Income Tax Rules: సేవింగ్స్ అకౌంట్లో అంతకంటే ఎక్కువ డిపాజిట్ చేస్తున్నారా..? జాగ్రత్త.. ఏ క్షణమైనా ఐటీ నోటీస్ వచ్చే ఛాన్స్..
ఆదాయపు పన్ను నోటీసులు రాకుండా ఉండాలంటే కొన్ని ఆర్థిక విషయాలు ప్రతీఒక్కరూ తెలుసుకోవాలి. సేవింగ్స్ లేదా కరెంట్ ఖాతాలలో అధిక నగదు డిపాజిట్లు, క్రెడిట్ కార్డ్ చెల్లింపులు, ఆస్తుల కొనుగోలు లేదాఅమ్మకాలు, పెట్టుబడులపై ఐటీ శాఖ దృష్టి పెడుతుంది. ఐటీఆర్‌లో ఆదాయాన్ని సరిగ్గా చూపించకపోతే తీవ్ర పరిణామాలు ఎదురవుతాయి.

దేశంలోని నివసించే ప్రతీఒక్కరూ ఇన్‌కమ్ ట్యాక్స్ నిబంధనల గురించి తెలుసుకోవాలి. బ్యాంకుల్లో పెద్ద మొత్తంలో లావాదేవీలు చేసేవారు ట్యాక్స్ రూల్స్ తప్పనిసరిగా తెలుసుకోవాలి. బ్యాంకులు పెద్ద లావాదేవీలను క్రమం తప్పకుండా ఐటీ శాఖకు రిపోర్ట్ చేస్తాయి. ఒకేసారి పెద్ద మొత్తంలో అమౌంట్ జమ అయినా లేదా విత్ డ్రా చేసినా ఐటీ శాఖ దృష్టికి వెళతాయి. దీంతో మీరు పెద్ద మొత్తంలో ట్రాన్సాక్షన్లు చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. లేకపోతే ఐటీ శాఖ నుంచి నోటీసులు రావొచ్చు. మీరు చిక్కుల్లో కూడా పడే అవకాశం ఉంటుంది. మీ ఆర్థిక లావాదేవీలు, మీ ఆదాయం మధ్య వ్యత్యాసం ఉన్నట్లయితే.. మీకు ఐటీ నోటీసు వచ్చే అవకాశం ఉంది.
ఒక ఆర్థిక సంవత్సరంలో మీ సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్లో రూ.10 లక్షల కంటే ఎక్కువ నగదును డిపాజిట్ చేస్తే.. ఆ బ్యాంక్ మీ వివరాలను ఐటీ శాఖకు నివేదిస్తుంది. మీ ఐటీఆర్‌లో చూపిన ఆదాయానికి, డిపాజిట్ చేసిన మొత్తానికి పొంతన లేకపోతే ఐటీ శాఖ నిఘా పెడుతుంది. మీ ఆదాయం రూ.12 లక్షలు ఉండి ఖాతాలో రూ.32 లక్షలు డిపాజిట్ అయితే.. మిగిలిన రూ.20 లక్షలకు సంబంధించి ఐటీ శాఖ మీకు నోటీసు పంపుతుంది. ఆ నిధులు ఎక్కడినుంచి వచ్చాయనేది మీరు వివరణ ఇచ్చుకోవాల్సి ఉంటుంది. ఇక వ్యాపారస్తులు ఉపయోగించే కరెంట్ ఖాతాలో ఒక ఆర్థిక సంవత్సరంలో రూ.50 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్లు జరిగినట్లయితే ఐటీ శాఖకు రిపోర్ట్ అందుతుంది. మీ వ్యాపార ఆదాయం, ఐటీఆర్‌లో చూపిన దానికంటే ఎక్కువ డిపాజిట్లు ఉన్నట్లయితే ఐటీ శాఖ విచారణ జరుపుతుంది. ఒక ఆర్థిక సంవత్సరంలో క్రెడిట్ కార్డ్ బిల్లు చెల్లింపులు రూ.10 లక్షలు దాటితే.. ఐటీ శాఖకు సమాచారం వెళుతుంది. మీ వార్షిక ఆదాయానికి మించి బిల్లులు చెల్లించినట్లయితే ఐటీ శాఖ నోటీసు రావొచ్చు.
ఇక రూ.1 లక్ష కంటే ఎక్కువ క్రెడిట్ కార్డ్ బిల్లులు క్యాష్ రూపంలో చెల్లించినా మీ వివరాలు ఐటీ శాఖకు వెళ్తాయి. రూ.30 లక్షల కంటే ఎక్కువ విలువైన ఆస్తిని కొనుగోలు చేసినప్పుడు.. సబ్-రిజిస్ట్రార్ కార్యాలయం ఐటీ శాఖకు నివేదిస్తుంది. మీరు మీ ఆదాయంలో ఆస్తి విలువను సరిపోల్చలేకపోతే ఐటీ శాఖ నుంచి నోటీసులు రావొచ్చు. రూ.2 కోట్ల విలువైన ఆస్తిని విక్రయించినప్పుడు ఆ ఆదాయాన్ని ఐటీఆర్‌లో చూపించకపోతే కూడా నోటీసు వచ్చే అవకాశం ఉంది. మ్యూచువల్ ఫండ్స్, షేర్లు, బాండ్లు వంటి వాటిలో ఒక ఆర్థిక సంవత్సరంలో రూ.10 లక్షల కంటే ఎక్కువ పెట్టుబడులు పెట్టినప్పుడు కూడా మీరు ఐటీ శాఖ నిఘాలోకి వెళతారు. నోటీసు వచ్చినప్పుడు భయపడాల్సిన అవసరం లేదు. ఆ డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందో వివరంగా తెలుపుతూ క్లారిఫికేషన్ లెటర్‌ను ఐటీ శాఖకు పంపాలి.
