Ayodhya: అయోధ్యలో రామ దర్భార్ ప్రాణ ప్రతిష్ట ముహర్తం ఫిక్స్.. జూన్ ౩ నుంచి 5 వరకు వివిధ కార్యక్రమాలు
అయోధ్యలో రామ మందిర నిర్మాణం పనులు తుది దశకు చేరుకుంటున్నాయి. రామాలయంలో రామ దర్బార్ సహా 8 ఆలయాలను జూన్ నెలలో పవిత్రీకరణ చేయనున్నారు. జూన్ 5న, గంగా దసరా రోజున ఈ ఆచారం అభిజిత్ ముహూర్తంలో ఉదయం 11:25 నుంచి 11:40 వరకు నిర్వహించనున్నారు. ఈ కర్మకు ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. కలశ యాత్ర, యాగం, వైదిక ఆచారాలతో ఈ వేడుక పూర్తవుతుంది. ఈ పవిత్రీకరణ కార్యక్రమంలో దేశం నలుమూలల నుంచి సాధువులు, మహాత్ములు పాల్గొంటారు.

త్రేతా యుగంలో రామ దర్బారకి సంబందించిన ఊహ ఇప్పటికే ప్రజల మనస్సులలో ఉంది. ఈ ఊహ నిజమై త్వరలో అయోధ్యలో స్పష్టమైన రూపాన్ని సంతరించుకోబోతోంది. గంగా దసరా శుభ సందర్భంగా, రామాలయంలో ఘనంగా రామ దర్బార్ ప్రతిష్టించనున్నారు. దీనితో పాటు రామాలయ ప్రాంగణంలో మరో ఏడు దేవాలయాల పవిత్రీకరణ కూడా జరుగుతుంది. దీని కోసం జూన్ 5న అభిజిత్ ముహూర్తంలో అంటే గంగా దసరా రోజున ఉదయం 11.25 నుంచి 11.40 వరకు ప్రత్యేక శుభ సమయాన్ని నిర్ణయించారు. ద్వాపర యుగం ఈ తిధి, సమయంలో ప్రారంభమైందని నమ్ముతారు.
ఈ కార్యక్రమానికి ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ముఖ్య అతిథిగా పాల్గొంటారు. శ్రీరాముడు,సీతాదేవి. రామయ్య సోదరుడు లక్ష్మణుడు, హనుమంతుడు రామాలయం మొదటి అంతస్తులో ఉన్న గొప్ప రామ దర్బార్‌లో ఆశీనులై భక్తులకు కనువిందు చేయనున్నారు. ఆలయ ప్రాంగణం లోపల నిర్మించిన ఇతర దేవాలయాలలో కూడా దేవతల విగ్రహాలను ప్రతిష్టించనున్నారు. జూన్ 5న గంగా దసరా సందర్భంగా వీటన్నింటికి ప్రతిష్ట చేస్తారు. దీనికి అవసరమైన అన్ని సన్నాహాలు జూన్ 2 నుంచి ప్రారంభమవుతాయి.
కలశ యాత్రతో ఆచారాలు ప్రారంభమవుతాయి.
ముందుగా కలశ యాత్రను చేపట్టనున్నారు. తరువాత జూన్ 3న యాగ మండపానికి పూజ, అగ్నిదేవుని ప్రతిష్టాపన జరుగుతాయి. ఇలా జూన్ 3 నుంచి జూన్ 5 వరకు ప్రాణ ప్రతిష్ఠకు సంబంధించిన వివిధ కార్యక్రమాలను నిర్వహించనున్నట్లు వివరించారు. యాగ మండప నిర్మాణ పనులు కూడా జూన్ 1 నాటికి ఎట్టి పరిస్థితుల్లోనూ పూర్తీ చేయనున్నామని ట్రస్ట్ అధికారులు చెప్పారు. కాశీ పీఠాధీశ్వర్ శంకరాచార్య స్వామి అవధేశానంద గిరి, ఆచార్య విద్యా రామానుజాచార్య స్వామి, సౌభాగ్య నారాయణాచార్య స్వామితో పాటు దేశంలోని ప్రముఖ సాధువులు, మహాత్ములు, దక్షిణ భారతదేశంలోని వేద ఆచార్యులు, పీఠాధీశ్వరులు ఈ క్రతువులో పాల్గొంటారని ఆలయ నిర్వాహకులు తెలిపారు.
ఇప్పటికే ఆహ్వానం పంపించిన ట్రస్ట్
అదేవిధంగా పండిట్ ఇంద్రేష్ మిశ్రా , ఆచార్య ప్రవీణ్ శర్మలను కూడా ఢిల్లీ నుంచి ప్రత్యేకంగా ఆహ్వానించారు. ఈ కార్యక్రమానికి వివిధ సంప్రదాయాలకు చెందిన సాధువులు, మత పెద్దలతో పాటు ఆర్‌ఎస్‌ఎస్, విహెచ్‌పి, రామమందిర్ ట్రస్ట్ అధికారులకు ఆహ్వానాలను పంపించారు. ఈ కార్యక్రమంలో పాల్గొనే పోషకుల జాబితాను సిద్ధం చేశామని.. వారిని ఒక్కొక్కరిగా ఆహ్వానిస్తున్నామని ఆలయ నిర్వహణ వర్గాలు తెలిపాయి. దీని బాధ్యత ఇంద్రదేవ్ మిశ్రా, ఆచార్య ప్రవీణ్ శర్మలకు అప్పగించినట్లు తెలియజేశారు. దీనితో పాటు ఆచారాలను నిర్వహించే ఆచార్యుల జాబితాను కూడా సిద్ధం చేసినట్లు వెల్లడించారు.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు








