Yadagiri Gutta: రూపురేఖలు మారబోతున్న యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనృసింహుడు..!
ఫిబ్రవరి 23వ తేదీన ముందుగా దిష్టికుంభం, నైవేద్యం, గుమ్మడికాయ, కొబ్బరికాయ సమర్పించి యాగశాలలో ఏర్పాటు చేసిన మహా కుంభాభిషేకం కలశంతో దివ్య విమాన రాజగోపురం వానమామలై మధుర పీఠాధిపతి రామానుజ జీయర్ స్వామి ప్రత్యక్ష పర్యవేక్షణలో పంచకుండాత్మక మహాయాగం నిర్వహించనున్నారు. ఈ మహా క్రతువులో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొనేందుకు ఆలయ పాలక మండలి వసతులను ఏర్పాటు చేశారు.

ప్రపంచ అద్భుత ఆధ్యాత్మిక క్షేత్రంగా విరాజిల్లుతున్న యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహ స్వామి ఆలయం కొత్త రూపు సంతరించుకుంది. రాష్ట్రంలో ఏ దేవాలయంలో లేని విధంగా ఆలయ విమానం గోపురం స్వర్ణమయమైంది. బంగారు తొడుగులతో స్వామివారి ప్రతిమ దేదీప్యమానంగా వెలుగుతూ ఆకర్షణీయంగా కనువిందుచేస్తోంది.
యదాద్రి భువనగిరి జిల్లాలోని యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీ నరసింహస్వామి దేవాలయాన్ని మాజీ సీఎం కేసీఆర్ చరిత్రలో నిలిచి పోయేలా పునర్నిర్మాణం చేపట్టారు. ఆలయ ఉద్ఘాటన తర్వాత లక్ష్మీ నరసింహస్వామి దివ్య విమాన గోపురాన్ని125 కిలోల స్వచ్ఛమైన బంగారంతో తాపడం చేయాలని నిర్ణయించారు. భక్తుల భాగస్వామ్యంతో బంగారు తాపడం చేయాలని భావించినా.. అది కార్యరూపం దాల్చలేదు.
68 కిలోలతో బంగారు తాపడం..
ప్రధాన ఆలయ దివ్య గోపురం స్వర్ణ తాపడానికి మొత్తం 165 కిలోల బంగారు తాపడానికి రూ.65 కోట్ల వరకు ఖర్చు అవుతుందని అంచనా వేశారు. దాతల నుంచి విరాళాల ద్వారా పదకొండు కిలోల బంగారం, రూ.20 కోట్ల నగదు సమాకూరింది. సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశాలతో మంత్రులు కొండా సురేఖ, కోమటిరెడ్డి వెంకటరెడ్డి.. ఆలయ అధికారులతో స్వర్ణ తాపడంపై ఎప్పటికప్పుడు సమీక్షించారు. సీఎం రేవంత్ రెడ్డి ఆలయ సందర్శన సమయంలో ఆలయ ముఖ్యుల సూచనల మేరకు 68.84 కిలోల బంగారం సరిపోతుందని అధికారులు నిర్ణయించారు.
ఆలయ హుండీల ద్వారా 1300 కిలోల వెండి, నగల రూపంలో వచ్చిన బంగారాన్ని విమాన గోపురం తయారీకి వినియోగించింది. మహాబలిపురంలో రాగి తొడుగులను తయారు చేసి చెన్నైలోని స్మార్ట్ క్రియేషన్స్ కంపెనీ ద్వారా స్వర్ణ కవచాలను ఆలయ గోపురానికి ఏర్పాటు చేశారు. గత ఏడాది దసరా రోజున చేపట్టిన స్వర్ణ తాపడం పనులు పూర్తయ్యాయి. స్వర్ణ తాపడం పనుల కోసం స్వామి వారికి వచ్చిన బంగారం, విరాళం తోపాటు హుండీ ఆదాయాన్ని వెచ్చించారు.
నానో టెక్నాలజీ.. 50 ఏళ్ల గ్యారంటీ..
