RTC: శివ భక్తులకు ఆర్టీసీ గుడ్ న్యూస్.. ఆ క్షేత్రాలకు ప్రత్యేక బస్సులు.. పూర్తి వివరాలివే..
కార్తిక మాసం స్టార్ట్ అయింది. శివ నామ స్మరణలో ఆలయాలు మార్మోగుతున్నాయి. వేకువ జాము నుంచే భక్తుల తాకిడితో సందడిగా మారుతున్నాయి. అయితే తెలుగు నేలపై శివయ్య క్షేత్రాలకు కొదవ లేదు. ఎన్నో పుణ్య..
కార్తిక మాసం స్టార్ట్ అయింది. శివ నామ స్మరణలో ఆలయాలు మార్మోగుతున్నాయి. వేకువ జాము నుంచే భక్తుల తాకిడితో సందడిగా మారుతున్నాయి. అయితే తెలుగు నేలపై శివయ్య క్షేత్రాలకు కొదవ లేదు. ఎన్నో పుణ్య క్షేత్రాలు ఉన్నాయి. ప్రసిద్ధ శైవ క్షేత్రాలకు వెళ్లే భక్తుల సౌకర్యార్థం ఆర్టీసీ ప్రత్యేక బస్సులను నడుపుతోంది. ఈ మేరకు రంగారెడ్డి రీజియన్ రీజనల్ మేనేజర్ ఎ.శ్రీధర్ వెల్లడించారు. దక్కన్ పంచశైవ క్షేత్రాలైన వేములవాడ, కాళేశ్వరం, రామప్ప, వేయి స్తంభాల గుడి, పాలకుర్తి ఆలయాలు సందర్శించే సౌకర్యాన్ని తీసుకువచ్చింది. కార్తీక మాసంలో ప్రతి ఆదివారం, కార్తీక పౌర్ణమికి ముందు రోజు మధ్యాహ్నం 2 గంటలకు హైదరాబాద్ నుంచి ఈ బస్సులు బయలుదేరతాయి. దర్శనానంతరం సోమవారం రాత్రి హైదరాబాద్ చేరుకుంటాయి. ఈ ప్రత్యేక సూపర్ లగ్జరీ బస్సు టికెట్ చార్జీ రూ.1,500. వీటితో పాటు పంచరామాలైన అమరావతి అమరేశ్వరాలయం, భీమవరం సోమేశ్వరాలయం, పాలకొల్లు క్షీరరామలింగేశ్వరాలయం, ద్రాక్షారామం భీమేశ్వరాలయం, సామర్లకోట కుమార రామాలయం క్షేత్ర సందర్శనాలకు ప్రతి ఆదివారం, కార్తిక పౌర్ణమికి ముందు రోజు సాయంత్రం 4 గంటలకు హైదరాబాద్ నుంచి బయలుదేరి దర్శనానంతరం మంగళవారం మధ్యాహ్నం 12 గంటలకు హైదరాబాద్ చేరుకుంటాయి.
ఈ ప్రత్యేక సూపర్ లగ్జరీ బస్సు టికెట్ చార్జీ రూ.2,540 ఉంటుంది. దర్శనం టికెట్ల కోసం, స్నానం, భోజన వసతి కోసం ముందుగానే బస్సులోనే చెల్లించాలి. వీటితో పాటు శ్రీశైలంలో రద్దీ మేరకు ప్రత్యేక బస్సులను నడుపుతున్నట్టు వివరించారు. వీటికి ముందస్తు రిజర్వేషన్ సౌకర్యం కల్పించారు. ప్రయాణికులు తమ సీట్లను ఎంజీబీఎస్, జేబీఎస్, దిల్‌సుఖ్‌నగర్ బస్‌స్టేషన్లతో పాటు ఏటీబీ ఏజెంట్ల వద్ద సీట్లు రిజర్వేషన్ చేసుకోవచ్చని తెలిపారు.
మరోవైపు.. ఏపీఎస్ఆర్టీసీ కూడా ప్రత్యేక బస్సులను నడిపిస్తోంది. ఒకే రోజున ఐదు శైవ పుణ్య క్షేత్రాలను దర్శించుకునేలా పంచారామాల ప్యాకేజీని ప్రారంభించింది. అమరావతి, భీమవరం, పాలకొల్లు, ద్రాక్షారామం, సామర్లకోటకు పంచారామాల ప్యాకేజీ వర్తిస్తుంది. ప్రతి శని, ఆది, సోమవారాల్లో ప్రత్యేక బస్సులు నడుస్తాయి. ఈ బస్సులు విజయవాడలోని పీఎన్‌బీఎస్ నుంచి ఉదయం 4 గంటలకు బయలుదేరి అదేరోజు రాత్రి తిరిగి వస్తాయి. ఆటోనగర్ టెర్మినల్ నుంచి ఉదయం 3 గంటలకు బయలుదేరి రాత్రికి తిరిగి వస్తాయి. సూపర్ లగ్జరీ ధర రూ.1100, ఆల్ర్టా డీలక్స్ ధర రూ.1055.
వీటితో పాటు త్రిలింగాలుగా పేరు గాంచిన యాగంటి, మహానంది, శ్రీశైలం పుణ్యక్షేత్రాలనూ ఒకేసారి దర్శించుకునే అవకాశాన్ని ఆర్టీసీ అధికారులు కల్పిస్తున్నారు. పీఎన్‌బీఎస్ నుంచి ప్రతి కార్తీక శనివారం రాత్రి 8 గంటలకు బస్సులు బయలుదేరతాయి. సోమవారం తిరిగి వస్తాయి. టిక్కెట్ ధరలు సూపర్ లగ్జరీ ధర రూ. 1800. ప్రయాణీకులు ఈ సదుపాయాన్ని సద్వినియోగం చేసుకోవాలని అధికారులు కోరుతున్నారు.
మరిన్ని ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి..