Navaratri: ఈ దుర్గా మాత ఆలయానికి వెళ్లాలంటేనే జనాలు జడుసుకుంటారు? అసలు రహస్యం ఇదే!
దేవీ శరన్నరవరాత్రుల సమయంలో ప్రజలంతా దుర్గాదేవిని ఎంతో భక్తిశ్రద్ధలతో పూజిస్తారు. అమ్మవారి కృప పొందడం కోసం పూజలు చేయడంతో పాటు.. ఉపవాసాలు కూడా పాటిస్తారు.

దేవీ శరన్నరవరాత్రుల సమయంలో ప్రజలంతా దుర్గాదేవిని ఎంతో భక్తిశ్రద్ధలతో పూజిస్తారు. అమ్మవారి కృప పొందడం కోసం పూజలు చేయడంతో పాటు.. ఉపవాసాలు కూడా పాటిస్తారు. అమ్మవారిని దర్శించుకుని మనస్ఫూర్తిగా ఏదైనా కోరితే.. అది తప్పక నెరవేరుతుందని అందరి విశ్వాసం. ఆ నమ్మకంతోనే భక్తులందరూ అమ్మవారిని ఎంతో భక్తిప్రపత్తులతో, నిష్టతో పూజిస్తారు. అయితే, మధ్యప్రదేశ్‌లోని దేవాస్‌లో నిర్మించిన అమ్మవారి ఆలయం మాత్రం భిన్నమైన కథను చెబుతోంది. ఈ దుర్గ గుడికి వెళ్లాలంటేనే ప్రజలు భయపడుతున్నారు. నవరాత్రుల సమయంలో ప్రజలు ఈ ఆలయం లోపలికి వెళ్లరు. అయితే, బయటి నుండి తల వంచి నమస్కరిస్తూ వెళతారు. మరి దీనివెనుక రహస్యమేంటో ఇప్పుడు తెలుసుకుందాం..
ఆలయానికి శాపం..?
ఈ దేవాలయానికి ఏదో శాపం ఉందని స్థానికుల్లో ప్రచారం నడుస్తోంది. సూర్యాస్తమయం తర్వాత ఇక్కడికి ఎవరూ వెళ్లరట. స్థానిక ప్రజల విశ్వాసం ప్రకారం, సూర్యాస్తమయం తర్వాత ఆలయంలోకి ఎవరు వెళ్లినా.. వారు విచిత్రంగా ప్రవర్తిస్తారట. అంతేకాదు.. ఈ ఆలయం నుండి భయానక శబ్దాలు కూడా వస్తాయట. ఒక్కోసారి గుడిలో సింహగర్జనలు వినిపిస్తాయని, ఒక్కోసారి గంటల శబ్దం వినిపిస్తుందని స్థానికుల చెబుతున్నారు. తప్పుడు ఆలోచనలతో ఆలయానికి వచ్చేవారికి తీవ్ర నష్టం జరుగుతుందని, చెడు దృష్టి కలిగిన వారిని అమ్మవారు శిక్షిస్తుందని వారు చెబుతున్నారు.
మరి రహస్యం ఏమిటి?
స్థానిక ప్రజల ప్రకారం.. దేవాస్ మహారాజు ఈ దుర్గా దేవి ఆలయాన్ని నిర్మించారు. అయితే, ఈ ఆలయ నిర్మాణం తర్వాత.. రాజకుటుంబంలో అనూహ్య ఘటనలు జరుగడం ప్రారంభమయ్యాయి. యువరాణికి, సేనాధిపతితో ప్రేమ వ్యవహారం నడిచింది. అయితే, వారి ప్రేమ రాజుకు ఏమాత్రం ఇష్టం లేకపోవడంతో.. వారి బంధాన్ని వ్యతిరేకించాడు. రాజు తన కూతురిని జైల్లో పెట్టి బంధించాడు. ఆ క్రమంలో యువరాణి జైల్లోనే అనుమానాస్పదంగా చనిపోయింది. యువరాణి మరణ వార్త విన్న సైనాధిపతి.. అమ్మవారి ఆలయంలో బలవన్మరణానికి పాల్పడ్డాడు. దీంతో ఈ ఆలయం అపవిత్రంగా మారిందని పూజారులు అంటున్నారు. ఆ తరువాత రాజగురువుల సలహా మేరకు రాజు ఉజ్జయినలోని పెద్ద గణపతి ఆలయంలో అమ్మవారి విగ్రహాన్ని ప్రతిష్ఠించాడని చెబుతారు.




మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..