Religious Tourism In AP: కాశీ క్షేత్రమంత పవిత్రమైన త్రేత్రాయుగం నాటి శైవ క్షేత్రం.. జుత్తిగ సోమేశ్వర స్వామి ఆలయ విశిష్టత..
హిందువులందరూ పూజించే రాముడి జనన కాలమైన త్రేతాయుగంలో ఈ ఆలయాన్ని దేవతలే నిర్ణయించారని పురాణ కధనం.
Religious Tourism In AP: మన తెలుగు రాష్ట్రాల్లో మనకు తెలియని ఎన్నో పుణ్య క్షేత్రాలు, ప్రసిద్ధి ఆలయాలున్నాయి. అటువంటి క్షేత్రాల్లో ఒకటి ఉమా మహేశ్వర స్వామీ క్షేత్రం. హిందువులందరూ పూజించే రాముడి జనన కాలమైన త్రేతాయుగంలో ఈ ఆలయాన్ని దేవతలే నిర్ణయించారని పురాణ కధనం. ఆ ఆలయ విశిష్టత గురించి తెలుసుకుందాం.. !
వ్యాసుడు రచించిన పురాణాలలో వాయుపురాణం ఒకటి. ఆ పురాణం లో గోస్తనీ నది, ఉమా మహేశ్వర క్షేత్రం గురించి రాసారు. సాక్షాత్తూ ఆ క్షేత్రమే నేటికి పశ్చిమ గోదావరి జిల్లా పెనుమంట్ర మండలం లో జుత్తిగ గ్రామంలో అలరారుతుంది. సుందరమైన ప్రకృతి రమణీయతల మధ్య నిర్మితమైన చారిత్రక దేవాలయం ఇది. ఈ ఆలయం భక్తుల కోర్కెలు తీర్చే కల్పతరువుగా విరాజిల్లుచున్నది. ఈ ఆలయాన్ని దర్శించుకున్న భక్తులంతా ఆధ్యాత్మిక ఆనందానికి గురౌతారు. ఈ ఉమా వాసుకి రవి సోమేశ్వర స్వామి ని సేవించేవారికి శత్రు, రుణ, రోగ, మృత్యు భయాలు ఉండవని అంటారు. సోమవారం నాడు ఈ శివలింగాన్ని సేవించి అన్నదానం చేస్తే కోటి రెట్లు ఫలితం కలుగుతుందంట. మహా శివరాత్రి పర్వదినాన ఈ శివలింగాన్ని కి అభిషేకం చేసి అర్చించిన వారు పునర్జన్మ రహితమైన కైవల్యం పొందగలరని నమ్మకం.
త్రేతాయుగంలో రావణాసురుడు, అతని పరివారం దేవతలందరిని పీడిస్తుండేవారు. ఒకరోజు రవి, వాసుకి, సోముడు… రావణ భటులచే పరభావింపబడి దుఃఖిస్తుండగా, బ్రహ్మ వారి చేసి దుఃఖాన్ని పోగేట్టేందుకు… రావణవధ శ్రీఘ్రంగా జరిగి లోక కళ్యాణం జరిగేందుకు వారికి ఒక సలహా ఇచ్చారట. బ్రహ్మ ఆదేశానుసారము ఉమా, వాసుకి, సూర్య, చంద్రులు గోస్తనీ నది తీరంలో ఉత్తర వాహిని, నిత్య పుష్కరిణి ఉన్నచోట పశ్చిమాభి ముఖంగా శివలింగాన్ని ప్రతిష్టించి కొలవసాగారు. అలా త్రేతాయుగంలో నెలకొల్పబడిన ఈలింగమే శ్రీ ఉమావాసుకీ సోమేశ్వర లింగం. 15 వ శతాబ్దంలో కిల్జీ పాదుషా వారి ఆజ్ఞానుసారం సత్తిరాజు వంశస్తులచే ఈ దేవాలయం పునర్నిర్మాణం జరిగినట్లుగా ఇక్కడి శాసనాల ద్వారా తెలుస్తుంది. సత్తిరాజు వంశస్తులే ఆలయ నిర్వహక ధర్మకర్తలుగా వస్తూ ఉంటున్నారు.
