Medaram Jatara: ప్రపంచంలోనే అతిపెద్ద గిరిజన జాతర ఈనెల 21 నుంచి ప్రారంభం.. బంగారం’ కొనాలంటే ఆధార్ తప్పనిసరి

సమ్మక్క సారలమ్మ లేదా సమ్మక్క సారక్క జాతరను మేడారం జాతర అని కూడా పిలుస్తారు. గిరిజన మహిళలను దేవతలుగా కొలిచే గిరిజన పండుగ. గిరిజనుకు జరుగుతున్న అన్యాయంపై చట్టానికి వ్యతిరేకంగా పాలించిన పాలకులతో తల్లి, కుమార్తె, సమ్మక్క .. సారలమ్మ చేసిన పోరాటాన్ని గుర్తుగా జరుపుకునే పండుగ.  కుంభమేళా తర్వాత మేడారం జాతరకు దేశంలోనే అత్యధిక సంఖ్యలో భక్తులు తరలివస్తారని ప్రతీతి.

Medaram Jatara: ప్రపంచంలోనే అతిపెద్ద గిరిజన జాతర ఈనెల 21 నుంచి ప్రారంభం.. బంగారం’ కొనాలంటే ఆధార్ తప్పనిసరి
Medaram Jatara 2024
Follow us
Surya Kala

|

Updated on: Feb 07, 2024 | 9:36 PM

ఆసియాలోనే అతి పెద్ద గిరిజన జాతర సమ్మక్క సారలమ్మ జాతరకు ఇక కొన్ని రోజుల సమయం మాత్రమే ఉంది. నాలుగు రోజుల పాటు జరిగే ప్రపంచంలోనే అతిపెద్ద గిరిజన సమ్మక్క సారక్క జాతర ఫిబ్రవరి 21 న ములుగు జిల్లా తాడ్వాయి మండలంలోని మేడారంలో ప్రారంభమవుతుంది. ఈ పండుగను 1998లో రాష్ట్ర పండుగగా ప్రకటించారు. ఈ జాతరకు తెలుగు రాష్ట్రాల నుంచి మాత్రమే కాదు దేశ వ్యాప్తంగా భారీ సంఖ్యలో భక్తులు పోటెత్తుతారు. సుమారు నాలుగు రోజుల పాటు జరిగే ఈ జాతరను సుమారు 1.2 కోట్ల మంది భక్తులు సందర్శిస్తారని అంచనా.. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, పొరుగు రాష్ట్రాలైన ఒడిశా, కర్ణాటక, మహారాష్ట్ర , మధ్యప్రదేశ్ నుండి ఎక్కువమంది భక్తులు విచ్చేస్తారు.

సమ్మక్క సారక్క జాతర

సమ్మక్క సారలమ్మ లేదా సమ్మక్క సారక్క జాతరను మేడారం జాతర అని కూడా పిలుస్తారు. గిరిజన మహిళలను దేవతలుగా కొలిచే గిరిజన పండుగ. గిరిజనుకు జరుగుతున్న అన్యాయంపై చట్టానికి వ్యతిరేకంగా పాలించిన పాలకులతో తల్లి, కుమార్తె, సమ్మక్క .. సారలమ్మ చేసిన పోరాటాన్ని గుర్తుగా జరుపుకునే పండుగ.  కుంభమేళా తర్వాత మేడారం జాతరకు దేశంలోనే అత్యధిక సంఖ్యలో భక్తులు తరలివస్తారని ప్రతీతి.

గిరిజనుల దేవతలు తమను దర్శించుకుంటారని విశ్వసిస్తూ మేడారంలో జరుపుకుంటారు. ములుగులో మనుగడలో ఉన్న అతిపెద్ద అటవీ ప్రాంతం అయిన దండకారణ్యంలో భాగమైన ఏటూరునాగారం వన్యప్రాణుల అభయారణ్యంలోని మారుమూల ప్రాంతం మేడారం. సుమారు 6-7 శతాబ్దాల క్రితం అంటే 13వ శతాబ్దంలో వేటకు వెళ్లిన కొంతమంది గిరిజన నాయకులు పులుల మధ్య అపారమైన కాంతిని వెదజల్లుతున్న నవజాత బాలిక (సమ్మక్క)ను కనుగొన్నారని స్థానికుల కథనం. ఆమెను తమ నివాసానికి తీసుకెళ్లారు.

