AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

జాతకంలో కుజ దోషమా.. వివాహం ఆలస్యం అవుతుందా.. ఈ అంగారక ఆలయాన్ని దర్శించండి.. ఎక్కడంటే

తమిళనాడులో చిన్న పెద్ద ఆలయాలు వేలాదిగా ఉన్నాయి. వీటిల్లో కొన్ని ఆలయాలు ప్రపంచప్రసిద్దిచెందినవి. అలాంటి ఆలయాల్లో ఒకటి కుజుడు ఆలయం. తిరునెల్వేలి జిల్లాలోని తామిరబరణి నది ఒడ్డున ఉన్న కొడగనల్లూర్ కైలాసనాథర్ ఆలయం. ఇది నవ గ్రహాల్లో ఒకటైన అంగారక గ్రహానికి అంకితం చేయబడిన ఆలయంగా పరిగణించబడుతుంది. ఈ ఆలయ చరిత్ర ఋషి, యువరాజు, పాముతో ముడిపడి ఉంది. జాతకంలో కుజ సమస్య ఉంటే ఈ గుడికి వెళ్లి పూజలు చేయించుకోవడం వలన ఫలితం ఉంటుంది. ఈ రోజు ఆలయం గురించి తెల్సుకుందాం..

జాతకంలో కుజ దోషమా.. వివాహం ఆలస్యం అవుతుందా.. ఈ అంగారక ఆలయాన్ని దర్శించండి.. ఎక్కడంటే
Kodaganallur Kailasanathar Temple
Surya Kala
|

Updated on: May 28, 2025 | 5:55 PM

Share

తమిళనాడు తిరునెల్వేలి జిల్లాలో తరగని జీవనదిలా ప్రవహించేతామిరబరణి నది ఒడ్డున నిర్మించిన దేవాలయాలలో 9 గ్రహాలను పూజిస్తారు. ఇందులో సూర్యభగవానుడి ఆలయం పాపనాశంలోని పాపనాథర్ స్వామి ఆలయం, చంద్రుని ఆలయం చేరన్ మహాదేవిలోని అమ్మనాథర్ ఆలయం ఉన్నాయి. అయితే కొడగనల్లూరులోని కైలాసనాథర్ ఆలయం తొమ్మిది గ్రహాలలో అత్యంత ముఖ్యమైన గ్రహంగా పరిగణించబడే అంగారక గ్రహానికి చెందిన ఆలయం ఉంది.. ఈ ఆలయం గురించి పురాణం కథ, ఆలయ ప్రత్యేకతలతో సహా వివిధ సమాచారాన్ని ఈ రోజు మనం తెలుసుకుందాం.. ఈ ఆలయం ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, సాయంత్రం 4.30 నుంచి 7 గంటల వరకు భక్తుల సందర్శనార్థం తెరిచి ఉంటుంది.

కుజుడి ఆలయ చరిత్ర చాలా సంవత్సరాల క్రితం ఈ ప్రాంతంలో ఒక ఋషి తపస్సు చేస్తూ ఉండేవాడట. తండ్రి తపస్సుకి ఋషి కొడుకు సహాయం చేసేవాడు. ఒక రోజు రుషి కొడకు కట్టెలు సేకరించడానికి అడవిలోకి వెళ్ళాడు. ఆ సమయంలో ఆ ప్రాంతం గుండా వెళుతున్న ఒక యువరాజు, రాజ్యాభివృద్ధి కోసం ఒక యజ్ఞం చేయాలని భావించి, తపస్సు చేస్తున్న మునిని మేల్కొలపడానికి ప్రయత్నించాడు. యజ్ఞం గురించి అడగాలని ఆశించిన యువరాజు నిరాశ చెందాడు.

ఎన్ని ప్రయత్నాలు చేసినా ఆ ముని తపస్సు ను నుంచి లేవలేదు. దీంతో యువరాజుకి కోపం వచ్చి.. ఋషికి సమీపంలో చచ్చి పడి ఉన్న పామును తీసుకొచ్చి.. ఆ ముని మెడలో వేసి వెళ్ళిపోయాడు. ఇంతలో, కట్టెలు సేకరించడానికి వెళ్ళిన కొడుకు తిరిగి వచ్చి తన తండ్రి మెడలో చచ్చిన పామును చూసి చాలా ఆగ్రహించాడు. తన దివ్య దృష్టితో యువరాజు ఇలా చేశాడని తెలుసుకుని ఆ బాలుడు నేరుగా రాజభవనానికి వెళ్లి. తన తండ్రి మెడలో చచ్చిన పాముని వేసి అవమానించావు కనుక.. నీ తండ్రి పాము కాటుతో మరణిస్తాడు అని ముని బాలకుడు శపించాడు.

