Ravana: దశకంఠుడికి దశమి పూజలు.. అక్కడి‌వారికి రావణుడే దేవుడు

మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లా అహేరి తాలుకా కొడిసెలగూడ గ్రామంలో రావణాసుర జాతర అంగరంగ వైభవంగా కొనసాగుతుంది. తొమ్మిదేళ్లుగా ప్రత్యేక పూజలు చేస్తూ రావణ బ్రహ్మను కొలుస్తున్నారు ఇక్కడి గిరిజనులు.

Ravana: దశకంఠుడికి దశమి పూజలు..  అక్కడి‌వారికి రావణుడే దేవుడు
Ravana
Follow us

| Edited By: Ram Naramaneni

Updated on: Oct 12, 2024 | 4:35 PM

దసరా పండుగ చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీక. రాముడు, రావణాసురున్ని యుద్ధంలో ఓడించి దశకంఠుడి అహంకారాన్ని అణచి విజయాన్ని సాదించిన రోజుగా యావద్భారతం పండుగ జరుపుకోవడం ఆనవాయితీ. పది తలల రావణాసురిడి విగ్రహాలను భారీ ఎత్తున ఏర్పాటు చేసి రావణ దహనం నిర్వహించడం దేశ వ్యాప్తంగా కొనసాగుతూ వస్తుంది. విజయ దశమి నాడు ఈ పండుగను కోట్లాది మంది ప్రజలు అట్టహాసంగా జరుపుకుంటారు కూడా.. కానీ ఈ ప్రాంతంలో మాత్రం అలా కాదు.. రావణ బ్రహ్మను దైవంగా, ఇలవేల్పుగా కొలుచుకోవడం.. దసర నవరాత్రులు ప్రత్యేక‌పూజలు చేయడం.. దశమి‌నాడు పెద్ద ఎత్తున జాతర చేయడం ఆనవాయితీ. రాముడిని శత్రువుగా రావణాసురిడిని దైవంగా బావించే ఆ గ్రామం గురించి తెలుసుకోవాలంటూ తెలంగాణ మహారాష్ట్ర సరిహద్దులోని కొడిసెలగూడకు వెళ్లాల్సిందే.

మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లా అహేరి తాలుకా కొడిసెలగూడ గ్రామంలో రావణాసుర జాతర అంగరంగ వైభవంగా కొనసాగుతుంది. తొమ్మిదేళ్లుగా ప్రత్యేక పూజలు చేస్తూ రావణ బ్రహ్మను కొలుస్తున్నారు ఇక్కడి గిరిజనులు. దసరా నవరాత్రుల్లో అమవాస్య మొదలు 11 రోజుల పాటు పూజలు నిర్వహించడం.. విజయదశమి (దసరా) పండగ వేళ రావణ బ్రహ్మ ఊరేగింపు చేపట్టడం ఇక్కడి ప్రత్యేకత. కొడిసెలగూడ మారుమూల గిరిజన కుగ్రామమే అయినా.. ఈ ప్రాంతానికి శ్రీలంక నుండి కూడా రావణాసురిడి భక్తులు పెద్ద ఎత్తున తరలి‌వస్తారు. రావణుడిని‌‌ తమ ఇల వేల్పుగా కొలిచే తెగకు‌ చెందిన గిరిజనులు‌ చత్తీస్‌ఘడ్, కేరళ, ఆంద్రప్రదేశ్, తమిళనాడు‌, మహారాష్ట్ర జిల్లాల నుండి పెద్ద ఎత్తున కొడిసెల గూడ తరలి‌వెళుతారు. ఈ 11 రోజుల పాటు మాంసం, మద్యపానం, దూమపానాన్ని గ్రామంలో నిషేదించి.. నియమనిష్టలతో‌ రావణుడిని కొలుస్తారు. కొడిసెల గూడ చుట్టు పక్కల 30 గ్రామాల ఆదివాసీ గిరిజనులు దశమి వేళ పెద్ద ఎత్తున తరలి‌వచ్చి‌ రావణబ్రహ్మ ఊరేగింపులో పాల్గొంటారు. జమ్మి పూజలు నిర్వహించినా.. జమ్మి ఆకు‌మాత్రం తెంపరు. అలా చేస్తే ప్రకృతి‌ ప్రక్రోపిస్తుందని.. రావణ బ్రహ్మ ఆగ్రహానికి ‌కారణం అవుతామని‌ చెప్తున్నారు‌‌ కొడిసెలగూడ గిరిజనులు.

మహారాష్ట్రలోని అకోలా జిల్లాలో సాన‌గోల గ్రామంలోనూ దశకంఠుడికి దశమి పూజలు చేస్తారు. ఈ ఊరి మధ్యలో నల్లరాయితో చేసిన పెద్ద రావణుడి విగ్రహం ఉంటుంది. ఆయన గొప్పతనాన్ని, దాన గుణాన్ని పొగుడుతూ పూజలు చేస్తారు. ఈ గ్రామంలో 300 ఏళ్లుగా గ్రామస్థులు దసరా రోజున రావణుడికి పూజలు చేయడం ఆచారంగా వస్తుంది. ఆ వేడుక చూడటానికి చుట్టుపక్కల ప్రాంతాల నుంచి సందర్శకులు పెద్ద ఎత్తున తరలి వస్తుంటారు. రావణాసురుని గొప్పతనాన్ని, శౌర్యాన్ని, దానగుణాన్ని వాల్మీకి మహర్షి అరణ్యకాండ 32వ సర్గలో వర్ణించాడని… కేవలం సీతమ్మపై వ్యామోహంతో రామాయణ ఇతిహాసంలో ఒక చెడ్డవాడిగా రావణాసూరుడు మిగిలిపోయాడని.. మహిళల పట్ల గౌరవంగా ఉండాలనే రావణాసురిడి జీవితం చెప్తుందని ఈ గ్రామస్తులు బావిస్తారు. ఈ గ్రామాల చుట్టు పక్కల రావణాసురిడి దహనం నిషేదం.. రాముడిపై మమకారం చూపుతూనే రావణాసురిడిని పూజలు చేయడం‌ ఇక్కడి గిరిజనం ప్రత్యేకత.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..