గర్భాలయంపై 49.5 అడుగుల ఎత్తు, 10,857 చదరపు అడుగుల మేర ఉన్న విమానానికి 68 కిలోల బంగారంతో తాపడం పనులు పూర్తి చేశారు. 50.5 అడుగులతో దేశంలోనే అత్యంత ఎత్తయిన పంచతల గోపురంగా నిలుస్తోంది. రాష్ట్రంలో ఇప్పటి వరకు ఏ ఆలయ గోపురానికి స్వర్ణ తాపడం లేదు. నానో టెక్నాలజీతో 24 క్యారెట్ల బంగారం తాపడంతో 50 ఏళ్లపాటు చెక్కుచెదరకుండా ఉండేలా పనులు చేశారు.
19 నుండి 22 వరకు ప్రత్యేక కార్యక్రమాలు
యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీ నరసింహస్వామి విమానం(గోపురం) స్వర్ణమయం చేసే పనులు పూర్తయ్యాయి. ఫిబ్రవరి 19 నుంచి 23 వరకు స్వర్ణ విమానావిష్కరణ,మహా సంప్రోక్షణకు మహా కుంభాభిషేకం నిర్వహించేందుకు ఆలయ అధికారులు భారీ ఏర్పాట్లు చేశారు. స్వాగత తోరణాలు, విద్యుతీపాలు, కొండకింద రింగ్ రోడ్డు, గండిచెరువు తదితర ప్రాంతాలు అలంకరించి శోభాయమానం చేశారు. ఐదు రోజుల పాటు నిర్వహించే నారసింహ హోమంకు భారీ ఏర్పాట్లు చేశారు. కుంభాభిషేకానికి ఆలయ ఉత్తర తిరువీధిలో హోమకుండాలను ఏర్పాటు చేశారు.
హోమ గుండాల మధ్యలో స్వామివారిని ఆవాహన చేసి ప్రతిష్టించి యజుర్వేదాలు ఆలపించేందుకు 108 మంది రుత్వికులతో పాటు అదనంగా వంట స్వాములు 15 మందిని ఆహ్వానించారు. ఈ నెల 22 వరకు 60మంది రుత్వికులు లక్ష్మీ, నరసింహ, సుదర్శన, రామాయణం, భాగవతం, మూల మంత్ర హవనాలు, మూల మంత్ర జపాలతో పాటు ఉదయం సాయంత్రం విష్ణు, నరసింహ, రామాయణం, భాగవత పారాయణాలతో పాటు అభిషేకాలు నిర్వహిస్తారు.
23న స్వర్ణ విమానావిష్కరణ, మహా సంప్రోక్షణ..
ఫిబ్రవరి 23వ తేదీన ముందుగా దిష్టికుంభం, నైవేద్యం, గుమ్మడికాయ, కొబ్బరికాయ సమర్పించి యాగశాలలో ఏర్పాటు చేసిన మహా కుంభాభిషేకం కలశంతో దివ్య విమాన రాజగోపురం వానమామలై మధుర పీఠాధిపతి రామానుజ జీయర్ స్వామి ప్రత్యక్ష పర్యవేక్షణలో పంచకుండాత్మక మహాయాగం నిర్వహించ నున్నారు. ఐదు రోజులపాటు నిర్విగ్నంగా హోమాలు, జపాలు, అభిషేకాలు చేపట్టిన రుత్వికులు, పారాయణికులు, యాజ్ఞికులు నాలుగు గంటల పాటు శాంతి కల్యాణం నిర్వహిస్తారు.
ఈ మహా క్రతువులో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొనేందుకు ఆలయ పాలక మండలి వసతులను ఏర్పాటు చేశారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు భక్తులకు ఉచిత ప్రసాద వితరణ చేస్తామని, బంగారు తొడుగుల కోసం విరాళాలు అందజేసిన దాతలకు ఆహ్వానాలు కూడా పంపామని అధికారులు చెబుతున్నారు. ఎన్నికల కమిషన్ అనుమతిస్తే కార్యక్రమంలో సీఎం రేవంత్ పాల్గొనే అవకాశాలున్నాయని ఆలయ అధికారులు చెబుతున్నారు.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..