Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vinayaka Chaturthi: రాయదుర్గంలో 14వ శతాబ్దం నాటి దశభుజ గణపతి. టెంకాయ స్వామి దగ్గర ఉంచితే..

శుక్లాంబరధరం విష్ణుం... చతుర్భుజం... ఈ శ్లోకం గురించి తెలియని వారు ఉండరు. విఘ్నాధిపతిని తలుచుకుంటూ చెప్పే

Vinayaka Chaturthi: రాయదుర్గంలో 14వ శతాబ్దం నాటి దశభుజ గణపతి. టెంకాయ స్వామి దగ్గర ఉంచితే..
Rayadurgam Dasha Bhuja Vina
Follow us
Venkata Narayana

|

Updated on: Sep 08, 2021 | 5:45 PM

Lord Ganesha – Vinayaka Chavithi: శుక్లాంబరధరం విష్ణుం… చతుర్భుజం… ఈ శ్లోకం గురించి తెలియని వారు ఉండరు. విఘ్నాధిపతిని తలుచుకుంటూ చెప్పే ఈ శ్లోకంలో చతుర్భుజం అంటే నాలుగు భుజాలు అని అర్థం కానీ.. దేశంలో ఎక్కడా లేని విధంగా దశభుజాలు కలిగి భారీ విగ్రహా రూపంలో ఉన్న దశభుజ వినాయకుడు రాయదుర్గంలో వెలిశాడు. 14వ శతాబ్దంలో భూపతిరాయలు కాలంలో వెలసిన ఈ వినాయకుడు తన తండ్రి శివుని వలె త్రినేత్రుడై ఉంటారు. అంతే కాదు ఎక్కడైనా వినాయకుడికి తొండం ఎడమ వైపు ఉంటుంది.. కానీ ఇక్కడ మాత్రం కుడివైపు తొండంతో పూర్ణ ఫలముతో కనిపిస్తారు. అంతే కాదు భార్యను ఆలింగనం చేసుకున్నట్టు ఉండే అద్భుతమైన రూపంలో ఉంటారు. ఇలా ఎన్నో విశేషాలు మాత్రమే ఇక్కడ స్వామి వారి వద్ద ఉంచి పూజించే టెంకాయ మహిమ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఇటు ఏపీ, అటు కర్ణాటక భక్తులతో నిత్యం పూజలందుకునే ఆ దిశ భుజ గణపతి విశేషాలను మనం ‍ఒక్కసారి చూద్దాం..

వినాయకుడు అంటే విఘ్నాధిపతి.. ఆయనకున్నన్ని రూపాలు మరే దేవునికీ ఉండవు. కానీ తండ్రి శివుని నేత్ర రూపం.. చేతులు తల్లి అయిన పార్వదేవి ప్రతిరూపంగానూ, మేన మామ విష్ణుమూర్తిలా చేతిలో సుదర్శనం ఉండే విధంగా వినాయకుడుని ఎక్కడైనా చూశారా అంటే.. లేదనే సమాధానం వస్తుంది. ఎందుకంటే దేశంలో ఎక్కడా లేని విభిన్నమైన గణపతి అనంతపురం జిల్లా రాయదుర్గంలో వెలసి ఉన్నాడు. 14వ శతాబ్దంలో భూపతిరాయలు కాలంలో ఇక్కడ విగ్రహాన్ని ప్రతిష్టించినట్లు చరిత్ర చెబుతోంది. 15 అడుగుల ఎత్తుతో, 12 అడుగుల వెడల్పుతో భారీకాయంగా మనకు వినాయకుడు దర్శనమిస్తాడు.

