Tirumala: గంటలో తిరుమల వెంకన్న దర్శనం.. ఎలా సాధ్యం కాబోతుందంటే..?
తిరుమల ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన హిందూ ధార్మిక క్షేత్రం. తిరుమలకు మరింత ఆధ్యాత్మిక శోభ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తోంది టీటీడీ. చారిత్రాత్మక నేపథ్యం, ఆధ్యాత్మిక వైభవం ఉట్టిపడేలా టీటీడీ పాలక మండలి ప్రయత్నాలు ముమ్మరం చేసింది. అలాగే, భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చేయాలన్న ఉద్దేశంతోనే మాస్టర్ ప్లాన్ రూపొందిస్తామంటోంది టీటీడీ. ఈ క్రమంలోనే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారంగా భక్తులకు శీఘ్ర దర్శనం కల్పించేందుకు ఫ్లాన్ చేస్తోంది.
తిరుమల వెంకన్న దర్శనం మరింత సులభతరం చేసేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం ముమ్మర కసరత్తు చేస్తోంది. మారుతున్న టెక్నాలజీని అందిపుచ్చుకుని ముందుకు వెళ్తోంది. ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ సహకారంతో భక్తులకు శ్రీవారి దర్శనాన్ని కల్పించాలన్న ఆలోచన చేస్తోంది. ఇప్పటికే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌లో ఎక్స్‌పర్ట్స్ అయిన విదేశీ ప్రతినిధులతో టీటీడీ సంప్రదింపులు జరుపుతోంది. ప్రయోగాత్మకంగా అమలు చేసేందుకు శ్రీకారం చుట్టబోతోంది.
ఏడుకొండలవాడి దర్శనం కోసం కొండెక్కి తిరుమలకు చేరుకునే భక్తులకు శ్రీవారి దర్శనం మరింత సులభంగా జరిగేలా టీటీడీ ప్రయత్నిస్తోంది. గంటల తరబడి క్యూలైన్లు, కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉండకుండా శీఘ్ర దర్శనం కల్పించే ప్లాన్ చేస్తోంది. ఈ మేరకు టీటీడీ పాలకమండలి అడుగులు వేస్తోంది. తొలి సమావేశంలోనే బిఆర్ నాయుడు చైర్మన్ గా టీటీడీ ధర్మకర్తల మండలి ప్రయత్నాలు ప్రారంభించింది.
సగటున రోజూ దాదాపు 70 వేల మంది భక్తులు తిరుమలేశుడిని దర్శించు కుంటుండగా వెంకన్న దర్శనం కోసం తిరుమల కొండపై భక్తులు ఇప్పటికీ అష్టకష్టాలే పడుతున్నారు. క్షణం పాటు శ్రీవారి దర్శనం దక్కితే చాలని భావించే భక్తులు స్వామివారిని దర్శించుకున్న తర్వాత ఆ కష్టాలను మరిచిపోతున్నారు. అయితే, ఆపద మొక్కుల స్వామి దర్శనానికి వస్తున్న భక్తులు ఏ ఇబ్బంది లేకుండానే శ్రీవారిని సులభతరంగా దర్శించు కోవాలన్న ప్రయత్నం చేస్తున్న టీటీడీ ఈ మేరకు ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ పై దృష్టి సారించింది.
గంటల తరబడి వేచి ఉండకుండా శ్రీవారి దర్శనం త్వరితగతిన పూర్తయ్యేలా కసరత్తు చేస్తోంది. వీలైతే తిరుమల శ్రీవారి దర్శనం గంటలో పూర్తయ్యేలా చేసేందుకు ప్రయత్నిస్తున్న టీటీడీ, ఈ మేరకు కార్యచరణ చర్చలు జరుపుతోంది. సాధ్యా సాధ్యాలను పరిశీలిస్తున్నట్లు తొలి పాలక మండలి సమావేశంలోనే టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు స్పష్టం చేశారు. ఈ మేరకు విదేశీ ప్రతినిధులతోనూ భేటీ అయ్యారు.
ఇక ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ లో నిపుణులైన విదేశీ ప్రతినిధుల బృందం టీటీడీతో చర్చలు కూడా జరుపుతోంది. ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ టెక్నాలజీ అమలుపై కసరత్తు చేస్తోంది. ఈ టెక్నాలజీని ప్రయోగాత్మకంగా పరిశీలించేందుకు టీటీడీలోని ఐటీ వింగ్‌తో కలిసి పనిచేస్తోంది. డిసెంబర్ 24న తిరుమలలో జరిగే పాలకమండలిలో చర్చకు తీసుకొచ్చే ప్రయత్నం జరుగుతోంది. శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తుడి ఆధార్ కార్డు నంబర్, ఫేస్ రికగ్నేషన్ రసీదు ద్వారా దర్శన సమయాన్ని నిర్ధారించి, టోకెన్లు జారీ చేసే విధానంపై చర్చ నడుస్తోంది. ఇలా టోకెన్ పొందిన భక్తులు కేటాయించిన సమయానికి నేరుగా వైకుంఠం క్యూ కాంప్లెక్స్ వద్దకు చేరుకుంటే అక్కడ ఫేస్ రికగ్నిషన్ ఎంట్రన్స్ లో స్కానింగ్ చేసి దర్శనానికి అనుమతించే అవకాశం ఉంటుంది. క్యూ లైన్‌లోకి వెళ్ళిన భక్తుడికి వెయిటింగ్ టైం లేకుండా గంట సమయంలోపే స్వామి వారి దర్శనం పూర్తి అవుతుందని టీటీడీ భావిస్తోంది.
ఇలా టోకెన్లను భక్తులకు జారీ చేసేందుకు ప్రత్యేక కౌంటర్లను ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. కొండకు భక్తులు వెళ్లే ముఖద్వారం అలిపిరి తోపాటు తిరుమలలోనూ ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేయాలన్న ఆలోచన చేస్తోంది. సిబ్బందితో పని లేకుండా ఏఐ టెక్నాలజీని తిరుమల కొండపై అమలు చేయడం ద్వారా మరింత పారదర్శకత తీసుకొచ్చే అవకాశం ఉంటుందని టీటీడీ ఆలోచిస్తోంది. ఈ విధానం అమలు కోసం నాలుగు విదేశీ సంస్థలు ఆసక్తి చూపిస్తున్నట్లు తెలుస్తోంది. ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ సాఫ్ట్‌వేర్‌ను అందించేందుకు ముందుకు వచ్చే ఏజెన్సీల నుంచి ఈ విధానాన్ని అమలు చేసి సక్సెస్ కావాలని చూస్తోంది. టీటీడీకి క్యూ లైన్ మేనేజ్మెంట్ మరింత ఈజీ అయ్యే అవకాశం ఉంటుందని భావిస్తోంది.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..