ఇవి కూడా చదవండి

దీని తరువాత మహారాజు జాతకాన్ని పరిశీలించిన జ్యోతిష్కులు రాజుకు సర్ప గండం ఉందని తెలియజేశారు. అప్పుడు తన తండ్రి ప్రాణాలను కాపాడుకునేందుకు యువరాజు.. మహారాజు నివసించేందుకు ఒక రాజభవనాన్ని నిర్మించాడు. పాము కాదు కదా కనీసం చీమ కూడా ఆ భవనంలో వెళ్ళలేనంతగా ఏర్పాట్లు చేశాడు. అయితే ఒకానొక సమయంలో మహా రాజు ఒక మామిడి పండు తింటున్నప్పుడు.. దానిలో దాగి ఉన్న పాము రాజును కరిచింది. అతను మరణించాడు.

పాము తాను చేసిన పాపం నుంచి బయటపడాలని భావించింది. అప్పుడు పాము విష్ణువు అనుగ్రహం కోసం ధ్యానం చేసింది. అప్పుడు విష్ణువు ప్రత్యక్షం అయి ఒక పరిహారాన్ని సూచించాడు. శివుడిని పూజించడం ద్వారా మాత్రమే పాపం తొలగిపోతుందని చెప్పాడు. దీని తరువాత పాము శివుడిని పూజించి పాపం నుంచి విముక్తి పొందింది. శివుడు కైలాసం నుంచి పాము పాపాన్ని తొలగించడానికి వచ్చాడు కనుక ఈ ఆలయానికి కైలాసనాథర్ ఆలయం అని పేరు పెట్టారని పురాణం కథనం. ఈ ఆలయంలో శివుడు కైలాసనాథర్, పార్వతి దేవి శివగామి దేవిగా భక్తులకు దర్శనమిస్తారు. అలాగే ఈ పవిత్ర స్థలాన్ని సందర్శించే ఎవరినీ కాటు వేయవద్దని ఆదేశించాడు . నేటికీ, వివిధ రకాల పాములు ఈ పట్టణంలో నివసిస్తున్నాయి. అయినప్పటికీ వాటిలో ఏవీ మానవులకు హాని కలిగించవు.

ఆలయ ప్రత్యేకతలు

ఈ కైలాసనాథ్ ఆలయంలో ధ్వజస్తంభం, బలిపీఠం లేదా విగ్రహాల పరివారం లేవు. ద్వారకులుగా కళ్యాణ వినాయకుడు, మురుగన్ లు ఉంటారు. అదేవిధంగా మంగళవారం రోజు భగవంతుడికి పప్పును ప్రసాదంగా సమర్పించి, ఎర్రటి దుస్తులు ధరించి పూజించడం వల్ల చెడు తొలగిపోతుందని భక్తులు నమ్ముతారు.

ఈ ఆలయంలో ఐదు తలల సర్పం కింద నిలబడి ఉన్న అనంత గౌరి విగ్రహం కూడా ఉంది. వివాహంలోజాప్యం అవుతున్న, లేదా పదే పదే వాయిదా పడుతున్న మహిళలు ఈ ఆలయంలోని నందికి 58 వేళ్ల పసుపు దారాన్ని దండగా కట్టి పూజిస్తే.. వారు కోరుకున్న విధంగా త్వరలోనే వివాహం జరుగుతుందని నమ్ముతారు. శివరాత్రి, ప్రదోష రోజులలో ఇక్కడ ప్రత్యేక పూజలు కూడా నిర్వహిస్తారు.

మనిషి జీవితంలో కుజుడి దశ ఏడు సంవత్సరాలు ఉంటుందని జ్యోతిష్యం చెబుతోంది. ఈ ఏడు సంవత్సరాలు అంగారకుడి అనుగ్రహం ఉంటేనే జీవితం సుసంపన్నంగా , ప్రత్యేకంగా ఉంటుంది. కొంతమంది జాతకంలో కుజు దోషం ఉంటుంది. స్త్రీ, పురుషుల జాతకంలో కుజ దోషం ఉంటే వారి వివాహం ఆలస్యం అవుతుందని అంచనా. ఇలాంటి సమస్య ఉన్నవారు ఈ ఆలయానికి వచ్చి పూజ చేయడం వలన కుజ దోషం తొలగి వెంటనే వివాహం జరుగుతుందని నమ్మకం. అంతేకాదు మంచి కెరీర్, విద్య, ఉద్యోగం వంటి వివిధ కారణాలతో భక్తులు భగవంతుడిని ప్రార్థిస్తారు. తమ కోరికలు నెరవేరిన తర్వాత నంది చుట్టూ గంటను కడతారు.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు