Gautam Gambhir: ‘గంభీర్ ఇది చూస్తున్నావా?’.. హెడ్ కోచ్‌ను టార్గెట్ చేసిన ఫ్యాన్స్..!
విజయ్ హజారే ట్రోఫీలో రోహిత్ చేసిన ఈ సెంచరీ కేవలం ఒక ఇన్నింగ్స్ మాత్రమే కాదు, తన విమర్శకులకు సమాధానం కూడా. గంభీర్ వ్యూహాలు ఎలా ఉన్నా, హిట్‌మ్యాన్ ఫామ్‌లో ఉంటే ఆపడం ఎవరికీ సాధ్యం కాదని ఈ మ్యాచ్ మరోసారి నిరూపించింది.

Gautam Gambhir: భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్, ‘హిట్‌మ్యాన్’ రోహిత్ శర్మ తన బ్యాట్‌తో మరోసారి అలజడి సృష్టించాడు. విజయ్ హజారే ట్రోఫీ 2025-26లో భాగంగా సిక్కింతో జరిగిన మ్యాచ్‌లో రోహిత్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. జైపూర్‌లోని సవాయ్ మాన్‌సింగ్ స్టేడియంలో జరిగిన ఈ పోరులో ముంబై తరపున బరిలోకి దిగిన రోహిత్, విధ్వంసకర సెంచరీతో స్టేడియాన్ని హోరెత్తించాడు.
సిక్కిం నిర్దేశించిన 237 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో రోహిత్ శర్మ క్లాస్, మాస్ ఇన్నింగ్స్‌ను ప్రదర్శించాడు. కేవలం 94 బంతుల్లోనే 155 పరుగులు సాధించి అజేయంగా నిలిచాడు. రోహిత్ ఇన్నింగ్స్‌లో 18 ఫోర్లు, 9 కళ్ళు చెదిరే సిక్సర్లు ఉన్నాయి. అతని బ్యాటింగ్ ధాటికి ముంబై జట్టు కేవలం 30.3 ఓవర్లలోనే 2 వికెట్లు కోల్పోయి విజయాన్ని అందుకుంది.
గంభీర్‌ను టార్గెట్ చేసిన అభిమానులు..
ఈ మ్యాచ్ జరుగుతున్న సమయంలో ఒక ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. గ్యాలరీలో బీసీసీఐ సెలెక్టర్ ఆర్పీ సింగ్‌ను చూసిన అభిమానులు, వెంటనే టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్‌ను ఉద్దేశించి నినాదాలు చేయడం ప్రారంభించారు. “గంభీర్ ఎక్కడున్నావ్? చూస్తున్నావా రోహిత్ ఆటను?” (Gambhir kidhar hai, dekh raha hai na?) అంటూ ఫ్యాన్స్ గట్టిగా అరిచారు.
ఇటీవల గంభీర్ జట్టులో “స్టార్ కల్చర్”ను అంతం చేయాలని భావిస్తున్నట్లు వార్తలు రావడం, రోహిత్ భవిష్యత్తుపై అంచనాలు నెలకొన్న నేపథ్యంలో అభిమానులు ఈ విధంగా స్పందించడం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. రోహిత్ శర్మ ఇంకా అత్యుత్తమ ఫామ్‌లో ఉన్నాడని, అతడిని తక్కువ అంచనా వేయవద్దని గంభీర్‌కు అభిమానులు పరోక్షంగా హెచ్చరికలు పంపారు.
ఒక దేశవాళీ మ్యాచ్ కోసం సుమారు 20,000 మందికి పైగా అభిమానులు స్టేడియానికి రావడం విశేషం. కేవలం రోహిత్ బ్యాటింగ్‌ను చూడటం కోసమే జనం పనులను మానుకొని, కాలేజీలను ఎగ్గొట్టి మరీ వచ్చారు. స్టేడియం అంతా “ముంబై చా రాజా రోహిత్ శర్మ” అనే నినాదాలతో మారుమోగిపోయింది.
సిక్కిం బ్యాటర్ ఆశిష్ థాపా (79) పోరాడినప్పటికీ, రోహిత్ విధ్వంసం ముందు వారి బౌలింగ్ తేలిపోయింది. ఈ ఇన్నింగ్స్ ద్వారా రోహిత్ శర్మ తన సత్తా ఇంకా తగ్గలేదని సెలెక్టర్లకు, కోచ్‌కు బలమైన సంకేతం పంపాడు.
విజయ్ హజారే ట్రోఫీలో రోహిత్ చేసిన ఈ సెంచరీ కేవలం ఒక ఇన్నింగ్స్ మాత్రమే కాదు, తన విమర్శకులకు సమాధానం కూడా. గంభీర్ వ్యూహాలు ఎలా ఉన్నా, హిట్‌మ్యాన్ ఫామ్‌లో ఉంటే ఆపడం ఎవరికీ సాధ్యం కాదని ఈ మ్యాచ్ మరోసారి నిరూపించింది.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