ఇవి కూడా చదవండి

ఆ తెగ పెద్ద ఆమెను దత్తత తీసుకుని అధిపతిగా పెంచాడు. ఆమె కాకతీయుల గిరిజన నాయకుడు పగిడిద్ద రాజుతో వివాహం జరిగింది. ఆమెకు ఇద్దరు కుమార్తెలు.. సారక్క, నాగులమ్మలతో పాటు జంపన్న అనే ఒక కుమారుడు ఉన్నారు.

జాతరకు శ్రీకారం

కన్నెపల్లి గ్రామం నుంచి మేడారం వేదికపై ఉంచిన సారక్క చిత్రపటం ఆనవాయితీగా రావడంతో జాతరకు శ్రీకారం చుట్టారు. ఎర్రటి వస్త్రంతో కప్పబడిన చిత్ర విగ్రహానన్నీ పసుపు కుంకుమలతో నింపిన పాత్రలో పెట్టి  తీసుకువచ్చారు. గిరిజన పూజారులు మేడారం నుండి నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉన్న కన్నెపల్లిలో ఒక చిన్న ఆలయంలోకి ప్రవేశించడంతో ప్రత్యేకమైన ఆచారాలు ప్రారంభమయ్యాయి. వారు ఆలయం నుండి బయటకు వచ్చే ముందు దేవతను ప్రార్థిస్తూ గంటల తరబడి ప్రార్థనలు చేస్తారు. గిరిజన పూజారులు, జిల్లా అధికారుల బృందం దేవతకు సాంప్రదాయాన్ని అనుసరిస్తూ పూజలు చేస్తారు.

భక్తులు తమ బరువుకు సమానమైన బంగారం (బెల్లం)ను అమ్మవారికి సమర్పించి జంపన్న వాగులో పుణ్యస్నానాలు ఆచరిస్తారు. ఇది వైదిక లేదా బ్రాహ్మణ ప్రభావం లేని పూర్తిగా గిరిజన పండుగ.

జంపన్న వాగు

జంపన్న వాగు గోదావరి నదికి ఉపనది. పురాణాల ప్రకారం జంపన్న గిరిజన యోధుడు. గిరిజన దేవత సమ్మక్క కుమారుడు. ఆ ప్రవాహంలో కాకతీయ సైన్యంతో జరిగిన యుద్ధంలో మరణించినందున జంపన్న వాగు అతని పేరుతో ఖ్యాతి పొందింది.

జంపన్న వాగు ఇప్పటికీ జంపన్న రక్తంతో ఎర్రగా ఉందని భక్తుల నమ్మకం. జంపన్న వాగులోని ఎర్రటి నీటిలో పుణ్యస్నానం చేయడం వల్ల తమను సదా రక్షిస్తాడని విశ్వాసం. వారి త్యాగం తమ హృదయానికి ధైర్యం నింపుతుందని గిరిజనులు నమ్ముతారు. జంపన్న వాగు పైన నిర్మించిన వంతెనను జంపన్న వాగు వంతెన అని పిలుస్తారు.

TSRTC 6,000 బస్సులు

ఈ ఏడాది TSRTC 30 లక్షల మంది ప్రయాణికులను చేరవేసేందుకు 6,000 ప్రత్యేక బస్సులను మేడారం జాతరకు నడపనుంది. ఈ బస్సులు ఫిబ్రవరి 18 నుండి 24 వరకు రాష్ట్రవ్యాప్తంగా 51 పాయింట్ల నుండి నడపబడతాయి. ఇటీవల రాష్ట్ర మంత్రులు పొన్నం ప్రభాకర్ , సీతక్క తాడ్వాయిలోని టిక్కెట్ కౌంటర్లను సందర్శించి సన్నాహాలను సమీక్షించారు. మహిళల కోసం కొనసాగుతున్న ఉచిత బస్సు సర్వీసు జాతరకు ప్రత్యేక బస్సులకు వర్తిస్తుందని TSRTC ప్రకటించింది.

