సోదరి జయంతి ప్రతి మలుపులోనూ తన సోదరుడికి అండగా నిలిచింది. స్కూల్ టైమ్‌లో, టీమ్ ఇండియా మాజీ కెప్టెన్‌ని చదువుపై దృష్టి పెట్టమని తండ్రి కోరినప్పుడు, జయంతి అతన్ని ఆడనివ్వమని వాదించేది. తన సోదరి మద్దతుతో, ధోని మైదానంలో నిర్భయంగా సిక్సర్లు కొడుతూ, టీమ్ ఇండియాకు కెప్టెన్ కూల్ అయ్యాడు. మహి సోదరి జయంతి స్కూల్ టీచర్.

విరాట్ కోహ్లీ..

విరాట్ కోహ్లికి తన అక్క భావనాతో ఎమోషనల్ బాండ్ ఉండేది. 2006లో, విరాట్‌కు కేవలం 18 సంవత్సరాల వయస్సు ఉన్నప్పుడు, అతని తండ్రి బ్రెయిన్ స్ట్రోక్ కారణంగా మరణించాడు. ఇంత చిన్న వయసులోనే తండ్రిని కోల్పోయిన విరాట్ లోలోపల కుదేలయ్యాడు. దీని తరువాత ఆయన సోదరి అన్ని విధాలుగా మద్దతు ఇచ్చింది. గతంలోనూ కోహ్లీ ఈ విషయాన్ని చాలాసార్లు ప్రస్తావించాడు. తండ్రి మరణం తర్వాత, సోదరి, తల్లి కారణంగానే విరాట్ క్రికెటర్ కావాలనే తన కలను నెరవేర్చుకోగలిగాడు.

భావనా కోహ్లీకి లైమ్‌లైట్ అంటే అస్సలు ఇష్టం ఉండదు. అతను తన కుటుంబం, స్నేహితులతో సమయం గడపడం ఆనందిస్తాడు. భావన కెమెరాకు దూరంగా ఉండటాన్ని ఇష్టపడుతుంది. భావన తన తమ్ముడి వ్యాపారాన్ని చాలా ఎత్తుకు తీసుకెళ్లింది. విరాట్ ఫ్యాషన్ లేబుల్‌లో భావన అంతర్భాగం. కోహ్లీ క్రికెట్‌తో బిజీగా ఉన్నాడు. ఇటువంటి పరిస్థితిలో అతని సోదరి అతని వ్యాపార బాధ్యతను తీసుకుంది.

రిషబ్ పంత్..

రిషబ్ పంత్ తండ్రి మరణానంతరం సోదరి సాక్షి తన అన్నకు నీడలా మిగిలిపోయింది. టీమ్ ఇండియాలో చోటు దక్కించుకోవడానికి కష్టపడుతున్న సమయంలో, సాక్షి ప్రతి హోమ్ మ్యాచ్ సమయంలో పంత్‌తో కలిసి స్టేడియానికి వెళ్లేది. ప్రేక్షకులు గ్యాలరీలో నిలబడి సోదరుడిని ప్రోత్సహించేది. పంత్ భారత జట్టు స్టార్ వికెట్ కీపర్ బ్యాటర్‌గా మారిన తర్వాత కూడా ఆ ట్రెండ్ కొనసాగుతోంది.

IPL, టీం ఇండియా మ్యాచ్‌లలో, పంత్ సోదరి తరచుగా ప్రేక్షకుల గ్యాలరీలో సోదరుడిని ప్రోత్సహించడం కనిపిస్తుంది. ఆమె తన సోదరుడికి మద్దతుగా సోషల్ మీడియాలో కూడా పోస్ట్ చేస్తూనే ఉంటుంది. సోదరి మద్దతు తన అతిపెద్ద బలమని పంత్ పదే పదే చెప్తుంటాడు.