Champion Movie Review : ఛాంపియన్ మూవీ రివ్యూ.. రోషన్ ఖాతాలో మరో హిట్టు.. మనసులు గెలిచాడు..
హీరో శ్రీకాంత్ తనయుడు రోషన్ మేక నటించిన లేటేస్ట్ హిట్ మూవీ ఛాంపియన్. డైరెక్టర్ ప్రదీప్ అద్వైతం దర్శకత్వం వహించిన ఈ సినిమాను స్వప్న దత్ నిర్మించారు. పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా రూపొందించిన ఈ మూవీలో మలయాళీ ముద్దుగుమ్మ అనస్వర రాజన్ కథానాయికగా నటించింది. క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 25న ఈ మూవీ అడియన్స్ ముందుకు వచ్చింది. మరీ ఈ సినిమా ఎలా ఉందో తెలుసుకుందాం.

మూవీ రివ్యూ: ఛాంపియన్
నటీనటులు: రోషన్ మేక, అనస్వర రాజన్, నందమూరి కళ్యాణ చక్రవర్తి, నవీన్, సంతోష్ ప్రతాప్ తదితరులు
సినిమాటోగ్రఫీ: మధి
ఎడిటింగ్: కోటగిరి వెంకటేశ్వరరావు
సంగీతం: మిక్కీ జే మేయర్
కథ, స్క్రీన్ ప్లే, దర్శకుడు: ప్రదీప్ అద్వైతం
నిర్మాణ సంస్థ: స్వప్న సినిమాస్
కథ:
1940స్‌లో మైఖేల్ విలియమ్స్ (రోషన్ మేక) సికింద్రాబాద్ రీజియన్‌కు ఇడే ఫుట్ బాల్ ప్లేయర్. ఎలాగైనా ఇంగ్లాండ్ వెళ్లి ప్లేయర్‌గా సెటిల్ అవ్వాలనేది అతని కల. దానికోసం ప్రయత్నిస్తూ ఉంటాడు. అదే సమయంలో అతడికి లండన్ వెళ్లే అవకాశం వస్తుంది. కానీ అక్కడే ఓ చిక్కు వచ్చి పడుతుంది. అది తప్పించుకునే క్రమంలో బైరాన్‌పల్లి అనే ఊరికి వెళ్తారు.. అక్కడే కొన్ని రోజులు తల దాచుకోవాలసి వస్తుంది. మరోవైపు ఇండియా అంతా స్వాతంత్ర్యం వచ్చినా.. నిజాం పాలనలో ఉన్న బైరాన్ పల్లి మాత్రం వాళ్ల కాళ్ల కిందే నలిగిపోతూ ఉంటుంది. అదే ఊళ్లో ఉండే చంద్రకళ (అనస్వర రాజన్)తో మైఖెల్‌కు పరిచయం అవుతుంది. ఆ సమయంలోనే ఊరి మీద పడి రజాకార్లు మారణకాండ సృష్టిస్తారు. నిజాం పాలకులకు వ్యతిరేకంగా ఆ ఊరి ప్రజలు చేసిన తిరుగుబాటు మైఖేల్‌లో ఎటువంటి మార్పు తీసుకొచ్చింది.. బాబు దేశ్‌ముఖ్ (సంతోష్ ప్రతాప్)తో మైఖేల్‌కు ఎందుకు గొడవ అయింది..? లండన్ వెళ్లాలని కలలు కన్న మైఖెల్ బైరాన్ పల్లి కోసం ఏం చేశాడు.. అనేది మిగిలిన కథ..