ఎక్కడైనా ఏ కార్యక్రమం ప్రారంభించే ముందు.. శుక్లాంబరధరం విష్ణుం… శశివర్ణం చతుర్భజం అనే శ్లోకం చెబుతాం కదా.. అంటే ఈ శ్లోకం ప్రకారం చూస్తే వినాయకుడు నాలుగు చేతులు కల్గిఉంటాడని అర్థం. కానీ ఇక్కడ మాత్రం తన తల్లి మహాశక్తి పార్వతీ దేవి వలె పది చేతులతో వినాయకుడు ఉంటాడు. ఎడమవైపున అయిదు చేతులూ, కుడివైపున అయిదు చేతులతో.. ఒక్కో చేతిలో ఒక్కో ఆయుధం ఉంటుంది. కుడివైపున.. మొదటి చేతిలో నారికేళం, రెండో చేతిలో చక్రం, మూడో చేతిలో త్రిశూలం, నాలుగో చేతిలో ధనుస్సు, ఐదో చేతిలో అంకుశం ఉంటాయి. ఎడమవైపున.. మొదటి చేతిలో భార్య సిద్ధిని ఆలింగనం చేసుకున్నట్టు, రెండో చేతిలో శంఖం, మూడో చేతిలో పవిత్రం, నాలుగో చేతిలో శరం, అయిదో చేతిలో ఖడ్గం దర్శనమిస్తాయి.

ఇక కళ్లు తన తండ్రి అయిన పరమశివుని వలె మూడు కన్నులతో వినాయకుడు ఉంటాడు. దీనికి తోడు విగ్రహానికి కుడివైపున సూర్యుడూ ఎడమవైపున చంద్రుడూ ఉండటంతో.. విశ్వగణపతిగా కీర్తిస్తారు. విగ్రహం ఎడమ అరికాలి కింద అష్టదళ పద్మం ఉంది. కాళ్లకు గజ్జెలూ, కాలికింద మూషిక వాహనమూ ఉంటాయి. మొత్తం మీద ఇక్కడ స్వామి వారు మహా చిద్విలాసంగా కనిపిస్తాడు. పదిచేతులవాడు కావడంతో దశభుజ గణపతిగా పిలుస్తారు. ఆది, మంగళవారాల్లో ఇక్కడ ప్రత్యేక పూజలు జరుగుతాయి.

నెలనెలా సంకష్టహర చతుర్థికి వందలాది భక్తులు వస్తారు. కుడి చేతి లో పూర్ణ ఫలముతో, తల పైన పూర్ణ ఫలముతో వెలిసిన ఈ మహా గణపతి విశేషమైన పూజలందుకుంటున్నాడు. ఈ పూర్ణ ఫలం ఉండడం వల్ల పూర్ణ టెంకాయను వారికి సమర్పించి మనసులో ఏ కోరిక కోరినా నెరవేరుతుందనే నమ్మకం ఇక్కడ బలంగా ఉంది. ఇక్కడికొచ్చి భక్తులు తమ తమ కోర్కెలు తీర్చుకోవడానికి పూర్ణ టెంకాయాలతో వస్తుంటారు. టెంకాయను మనసులో కోర్కెను కల్పించుకొని స్వామి వారి దగ్గర పెడితే 21 రోజుల నుండి 40 రోజుల లోపు అవి కచ్చితంగా ఫలిస్తాయని కాయలు పెట్టే ఆచారం అనాదిగా వస్తోంది.

ప్రధానంగా పెళ్లి కాని వారు, వృత్తి, వ్యాపార, కుటుంబసమస్యలు ఉన్న వారు ఎక్కువగా వస్తుంది. ఆంధ్రా, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు ప్రాంతాల నుండి భక్తులు విశేషంగా తరలివచ్చి స్వామి వారిని దర్శించుకుంటున్నారు. వినాయక చవితి సందర్భంగా లక్షలాది మంది భక్తులు వస్తారని దేవాలయ కమిటీ వారు అన్ని ఏర్పాట్లు చేయడంలో నిమగ్నమైయ్యారు. భక్తులకు ఎటువంటి ఆటంకం కలుగకుండా నీటి సౌకర్యం తదితర వసతుల ఏర్పాట్లను కూడా చేశారు. మొత్తం మీద వినాయకునికి దేశంలో ఎన్నో ఆలయాలు ఉన్నప్పటికీ రాయదుర్గంలో ఉన్న దశభుజగణపతికి ఒక ప్రత్యేకత, ప్రాధాన్యత ఉంటుంది.

Dasha Bhuja Ganapathi

Dasha Bhuja Ganapathi

లక్ష్మీకాంత్, టీవీ9 ప్రతినిధి, అనంతపురం

Read also: Huzurabad By Election: హుజూరాబాద్ ఉప ఎన్నికల అభ్యర్ధులకు పండుగంటే చాలు.. గుండెలదురుతున్నాయట.!