Magha Masam: మాఘమాసం విశిష్టత.. స్నానానికి ఆదివారం పూజకు ప్రాముఖ్యత.. ఈ మాసంలో ఏమి చేయాలి.. ఏమి చేయకూడదంటే..

Magha Masam: హిందువులకు కార్తీక మాసం(Karthika Masam)లో పెట్టె దీపానికి ఎంత ప్రాముఖ్యత ఉందో.. మాఘమాసంలో చేసే స్నానానికి కూడా అంతే ప్రాముఖ్యత ఉంది. ఈ ఏడాది మాఘమాసం ఫిబ్రవరి 02 బుధవారం..

Magha Masam: మాఘమాసం విశిష్టత.. స్నానానికి ఆదివారం పూజకు ప్రాముఖ్యత.. ఈ మాసంలో ఏమి చేయాలి.. ఏమి చేయకూడదంటే..
Magha Masam
Follow us
Surya Kala

|

Updated on: Feb 03, 2022 | 3:41 PM

Magha Masam: హిందువులకు కార్తీక మాసం(Karthika Masam)లో పెట్టె దీపానికి ఎంత ప్రాముఖ్యత ఉందో.. మాఘమాసంలో చేసే స్నానానికి కూడా అంతే ప్రాముఖ్యత ఉంది. ఈ ఏడాది మాఘమాసం ఫిబ్రవరి 02 బుధవారం పాడ్యమి నుండి మార్చి 02 బుధవారం అమావాస్య (Amavasya)వరకు ఉంది. ‘మఘం’ అంటే యజ్ఞం. యజ్ఞయాగాది క్రతువులకు మాఘమాసాన్ని శ్రేష్ఠమైనదిగా భావించి.. క్రతువులు నిర్వహించే వారు కనుక ఈ మాసం మాఘమాసమైంది. మాఘ స్నానం పవిత్రస్నానంగా భావిస్తారు. మాఘస్నాన మహాత్మ్యాన్ని బ్రహ్మాండ పురాణం పేర్కొంటోంది. మృకండుముని మనస్వినిల మాఘస్నాన పుణ్యఫలమే వారి కుమారుడైన మార్కండేయుని అపమృత్యువును తొలగించిందని పురాణ కథనం.

నదీ స్నానం అర్ఘ్యం: మాఘమాసంలో ఈ స్నానాలకు అధిష్ఠానదైవం సూర్య భగవానుడు. స్నానానంతరం సూర్యునికి అర్ఘ్యం సమర్పించడం ఒక ఆచారం. మాఘ స్నానంలో దివ్య తీర్థాలను స్మరించి పాపవినాశనం కోరుతూ స్నానం చేయడం సంప్రదాయం. స్నానం చేసేటప్పుడు “దు:ఖ దారిద్ర్య నాశాయ, శ్రీ విష్ణోతోషణాయచ! ప్రాత:స్నానం కరోమ్య, మాఘ పాప వినాశనం!” అని చేసిన తరువాత “సవిత్రేప్రసవిత్రేచ! పరంధామజలేమమ! త్వత్తేజసా పరిబ్రష్టం,పాపం యాతు సస్రదా!” అని చదవాలి. సూర్య భగవానునికి ఆర్గ్యమివ్వాలి. స్నాన సమయంలో ‘ప్రయాగ’ను స్మరిస్తే ఉత్తమ ఫలం లభిస్తుందని విశ్వాసం. మాఘ పూర్ణిమను ‘మహామాఘం’ అంటారు. ఇది ఉత్కృష్టమైన పూర్ణిమ. ఈ రోజున సముద్రస్నానం మహిమాన్విత ఫలదాయకమంటారు.

తిథులు: మాఘమాసంలో ఎన్నెన్నో వ్రతాలు, పర్వదినాలు, వివిధ దేవతలను ఉద్దేశించి జరపుకోవటం కనిపిస్తుంది. అందుకే మాసానికి తొలినాళ్ళనుండి అంత విశిష్టత ఉంది. ఈ మాసంలో వచ్చే ముఖ్యమైన తిథి “శుక్ల పక్ష చవితి” దీనిని “తిల చతుర్థి”అంటారు. దీన్నే “కుంద చతుర్థి” అని కూడా అంటారు. నువ్వులను తింటారు. నువ్వులతో లడ్లు చేసి పంచి పెడతారు. ఈ రోజున “డుంఢిరాజును” ఉద్దేశించి, నక్త వ్రతము పూజ చేస్తారు! డుంఢిని ఈ విధంగా పూజించడం వలన దేవతల చేత సైతం పూజలందుకుంటారని కాశీ ఖండములో తెలియజేశారు.”కుంద చతుర్థి” నాడు కుంద పుష్పాలతో పరమేశ్వరుని అర్పించి రాత్రి జాగారణ చేసినవారు, సకలైశ్వర్యాలను పొందుతారని కాలదర్శనంలో చెప్పబడింది.

మాఘమాసంలో చేయాల్సిన చేయకూడని పనులు: కొంతమంది ఈ నెల రోజులు ముల్లంగి దుంపను తినరు. ఈ మాసంలో నవ్వులను, పంచదారను కలిపి కలిపి తింటారు.నువ్వులను దానమిస్తారు. రాగి పాత్రలో గోధుమ రంగుగా ఉన్న నువ్వులను పాత్రతో సహా దానమిస్తే మంచిది.

పండగలు:

మాఘశుద్ద పంచమి”ని శ్రీ పంచమి అంటారు.ఈ పంచమి నాడే “సరస్వతీదేవి” జన్మించిందట. శ్రీ పంచమి రోజును సరస్వతిని పూజిస్తారు. మాఘశుద్ద సప్తమి ఇదే “సూర్య సప్తమి” లేదా రథసప్తమి అంటారు. తెల్లవారు జామున ఏడు జిల్లేడు ఆకులను అందులో రేగికాయలను ఉంచుకొని తలాపై పెట్టుకొని స్నానం చేస్తే ఏడు విధాలైన శాపాలు నశిస్తాయట. ఈ రోజున చిక్కుడుకాయలతో రథం చేసి కొత్త బియ్యంతో పాయసాన్ని వండి చిక్కుడు అకులలో పెట్టి సూర్యునికి నివేదన చేయడం ఆచారం. భీష్మాష్టమి మాఘమాసంలో శుక్లపక్షంలో రోహిణి నక్షత్రం ఉన్న అష్టమి తిథినాడు మధ్యాహ్నం సూర్యుడు నడినెత్తిన ప్రకాశిస్తూ ఉండగా అభిజిత్ లగ్నంలో భీష్మ పితామహుడు ధ్యాన స్థితుడై ప్రాణాలను విడిచిపెట్టాడట. స్వచ్చంద మరణం ఆయనకి వరం. మాఘ ఏకాదశిని భీష్మ ఏకాదశి అని కూడా అంటారు. ఈరోజున విశేష పూజలు చేయడం ఆనవాయితీ. ఇక మాఘమాసంలో వచ్చే ప్రతి ఆదివారాలు మహిమాన్వితాలే. ఈ విధంగా మాఘమాసమంతా “శివరాత్రి”వరకూ అన్ని పర్వదినాలే.

Also Read:

యాదాద్రీశుడికి విరాళంగా మరో కిలో బంగారం ఇవ్వనున్న ఆ నియోజకవర్గ ప్రజలు..