AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Polala Amavasya: పోలాల అమావాస్య.. సత్సంతాన సౌభాగ్యం కోసం ఈ మొక్కకు పూజ.. వ్రత విధానం ఇదే!

Polala Amavasya Vratam Telugu: శ్రావణ మాసంలో వచ్చే పోలాల అమావాస్య వ్రతం సంతాన సౌభాగ్యం, వంశాభివృద్ధికి అత్యంత ప్రాధాన్యం. ఈ వ్రతంలో దేవి ఆవాహనతో కంద మొక్కను పూజించడం ప్రత్యేకత. శివపురాణం ప్రకారం, నిష్ఠతో ఈ వ్రతం ఆచరిస్తే సత్సంతానం కలుగుతుంది. ప్రకృతిని దైవంగా కొలిచే భారతీయ సంప్రదాయానికి ఇది నిదర్శనం. ముఖ్యంగా ఆడపిల్లల సంతానం ఆకాంక్షించే వారికి విశేష ఫలితాలను ప్రసాదిస్తుంది.

Polala Amavasya: పోలాల అమావాస్య.. సత్సంతాన సౌభాగ్యం కోసం ఈ మొక్కకు పూజ.. వ్రత విధానం ఇదే!
Polala Amavasya Vratam
B Ravi Kumar
| Edited By: |

Updated on: Sep 10, 2026 | 10:53 AM

Share

Polala Amavasya Vratam Telugu: భారతీయ సనాతన సంప్రదాయంలో పండుగలు, వ్రతాలు కేవలం పూజాదికాలకే పరిమితం కాకుండా ప్రకృతితో మమేకమై జీవించాలనే విశిష్ట సందేశాన్ని అందిస్తాయి. అందులో భాగంగా శ్రావణ మాసంలో వచ్చే పర్వదినాల్లో ‘పోలాల అమావాస్య’కు ఎంతో ఆధ్యాత్మిక ప్రాధాన్యత ఉంది. శ్రావణ మాస బహుళ పక్ష అమావాస్య తిథి నాడు మహిళలు భక్తిశ్రద్ధలతో ఆచరించే ఈ వ్రతం విశేష ఫలితాలను ప్రసాదిస్తుందని శాస్త్రాలు చెబుతున్నాయి. ప్రధానంగా సంతాన సౌభాగ్యం కోరుకునే వివాహిత స్త్రీలు, ముఖ్యంగా ఆడపిల్లల సంతాన ప్రాప్తిని ఆకాంక్షించే దంపతులు ఈ వ్రతాన్ని తప్పక ఆచరించాలని పెద్దల సూచన. శివపురాణం, నారదపురాణాల ప్రకారం ఈ వ్రతాన్ని నిష్ఠతో నిర్వహిస్తే వంశాభివృద్ధి, సత్సంతానం కలుగుతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం.

విగ్రహారాధనకు భిన్నంగా కంద మొక్కకు పూజ

సాధారణంగా హిందూ సంప్రదాయంలో పూజలు, నోములు నిర్వహించేటప్పుడు దేవుళ్ల విగ్రహాలు లేదా చిత్రపటాలను ఉంచి ఆరాధించడం ఆనవాయితీ. అయితే పోలాల అమావాస్య రోజున మాత్రం ప్రత్యక్ష ప్రకృతే దైవ స్వరూపంగా భావిస్తూ ‘కంద మొక్క’ను పూజించడం ఇక్కడి ప్రత్యేకత. పూజా విధానంలో భాగంగా తొలుత విఘ్నేశ్వరుడికి విశేష పూజలు చేసి, అనంతరం ఆ కంద మొక్కలోకి మంగళగౌరీ దేవిని భక్తితో ఆవాహన చేస్తారు. ఆ మొక్కకు తొమ్మిది పసుపు కొమ్ములను రక్షణగా, మంగళప్రదంగా కడతారు. అమ్మవారి స్వరూపంగా భావించే ఆ కంద మొక్కకు షోడశోపచార పూజలు నిర్వహించి, సంప్రదాయ పిండివంటలను నైవేద్యంగా సమర్పిస్తారు.

