- Telugu News Spiritual Tirumala Srivari Brahmotsavam 2024: Celestial umbrellas and andal goda devi malas reached
Garuda Vahana Seva: గరుడసేవ కోసం తిరుమల చేరుకున్న చెన్నై గొడుగులు, ఆండాల్ గోదా దేవి మాలలు
అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడి బ్రహ్మోత్సవాల్లో కీలక ఘట్టం గరుడసేవ. శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో 5 వ రోజు గరుడ వాహనంపై ఊరేగే మలయప్ప స్వామికి అలంకరించేందుకు గొడుగులు, మాలలు తిరుమల కొండకు చేరాయి. హిందూ ధర్మార్థ సమితి చెన్నై నుండి తొమ్మిది గొడుగులు, రెండు పెరుమాళ్ నామాలను ఊరేగింపుగా తిరుమలకు తీసుకొచ్చింది. సమితి ట్రస్టీ ఆర్.ఆర్.గోపాల్‌జీ ఆధ్వర్యంలో తిరుమలకు చేరుకున్న గొడుగులకు టీటీడీ స్వాగతం పలికింది.
Updated on: Oct 08, 2024 | 8:02 AM

ఆలయం ముందు ఈ గొడుగులను టీటీడీ ఈవో జె.శ్యామలరావు, అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరికి అందించింది సమితి. నాలుగు మాడ వీధుల్లో ఊరేగించిన అనంతరం ఆలయంలోకి తీసుకెళ్లారు.

గరుడసేవలో ఈ గొడుగులను అలంకరించనుండగా చెన్నైకి చెందిన తిరుపతి అంబ్రెల్లా చారిటిస్ ట్రస్టీ వరదరాజులు 11 గొడుగులను టీటీడీ ఈవో శ్యామలరావుకు శ్రీవారి ఆలయం వద్ద అందజేశారు. శ్రీవారి ఆలయ డిప్యూటీ ఈవో లోకనాథం తో పాటు అధికారులు అర్చకులు పాల్గొన్నారు.

బ్రహ్మోత్సవాల్లోని ఈ రోజు జరగనున్న గరుడసేవలో స్వామివారికి అలంకరించేందుకు తమిళనాడులోని శ్రీవల్లిపుత్తూరు నుండి గోదాదేవి మాలలు తిరుమలకు చేరుకున్నాయి. ముందుగా తిరుమలలోని శ్రీ బేడి ఆంజనేయస్వామి ఆలయం వద్ద గల శ్రీ పెద్దజీయర్ మఠానికి మాలలను తీసుకొచ్చారు. అక్కడ తిరుమల పెద్దజీయర్‌స్వామి, చిన్నజీయర్‌స్వామి ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.

అనంతరం ఆలయ మాడవీధుల గుండా మంగళవాయిద్యాల నడుమ ఊరేగింపుగా గోదాదేవి మాలలను శ్రీవారి ఆలయంలోకి తీసుకెళ్లారు. రెండు కుటుంబాల వారీగా ఆండాళ్, శిఖామణి మాలలు శ్రీవారికి అలంకరించనున్నారు.

ఆండాల్ మాల షికామణి మాల అని కూడా పిలువబడే రెండు దండలు పెద్ద బుట్టలలో ఉంచి, తిరుపతికి 650 కిలోమీటర్ల దూరంలో ఉన్న తమిళనాడులోని శ్రీవల్లిపుత్తూరుకు చెందిన రెండు కుటుంబాల పూల తయారీ దారులు ఈ మాలలు సమర్పించారు.

శ్రీవల్లిపుత్తూరులో గోదాదేవికి అలంకరించిన మాలలను గరుడసేవ రోజు స్వామివారికి అలంకరించడం ఆనవాయితీగా వస్తోంది. శ్రీవల్లిపుత్తూరులోని శ్రీరంగమన్నార్‌స్వామివారి ఆలయానికి గోదాదేవి తండ్రి శ్రీపెరియాళ్వార్ పుష్పకైంకర్యం చేసేవారని, రంగనాథునిపై అనన్యభక్తి కలిగిన శ్రీ గోదాదేవి పూలమాలలను మొదట తాను ధరించి ఆ తరువాత స్వామివారికి పంపేవారని పురాణాల ద్వారా తెలుస్తోంది.

ఈ విషయాన్ని గుర్తించిన పెరియాళ్వార్ తన కుమార్తెను మందలించారని, ఆ తరువాత గోదాదేవి ధరించకుండా పంపిన మాలలను శ్రీరంగనాథుడు తిరస్కరించారని పురాణ కథనం.

గోదాదేవి శ్రీవారి దేవేరి అయిన భూదేవి అవతారంగా భావిస్తుండగా టీటీడీ ఈవో శ్యామలరావు, అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి తోపాటు శ్రీవల్లిపుత్తూరు ఆలయ స్థానాచార్యులు రంగరాజన్, సుదర్శన్, టిటిడి అధికారులు పాల్గొన్నారు.