కథనం:
కొన్నిసార్లు కథ కంటే కథనం సినిమాను ముందుకు నడిపిస్తూ ఉంటుంది. ఛాంపియన్ అలాంటి సినిమానే.. ఇదేమీ తెలియని కథ కాదు.. గట్టిగా మాట్లాడుకుంటే గ తేడాది వచ్చిన రజాకర్ సినిమాను కాస్త కమర్షియలైజ్ చేసి తీశారు. ఆ సినిమా రావడమే ఛాంపియన్‌కు మైనస్ అయ్యే అవకాశం లేకపోలేదు. కాకపోతే అందులో ఒక మంచి ఎమోషనల్ డ్రైవ్ తీసుకున్నాడు దర్శకుడు ప్రదీప్ అద్వైతం. ఇండిపెండెన్స్ మూమెంట్ సెటప్.. అప్పటి పరిస్థితులు.. నిజాం పాలన.. రజాకార్ల అరాచకాలు.. వీటన్నింటి మధ్యలో ఇంగ్లాండ్ వెళ్లి ఫుట్బాల్ ఆడి జీవితంలో సెటిల్ అవ్వాలనుకునే ఒక యువకుడి కల.. వీటన్నింటినీ బాగానే బ్లెండ్ చేశాడు దర్శకుడు ప్రదీప్. కథలోకి వెళ్లడానికి చాలా టైం తీసుకున్నాడు. ఫస్టాఫ్ మొత్తం కాస్త నెమ్మదిగా వెళుతుంది.. ఇంటర్వెల్ సీన్ మాత్రం అదిరిపోయింది. ఒక మూడు నాలుగు సీన్స్ ముందు నుంచి దానికోసం ఎమోషన్ సెట్ చేస్తూ వచ్చాడు. అందుకే ఇంటర్వెల్ బాగా పేలింది. అంత హెవీ ఇంటర్వ్యూ చూసిన తర్వాత సెకండ్ ఆఫ్ మళ్లీ కాసేపు స్లో అయింది. కొన్ని సన్నివేశాలు బాగా లాగ్ అనిపించాయి. కాస్త కఠినంగా ఉండి కొన్ని సీన్స్ తీసేసి ఉంటే పేస్ పెరిగేది. ప్రీ క్లైమాక్స్ నుంచి మళ్లీ సినిమా గాడిన పడింది. క్లైమాక్స్ ఎపిసోడ్ కూడా చాలా బాగుంది. ఎమోషన్ వైస్ గా ఛాంపియన్ ఆకట్టుకుంటుంది. టెక్నికల్‌గా టాప్ నాచ్ ఈ సినిమా.. ఈ విషయంలో వైజయంతి మూవీస్‌ను మెచ్చుకోవాలి. హీరో మార్కెట్‌తో పని లేకుండా కథను నమ్మి బడ్జెట్ పెట్టారు వాళ్ళు. కాకపోతే సినిమాలో కొన్ని ఎమోషనల్ పాయింట్స్ మిస్ చేసినట్లు అనిపిస్తుంది. రజాకార్ మూవెంట్ అంటే చాలా ఎమోషన్స్ ఉంటాయి.. కానీ కథలో ఇది భాగంగా తీసుకున్నాడు కాబట్టి అక్కడక్కడ టచ్ చేసి వదిలేసాడు దర్శకుడు ప్రదీప్. చివరికి వచ్చేసరికి ఆ ఎమోషన్ బాగానే బిల్డ్ చేసినా.. ముందు నుంచి కాస్త స్లో నెరేషన్ ఇబ్బంది పెడుతుంది. దానికితోడు సెకండాఫ్ కూడా కాస్త వేగంగా ఉండుంటే ఇంకా బాగుండేది. అయితే నటీనటుల పర్ఫార్మెన్స్, టెక్నికల్ అంశాలు ఈ సినిమాను నిలబెట్టాయి.
నటీనటులు:
రోషన్ చాలా బాగా నటించాడు.. మనోడి తెలంగాణ యాసకు ఫిదా అయిపోతారు. అనస్వర రాజన్ తన పాత్రకు న్యాయం చేసింది. మరో కీలకమైన పాత్రలో నందమూరి కళ్యాణ చక్రవర్తి అద్భుతంగా ఉన్నాడు.. 37 ఏళ్ల తర్వాత ఈయనను స్క్రీన్ మీద చూడడం బాగుంది. విలన్ సంతోష్ ప్రతాప్ క్యారెక్టర్ బాగుంది. ఊళ్ళో ఉన్న పాత్రలు కూడా అన్నీ బాగానే చేసారు.
టెక్నికల్ టీం:
మిక్కీ జే మేయర్ సంగీతం సినిమాకు ప్లస్. గిరా గిరా, సల్లంగుండాలే పాటలు స్క్రీన్ మీద కూడా చాలా బాగున్నాయి. ఎడిటింగ్ కాస్త కఠినంగా ఉండాల్సింది. అక్కడక్కడా కొన్ని సీన్స్ ల్యాగ్ అయ్యాయి. కాకపోతే దర్శకుడి ఛాయిస్ కాబట్టి అతన్ని తప్పు బట్టలేము. సినిమాటోగ్రఫీ పీక్స్‌లో ఉంది. దర్శకుడు ప్రదీప్ అద్వైతం తన పాత్రను బాగానే పోషించాడు కాకపోతే ఇంకాస్త ఎమోషనల్‌గా తీసుంటే బాగుండేది. అప్పటికీ యాక్షన్ ఎపిసోడ్స్, టెక్నికల్ పరంగా ఛాంపియన్ నిజంగానే ఛాంపియన్ అనిపించుకున్నాడు.
పంచ్ లైన్:
ఓవరాల్‌గా ఛాంపియన్.. మనసులు గెలిచాడు..!
