Edupayala Temple: పరవళ్లు తొక్కు మంజీర నది.. జలదిగ్బంధంలో ఏడుపాయల అమ్మవారు ఆలయం
మెదక్ జిల్లాలో మంజీర నది మహోగ్రరూపం దాల్చింది. వరద ఉధృతికి ఏడుపాయల వనదుర్గ అమ్మవారి ఆలయం నీట మునిగింది.
మెతుకుసీమను వాన వీడడం లేదు. వరుసగా మూడో రోజు జిల్లాలో వరుణుడు ప్రతాపం చూపాడు. జిల్లా కేంద్రంతో పాటు ఆయా మండలాల్లో ప్రజలు ఇబ్బందులు పడగా.. పలు చోట్ల పంటలు నీటమునిగాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు పాక్షికంగా ఇళ్లు కూలాయి. ఎగువన కురిసిన వర్షాలకు సింగూరు ప్రాజెక్టు నిండుకుండలా మారడంతో గేట్లు ఎత్తివేశారు అధికారులు. సింగూరు ప్రాజెక్ట్ నాలుగు గేట్లను ఎత్తివేసి దిగువకు నీటిని విడుదల చేయడంతో… మంజీరా నది ఉధృతంగా ప్రవహిస్తోంది. దీంతో మెదక్ జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం ఏడుపాయల వన దుర్గ మాత ఆలయం జలదిగ్బంధంలో చిక్కుకుంది. అమ్మవారు ఆలయ ప్రాగణంతోపాటు.. ఆలయం లోపలి నుండి భారీగా వరద నీరు ప్రవహిస్తోంది. రాజగోపురంలోని అమ్మవారికి పూజలు మాత్రం నిర్వహిస్తున్నారు. ఆలయ పరిసరాల్లోకి ఎవరు రాకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు.
వనదుర్గా ప్రాజెక్టు పరవళ్లు తొక్కుతోంది. జిల్లాలో సోమవారం రాత్రి నుంచి మంగళవారం సాయంత్రం వరకు వాన కురిసింది. అత్యధికంగా కొల్చారం మండలంలో 91.3 మి.మీ.లు, అత్యల్పంగా మనోహరాబాద్‌లో 25.3 మి.మీ.ల వర్షపాతం నమోదైంది. జిల్లాలో ఈనెల 1నుంచి 7వరకు సాధారణ వర్షపాతం 652.5 మి.మీలు కాగా, 798.6 మి.మీలు వర్షం కురిసింది.
నిజాంపేట మండలంలోని రాంపూర్‌లో పొలాల్లో ఇసుక మేట వేసింది. హవేలిఘనపూర్‌లో వరిపంట నీట మునిగింది. రాజ్‌పేటలో వందల ఎకరాల్లో నీళ్లు నిలిచాయి. రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు మెదక్‌లోని పలు కాలనీలు జలమయమయ్యాయి. సాయినగర్ కాలనీలో ఇళ్ల మధ్య నీరు చేరింది.
ఇవి కూడా చదవండి: Gold Price Today: మహిళలకు గుడ్‌న్యూస్.. మళ్లీ తగ్గిన బంగారం ధరలు.. ప్రధాన నగరాల్లో ధరలు ఎలా ఉన్నాయంటే..?