ప్రకృతి సంరక్షణను దైవకార్యంతో ముడిపెట్టిన ప్రాచీన సంస్కృతికి ఈ పూజా విధానం నిదర్శనంగా నిలుస్తుంది. వ్రతం పూర్తయిన తర్వాత ఆ కంద మొక్కను విసర్జించకుండా అత్యంత పవిత్రంగా చూసుకుంటారు. మరుసటి రోజున ఆ మొక్కను ఇంటి ఆవరణలోగానీ, ప్రత్యేకంగా పూల కుండీలోగానీ నాటి నిత్యం నీరు పోస్తూ సంరక్షిస్తారు. కొద్దిరోజుల్లోనే ఆ మొక్క చుట్టూ కొత్తగా పిలకలు (మొలకలు) రావడం ప్రారంభిస్తాయి. ఇలా కంద మొక్క విస్తరించి పిలకలు తొడగడాన్ని గృహంలో సంతానవృద్ధికి, సకల శుభాలకు సంకేతంగా భావిస్తారు. చెట్లను, మొక్కలను పూజల పేరుతో సంరక్షించే భారతీయ జీవనశైలి ఔన్నత్యం ఈ ఆచారంలో స్పష్టంగా కనిపిస్తుంది.

ఆదర్శాన్ని చాటే పురాణ గాథ

ఈ పర్వదినం వెనుక ఆసక్తికరమైన పురాణ కథ ప్రాచుర్యంలో ఉంది. గతంలో ఒక బ్రాహ్మణ మహిళకు సంతానం కలిగిన ప్రతిసారీ కొద్దిసేపటికే శిశువులు ఏదో ఒక కారణంతో కన్నుమూసేవారు. పుట్టిన బిడ్డలు పుట్టినట్లే మరణిస్తుండటంతో తీవ్ర దుఃఖానికి లోనైన ఆ తల్లి, గ్రామ పొలిమేరల్లో కొలువై ఉన్న పోలమ్మ తల్లి చెంతనే ఏటా తన బిడ్డలను ఖననం చేసేది. ప్రతి సంవత్సరం పోలాల అమావాస్య నాడే పిల్లలు పుట్టడం, వెంటనే ప్రాణాలు కోల్పోవడం వల్ల ఆమె ఏనాడూ నోము నోచుకోలేకపోయేది; పేరంటానికి ముత్తైదువులు కూడా వచ్చేవారు కాదు. తన పూర్వజన్మ పాపమే ఈ దుస్థితికి కారణమని ఆవేదన చెందుతున్న సమయంలో పోలమ్మ తల్లి ఆమెకు ప్రత్యక్షమై అసలు నిజాన్ని గుర్తుచేస్తుంది.

గత జన్మలో పోలాల అమావాస్య పర్వదినాన పేరంటాళ్లు రాకముందే, పిల్లలు ఆకలితో ఏడుస్తున్నారన్న భావనతో ఎవరూ చూడకుండా గారెలు, పాయసం వడ్డించడమే కాకుండా, రుచి చూసే నెపంతో పులుపు, తీపి సరిపోయాయో లేదో స్వయంగా ఆరగించి ఆచార నియమాలను ఉల్లంఘించావని తల్లి తెలియజేస్తుంది. తన తప్పిదాన్ని గ్రహించిన ఆ బ్రాహ్మణ స్త్రీ పశ్చాత్తాపంతో పోలాల అమావాస్య వ్రతాన్ని శాస్త్రోక్తంగా ఆచరించి, పోలమ్మ కరుణతో తిరిగి తన సంతానాన్ని క్షేమంగా పొందిందని పురాణాలు పేర్కొంటున్నాయి. భక్తి, శ్రద్ధ, నియమనిష్ఠల ప్రాధాన్యాన్ని ఈ గాథ లోకానికి చాటిచెబుతోంది.

Follow Us