ఆలయ గోపురాలు రమణీయ ప్రతిమలతో దర్శనమిస్తాయి. గర్భాలయంలో శ్రీ ఉమా వాసుకి రవి సోమేశ్వర స్వామి లింగం స్పటిక స్వచ్ఛంగా, పవిత్రంగా భాసిస్తుంది. ఈ ఆలయంలో ఉత్తరాన దక్షిణాభి ముఖంగా పార్వతీదేవి భక్తులకు దర్శనం ఇస్తున్నది. గర్భాలయన అమ్మవారు స్వర్ణ కిరీట ధారినై కుంకుమార్చనలను అందుకుంటూ ఉంటుంది. ఈ ప్రాంగణంలో అనేక దేవి, దేవతల ఆలయాలు ఉన్నాయి. పార్వతిదేవి ఎడమ భాగాన శ్రీభద్రకాళి, వీరభద్రేశ్వరుల ఆలయం ఉంది. మండప స్తంభాలు నయన మనోహరంగా ఉంటాయి. సప్తస్వరాధారుడైన సూర్యనారాయణుదు, ఛాయాదేవి సహితంగా ఉషఃకిరణ కాంతులతో దర్శనమిస్తాడు. శ్రీ కాలభైరవస్వామి ఆలయాన్ని 1924 వ సంవత్సరంలో సత్తిరాజు వంశస్తులే ప్రతిష్టించారు. ప్రధాన ఆలయానికి ఆగ్నేయంలో గణపతి, నైరుతి దిక్కున శ్రీ దుర్గాదేవి ప్రతిష్టుతులై పూజలందుకుంటున్నారు. అలాగే 1958 లో నిర్మించిన దూతికా దేవి ఆలయం ఇక్కడ నెలకొని ఉంది. ఇక్కడ 1997-98 వ సంవత్సరంలో నవగ్రహ మండపాన్ని నిర్మించారు. ఆలయ రెండవ ప్రాకారంలో శ్రీ వల్లి సమేతుడైన శ్రీ సుబ్రహ్మణ్యస్వామి నెలకొని ఉన్నారు. ఇది 1907 వ సంవత్సరంలో నిర్మింపబడినది. ఇక్కడ షష్టి నాడు కళ్యాణం, ప్రతి మంగళవారం పూజలు జరుగుతాయి. మార్గశిర శుద్ధ పంచమినాడు శ్రీ వల్లిదేవి సుబ్రహ్మణ్యస్వామి వారి కళ్యాణం, తీర్దం జరుగుతాయి. ఈఊరిలో గల శ్రీ వల్లీ దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి ఆలయం బహు ప్రసిద్దం. ఈ ఆలయములో సంతానము లేని దంపతులు పూజలు చేసిన సంతానము కలుగుతుందని నమ్ముతారు. కార్యసిద్ధి కలిగి, ఈతి బాధల నుంచి విముక్తి లభిస్తుందని భక్తుల నమ్మకం. సుబ్రహ్మణ్యస్వామి ఆలయానికి చేరువలోనే చంద్ర పుష్కరిణి ఉన్నది. మొదటి ప్రాకారానికి ఉత్తర దిక్కులో శ్రీ కంచి కామాక్షి ఆలయం కూడా సందర్శించుకోవచ్చు. కంచి కామాక్షి దేవికి కుంకుమపూజలు విశేషంగా నిర్వహిస్తారు.
సుందరమైన ప్రకృతి రమణీయతల మధ్య నిర్మితమైన చారిత్రక దేవాలయం ఇది. ఈ ఆలయం భక్తులకు కోర్కెలను తీర్చే కల్పతరువుగా విరాజిల్లుతుంది. ముఖ్యంగా రోగపీడితులు స్వామికి మృత్యుంజయ అభిషేకం చేయిస్తే రోగవిముక్తులవుతారని నమ్మకం. మాఘ బహుళ దశమి నుంచి అమావాస్య వరకు ఏటా ఉమా వాసుకి రవి సోమేశ్వరస్వామి కళ్యాణ మహోత్సవాలు జరుగుతాయి.
Also Read: కన్య రాశి వారికి ఈ ఏడాది ఎలా ఉండబోతోంది, ఏ విధమైన ఆర్ధిక ఫలితాలను ఇస్తుంది తెలుసుకుందాం..!