Shubman Gill: ఇదేందిది బాసూ.! గిల్ పతనానికి రోహితే కారణమట.. ధోని ఫ్రెండ్ సంచలన వ్యాఖ్యలు
టీ20 ప్రపంచకప్ 2026 జట్టు నుంచి శుభ్‌మాన్ గిల్ వేటుపై రవిచంద్రన్ అశ్విన్ కీలక వ్యాఖ్యలు చేశాడు. రోహిత్ శర్మ దూకుడైన ఆటతీరుకు గిల్ సరితూగలేకపోయాడని అతడు చెప్పుకొచ్చాడు. సంజూ శాంసన్, అభిషేక్ శర్మ లాంటి ఆటగాళ్లు దూకుడు ప్రదర్శిస్తారని.. గిల్ స్ట్రైక్ రేట్ అందుకు సరిపోలేదని అశ్విన్ అన్నాడు.

అనుకున్నట్టే జరిగింది. టీ20 ప్రపంచకప్ 2026 జట్టులో యువ ఓపెనర్ శుభ్‌మాన్ గిల్‌కు చోటు దక్కని విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ గిల్ వేటుపై కీలక వ్యాఖ్యలు చేశారు. టీమిండియాలో రోహిత్ శర్మ ప్రవేశపెట్టిన దూకుడైన ఆటతీరు వల్లే గిల్ తన స్థానాన్ని కోల్పోవాల్సి వచ్చిందని అశ్విన్ స్పష్టం చేశాడు. గత ప్రపంచకప్‌లో రోహిత్ శర్మ పవర్‌ప్లేలో విధ్వంసకర బ్యాటింగ్‌ను పరిచయం చేశాడని, ప్రస్తుతం జట్టు మేనేజ్‌మెంట్ కూడా అదే దూకుడుతనాన్ని అనుసరిస్తోందని అశ్విన్ పేర్కొన్నాడు. టీమిండియా ఇప్పుడు పవర్‌ప్లే దశలోనే ప్రత్యర్థిపై పైచేయి సాధించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ ఎటాకింగ్ గేమ్ ప్లాన్‌కు అభిషేక్ శర్మ, సంజూ శాంసన్ లాంటి ఆటగాళ్లు సరిగ్గా సరిపోతారని అశ్విన్ చెప్పాడు.
శుభ్‌మాన్ గిల్‌కు జట్టు మేనేజ్‌మెంట్, సెలక్టర్ల నుంచి పూర్తి మద్దతు లభించినప్పటికీ, అతడు ఆశించిన స్థాయిలో వేగంగా ఆడలేకపోయాడని అశ్విన్ గుర్తు చేశాడు. మరోవైపు, సంజూ శాంసన్ తనకిచ్చిన అవకాశాలను అందిపుచ్చుకోవడంలో సఫలమయ్యాడని అశ్విన్ తెలిపాడు. ఇద్దరి గణాంకాలను పరిశీలిస్తే, గిల్ స్ట్రైక్ రేట్ 147.77 ఉండగా, శాంసన్ స్ట్రైక్ రేట్ 147.31గా ఉంది. ఈ ఇద్దరి మధ్య స్ట్రైక్ రేట్‌లో పెద్ద తేడా లేకపోయినప్పటికీ, భారీ ఇన్నింగ్స్‌ల విషయంలో శాంసన్ పైచేయి సాధించాడని అశ్విన్ వెల్లడించాడు. గిల్ 36 మ్యాచ్‌ల్లో కేవలం ఒక సెంచరీ, మూడు హాఫ్ సెంచరీలు మాత్రమే చేయగా, సంజూ శాంసన్ దాదాపు సగం మ్యాచ్‌ల్లోనే మూడు సెంచరీలు బాదడం విశేషం అని అన్నాడు.
ఇదిలా ఉండగా.. సౌతాఫ్రికా సిరీస్‌లో గిల్ గాయపడటం, ఆఖరి మ్యాచ్‌లో ఓపెనర్‌గా వచ్చిన సంజూ శాంసన్ మంచి ఇన్నింగ్స్ ఆడటం లాంటివి గిల్ పతనాన్ని శాసించాయని అశ్విన్ చెప్పాడు. వాస్తవానికి ఓపెనింగ్ స్లాట్‌కు గిల్ శైలి జట్టు కాంబినేషన్‌ను దెబ్బతీస్తోందని, అందువల్లే గిల్‌ను పక్కన పెట్టడం తనకు ఆశ్చర్యం కలిగించలేదని అశ్విన్ కుండబద్దలు కొట్టాడు. గిల్‌కు బ్యాకప్‌గా ఇషాన్ కిషన్‌ను ఎంపిక చేయడం సరైన నిర్ణయమని సమర్థించాడు. ఎందుకంటే కిషన్ కూడా దూకుడుగా ఆడగల సత్తా ఉన్న ఆటగాడని చెప్పుకొచ్చాడు.