పర్యావరణ ప్రభావ పన్నునుంచి మినహాయింపు

ఫిబ్రవరి 2 నుండి 29 వరకు సమ్మక్క సారక్క జాతర (మేడారం జాతర)కు వెళ్లే సమయంలో ఏటూరు నాగారం రిజర్వ్ ఫారెస్ట్ గుండా వెళ్లే అన్ని వాహనాలకు పర్యావరణ పన్ను నుంచి మినహాయింపునిచ్చారు. చీఫ్ వైల్డ్‌లైఫ్ వార్డెన్ జారీ చేసిన ఆదేశాల ప్రకారం ఇది ఉచిత ట్రాఫిక్‌ను సులభతరం చేస్తుంది.  మేడారం జాతరకు చేరుకోవడానికి భక్తులకు అదనపు డబ్బు ఖర్చు చేయాల్సిన అవసరం లేకుండా సహాయపడుతుంది.

పస్రా, తాడ్వాయి, ఏటూరునాగారం ప్రాంతాల నుంచి వచ్చే వాహనాల నుంచి అటవీశాఖ నామమాత్రపు రుసుము వసూలు చేస్తోంది. సేకరించిన మొత్తాన్ని రిజర్వ్ ఫారెస్ట్, వన్యప్రాణులను రక్షించడానికి..  వన్యప్రాణులకు ప్రమాదం కలిగించే ప్లాస్టిక్, ఇతర వ్యర్థాలను సేకరించడానికి ఉపయోగించనున్నారు.  అయితే జాతర సమయంలో వాహనాలకు రుసుము చెల్లించకుండా రాష్ట్ర ప్రభుత్వానికి మినహాయింపు ఇవ్వాలని భక్తులు అభ్యర్థిస్తున్నారు.

బెల్లం కోసం ఆధార్ తప్పనిసరి

భక్తులు అమ్మవారికి ‘బంగారం’గా సమర్పించే బెల్లం దుర్వినియోగాన్ని అరికట్టేందుకు ప్రభుత్వం ఈసారి ఆధార్ నిబంధనను అమలు చేయాలని నిర్ణయించింది. బెల్లం సమర్పించాలనుకునే భక్తులు తమ ఆధార్ జిరాక్స్ కాపీని కౌంటర్లలో సమర్పించాలి. భక్తులు తమ పేరు, ఫోన్ నంబర్, బెల్లం కొనుగోలు ఉద్దేశం తదితర వివరాలను తప్పనిసరిగా అందించాలని ఎక్సైజ్ శాఖ స్పష్టం చేసింది. ఎక్సైజ్ సిబ్బంది డేటాను క్రోడీకరించి ప్రతిరోజూ జిల్లా స్థాయి అధికారులకు సమర్పించాలి.

బెల్లం కోసం ఆన్‌లైన్ చెల్లింపు

జాతర సమయంలో లేదా ఆ తర్వాత మేడారం వెళ్లలేని వారి కోసం ఆన్‌లైన్‌లో చెల్లింపు సౌకర్యాన్ని అటవీ, పర్యావరణ, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ ప్రారంభించారు. దేవతలకు భక్తితో నైవేద్యంగా తమ శరీర బరువుకు సమానమైన బెల్లాన్ని బంగారంగా సమర్పిస్తారు. మీ సేవ, ట్యాప్ , పోస్టల్ డిపార్ట్‌మెంట్ కి  1.5 లక్షల అవుట్‌లెట్‌ల ద్వారా భక్తులు తమ శరీర బరువు ఆధారంగా బెల్లాన్ని చెందిన మొత్తాన్ని చెల్లించవచ్చు.

కొన్ని డిమాండ్స్ ను తెరమీదకు తెచ్చిన మావోయిస్టులు

జాతరకు గిరిజనుల ఆచారాల ప్రకారం పూర్తి ఏర్పాట్లు చేయాలని సీపీఐ మావోయిస్టు జయశంకర్, ములుగు, వరంగల్, పెద్దపల్లి (జేఎండబ్ల్యూపీ) డివిజన్ కమిటీ కార్యదర్శి వెంకటేష్ బహిరంగ లేఖలో రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మేడారంలో భక్తులకు ప్రసాదంగా లడ్డూ లేదా పులిహోర వంటి వాటిని పంపిణీ చేయవద్దని.. బంగారాన్నిమాత్రమే పంపిణీ చేయాలంటూ మావోయిస్టులు హెచ్చరించారు.

అటవీ ప్రాంతంలో పరిశుభ్రత పాటించాలని, జాతర నిర్వహణ కోసం చేసిన ఏర్పాట్లతో నష్టపోయిన రైతులకు పరిహారం ఇవ్వాలని మావోయిస్టులు డిమాండ్ చేశారు.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..