Tirumala: తిరుమలలో అనంత పద్మనాభవ్రతం సందర్భంగా చక్రస్నానం.. పాలు,పెరుగు, తేనె, కొబ్బరినీళ్లు, పసుపు, చందనంతో అభిషేకం
Tirumala: కలియుగదైవం కొలువైన పవిత్రక్షేత్రం తిరుమల తిరుపతి. నిత్యకల్యాణం పచ్చతోరణంగా నిత్యం భక్తుల రద్దీతో సందడి నెలకొంటుంది. అంతేకాదు స్థానిక దేవాలయాల్లో కూడా పవిత్ర ఉత్సవాలు..
Tirumala: కలియుగదైవం కొలువైన పవిత్రక్షేత్రం తిరుమల తిరుపతి. నిత్యకల్యాణం పచ్చతోరణంగా నిత్యం భక్తుల రద్దీతో సందడి నెలకొంటుంది. అంతేకాదు స్థానిక దేవాలయాల్లో కూడా పవిత్ర ఉత్సవాలు జరుగుతూనే ఉంటాయి. తాజాగా తిరుమలలో అనంత పద్మనాభవ్రతం సందర్భంగా ఆదివారం ఉదయం శ్రీవారి పుష్కరిణిలో శాస్త్రోక్తంగా చక్రస్నానం నిర్వహించారు. కోవిడ్ నిబంధనల మేరకు ఈ కార్యక్రమం ఏకాంతంగా నిర్వహించారు. అనంత పద్మనాభ వ్రతాన్ని ప్రతి ఏటా తిరుమలలో భాద్రపద శుక్ల చతుర్దశి నాడు నిర్వహిస్తారు. ఈ సందర్భంగా శ్రీవారి ఆలయంలో ఉదయం పూజలు చేసిన తరువాత శ్రీ సుదర్శన చక్రత్తాళ్వారును ఆలయం నుండి ఊరేగింపుగా తీసుకెళ్లి శ్రీ వరాహస్వామి ఆలయం చెంత ఉన్న స్వామి పుష్కరిణిలో పాలు, పెరుగు, తేనె, కొబ్బరినీళ్లు, పసుపు, చందనంతో విశేషంగా అభిషేకం చేపట్టారు. అనంతరం చక్రస్నానం నిర్వహించారు.
శ్రీ మహావిష్ణువు అనంతకోటి రూపాలలో కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీవేంకటేశ్వరస్వామి వారికి ఎంత ప్రాశస్త్యం ఉందో.. శయన మూర్తిగా శ్రీ అనంత పద్మనాభస్వామికి అంతే వైశిష్ఠ్యం ఉంది. ప్రతి ఏటా ఈ పర్వదినాన దేశవ్యాప్తంగా ఉన్న 108 శ్రీ వైష్ణవ దివ్యక్షేత్రాల్లో అనంత పద్మనాభ వ్రతం నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. తిరుమల 108 శ్రీ వైష్ణవ దివ్య దేశాలలో ప్రధానమైనది కావడంతో అనంత పద్మనాభ వ్రతాన్ని అర్చకులు ఆగమోక్తంగా నిర్వహించారు. తిరుమలలో శ్రీవారి బ్రహ్మోత్సవాలలో చివరి రోజున, వైకుంఠ ద్వాదశి, రథసప్తమి, ఆనంత పద్మనాభవ్రతం పర్వదినాల్లో మాత్రమే చక్రస్నానం నిర్వహిస్తారు.
ఇక మరోవైపు శ్రీవారి దేవేరి కొలువైన తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో కూడా పవిత్రోత్సవాలు నిర్వహిస్తున్నారు. ఈ ఉత్సవాల్లో భాగంగా రెండవ రోజు ఆదివారం శాస్త్రోక్తంగా పవిత్ర సమర్పణ జరిగింది. ఉదయం సుప్రభాతంతో అమ్మవారిని మేల్కొలిపి సహస్రనామార్చన, నిత్యార్చన చేపట్టారు. ఉదయం 11.30 నుండి మధ్యాహ్నం 12.30 గంటల వరకు పవిత్ర సమర్పణ నిర్వహించారు. అమ్మవారి మూలమూర్తికి, ఉత్సవర్లకు, ఉప ఆలయాలకు, పరివార దేవతలకు, విమానప్రాకారానికి, ధ్వజస్తంభానికి పవిత్రాలు సమర్పించారు. కాగా, సాయంత్ర 6.00 నుండి 7.30 గంటల వరకు యాగశాలలో వైదిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు.