- Telugu News Spiritual Tirumala srivari brahmotsavam 2024: sarva bhoopala vahana seva held in grand scale
యశోప్రాప్తినిచ్చే సర్వభూపాల వాహన దర్శనం, కాళీయ మర్ధనుడి అలంకారంలో గోవిందుడు, ఆకట్టుకున్న కళా ప్రదర్శనలు
తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా సాగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో నాలుగో రోజైన సోమవారం రాత్రి శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామి సర్వభూపాల వాహనంపై కాళీయ మర్ధనుడి అలంకారంలో దర్శనమిచ్చారు. వాహనం ముందు గజరాజులు నడుస్తుండగా, భక్తజన బృందాలు భజనలు, కోలాటాలు, జీయ్యంగార్ల గోష్టితో స్వామివారిని కీర్తిస్తుండగా, మంగళవాయిద్యాల నడుమ స్వామివారి వాహనసేవ కోలాహలంగా జరిగింది.
Updated on: Oct 08, 2024 | 9:07 AM

సర్వభూపాల అంటే అందరు రాజులు అని అర్థం. వీరిలో దిక్పాలకులు కూడా చేరతారు. తూర్పుదిక్కుకు ఇంద్రుడు, ఆగ్నేయానికి అగ్ని, దక్షిణానికి యముడు, నైరుతికి నిరృతి, పశ్చిమానికి వరుణుడు, వాయువ్యానికి వాయువు, ఉత్తరానికి కుబేరుడు, ఈశాన్యానికి పరమేశ్వరుడు అష్టదిక్పాలకులుగా విరాజిల్లుతున్నారు.

దిక్పాలకులు అందరూ స్వామివారిని తమ భుజస్కంధాలపై, హృదయంలో ఉంచుకుని సేవిస్తారు. తద్వారా వారి పాలనలో ప్రజలు ధన్యులవుతారు అనే సందేశాన్ని ఈ వాహనసేవ ఇస్తుందని పురాణాల ప్రసస్తి.

వాహనసేవలో తిరుమల శ్రీశ్రీశ్రీ పెద్దజీయర్‌స్వామి, శ్రీశ్రీశ్రీ చిన్నజీయర్‌స్వామి, ఈవో శ్రీ జె శ్యామలరావు, అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి, జేఈవోలు గౌతమి, వీరబ్రహ్మం, సివిఎస్వో శ్రీధర్ ఇతర అధికారులు పాల్గొన్నారు.

స్వపన తిరుమంజనం తిరుమంజనం రంగనాయకుల మండపంలో అంగరంగ వైభవంగా జరిగింది. ఉత్సవమూర్తులకు పవిత్ర సుగంధ స్నానం దాదాపు రెండు గంటల పాటు కొనసాగింది. వేదపారాయణమారులు శ్రీ సూక్తం, భూ సూక్తం, పురుష సూక్తం, నారాయణ సూక్తం, నీలా సూక్తాలను లయబద్ధంగా ఆలపించారు.

సుగంధ స్నానం పూర్తయిన తర్వాత శ్రీదేవి మరియు భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామివారిని విశేషమైన పూలమాలలు, కిరీటాలతో అలంకరించారు.

లవంగాలు, ఏలకులు, అంజీర, పిస్తాతో పాటు గులాబీ రేకులు, స్ట్రాబెర్రీలతో ఉత్సవ మూర్తులను ఆకర్షణీయంగా అలంకరించారు.

సర్వభూపాల వాహన సేవలో 20 బృందాలు, 527 మంది కళాకారులు తమ తమ కళాకృతులతో స్వామి వారిని ఆటలతో పాటలతో సేవించున్నారు. ఇందులో మనం రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల కళా బృందాలతో పాటు, జార్ఖండ్, కేరళా, తమిళనాడు, తెలంగాణ రాష్ట్రల నుండి వచ్చిన కళా బృందాలు ప్రదర్శించిన తీరు భక్తులను సంబ్రమాశ్చర్యాలతో, భక్తిరసాన్ని నింపాయి.

తిరుపతికి చెందిన శ్రీవేంకటేశ్వర సంగీత నృత్య కళాశాల విద్యార్థులచే భరతనాట్యం, కూచిపూడి నృత్యాలు, హైదరాబాద్ నుండి వచ్చిన గణేశ్ బృందం కొమ్ము కోయ, గోండు నృత్యం, వికారాబాద్ నుండి వచ్చిన అశోక్ బృందం ప్రదర్శించిన కోయ నృత్యం, రాజమండ్రికి చెందిన కె.రాణి బృందం కేరళ డ్రమ్స్, కడపకు చెందిన సి.బాబు బృందం ప్రదర్శించిన డప్పుల విన్యాసాలు ఆకట్టుకున్నాయి.

అంతేకాదు బెంగళూరుకు చెందిన దీప్తి బృందం ప్రదర్శించిన కృష్ణామృత కల్పమ్ రూపకం, గురువాయూర్ కు చెందిన పి.టి.చంద్రన్ బృందం ప్రదర్శించిన తిరువట్టకాళి అనే ప్రదర్శన కనువిందు చేశాయి.

జార్ఖండ్ కు చెందిన రూప్ సింగ్ బృందం ప్రదర్శించిన ఛండాలి నృత్యం, గుంటూరుకు చెందిన విజయలక్ష్మి ప్రదర్శించిన కాశ్మీరీ నృత్యం చూపరులకు రెండు కళ్ళు చాలవు అన్నట్లు సాగింది.

తమిళనాడుకు చెందిన సంధ్య బృందం ప్రదర్శించిన భరతనాట్యం, విశాఖపట్నం, శ్రీకాకుళం, తిరుపతి పట్టణాలకు చెందిన కోలాట బృందాలు ప్రదర్శించిన తీరు భక్తులను ఎంతగానో అలరించాయి.




