Huzurabad By Election: హుజూరాబాద్ ఉప ఎన్నికల అభ్యర్ధులకు పండుగంటే చాలు.. గుండెలదురుతున్నాయట.!

ఎవరికైనా పండగంటే.. ఆ జోషూ- హుషారూ వేరుగా ఉంటుంది. కానీ హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్ధులకు

Huzurabad By Election: హుజూరాబాద్ ఉప ఎన్నికల అభ్యర్ధులకు పండుగంటే చాలు.. గుండెలదురుతున్నాయట.!
Huzurabad
Follow us
Venkata Narayana

|

Updated on: Sep 08, 2021 | 4:10 PM

Huzurabad – By Election – Festivals: ఎవరికైనా పండగంటే.. ఆ జోషూ- హుషారూ వేరుగా ఉంటుంది. కానీ హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్ధులకు మాత్రం గుండెలదురుతున్నాయట. అదేంటి? పండక్కీ- ఈ గుండె పోట్లకీ సంబంధమేంటని అంటారా? కట్ చేస్తే, నాడో- నేడో హుజూరాబాద్ ఎన్నికలు జరిగిపోతాయనే భావించారంతా. దీంతో నియోజకవర్గంలో దుమ్మురేగే ప్రచారాలు పాదయాత్రలూ చేశారు.

అసలే ఈ ఎన్నిక బీజేపీ అభ్యర్ధి ఈటల రాజేందర్ కి- టీఆర్ఎస్ కీ టూ ప్రిస్టీజియస్. అందుకే హుజూరాబాద్ ఉప ఎన్నిక కేంద్రంగా.. డ్రామాలు, మెలోడ్రామాలు చాలానే నడిచాయ్. ఈటల తన పాదయాత్రలో భాగంగా అనారోగ్యం పాలవడం. ఆ సానుభూతిని ఎలాగైనా సరే ఓట్ల రూపంలోకి మలిచే యత్నం చేయటం.. ఇలాంటివి చాలానే.

ఆల్ రోడ్స్ లీడ్స్ టూ రోమ్ అన్నట్టు.. ఆల్ యాక్టివిటీస్ లీడ్ టూ విన్.. కాబట్టి ఎవరి పెర్ఫామెన్సులు వాళ్లు చేయడం కనిపించింది. నాడో- రేపో ఎన్నికల షెడ్యూలు విడుదల అవుతుందనగా.. హుజూరాబాద్, బద్వేల్ ఉప ఎన్నికలు వాయిదా పడ్డట్టు తెలిసింది. మరో రెండు నెలలకుగానీ ఈ ఎన్నికలు జరిగే పరిస్థితి లేదని తేలింది. దీంతో ఒక్కసారిగా గుండె జారినంత పనవుతోంది ఇక్కడి నుంచి పోటీ చేస్తున్న అభ్యర్ధులకు.

ఇప్పటికే హుజూరాబాద్ ఉప ఎన్నిక వాడీ వేడీ చూస్తుంటే.. ఇదిగానీ జనరల్ ఎలెక్షన్స్ కి సెమీ ఫైనలా? అన్నట్టుగా కనిపిస్తోంది. దీంతో నియోజకవర్గంలో ఎటు చూసినా ఎన్నికల కోలాహాలం. ప్రతి రోజూ విందు రాజకీయాలే. మద్యం అయితే ఏరులై పారుతోందట. లక్షలాది రూపాయల డబ్బు మంచినీళ్లలా ఖర్చవుతున్నాయట. ఈ లోగా ఎన్నిక వాయిదా పడ్డంతో.. వీళ్ల ఆశలపై ఒక్కసారిగా- వరద నీళ్లు జల్లినట్టయ్యిందన్న మాట వినిపిస్తోంది.

సరే వాయిదా అంటే ఎలాగోలా అడ్జస్ట్ చేసుకోవచ్చు. కానీ ఎన్నికల ముందు వినాయక చవితి, దసరా పండగలు. వామ్మో ఇంకేవైనా ఉందా? అంటూ అభ్యర్ధులు తమ గొంతులో పచ్చి వెలక్కాయ పడ్డట్టు ఫీలవుతున్నారట. అసలే ముందుంది ఎన్నికల పండగ. ఆపై వినాయక చవితిలాంటి అతి పెద్ద పండగ. దీంతో చెప్పేదేముందీ.. మండపాలు-విగ్రహాలు- లైటింగ్ కమ్ సౌండ్ సెటప్పూ- ఇక రోజువారీ కార్యక్రమాలూ- తీర్ధ ప్రసాదాలు- నిమజ్జనం ఏర్పాట్లు వెరసీ ఖర్చు తడిసి మోపెడు.

వీటన్నిటినీ మెయిన్ టైన్ చేసే యువజన సంఘాలు.. చందాల సేకరణ యత్నాలు. వీళ్లుగానీ ఒక్కసారి చందాకంటూ వచ్చారంటే.. ఇక తప్పించుకోడానికి వీల్లేని పరిస్థితి. కొందరైతే కేవలం ఈ ఎన్నికల అండ చూసుకుని.. గల్లీ గల్లీకో మండలి పెట్టి.. జై బోలో గణేష్ మహరాజ్ కీ అంటూ అభ్యర్ధుల ముందు ప్రత్యక్ష మవుతున్నారట. ఇప్పుడు కాదు- మళ్లీ చూద్దాం అనడానికి వీల్లేని టైట్ సిట్యువేషన్. ఇటు చూస్తే గణపతి బప్పా సెంటిమెంట్- అటు చూస్తే అప్ కమింగ్ ఎలెక్షన్ టెన్షన్. దీంతో వేలకు వేలు సమర్పయామీ.

వినాయక చవితికే మీరిలా అంటుంటే.. ఇక దసరా మాటేంటని? దసరా అంటే చెప్పేదేముందీ.. తెలంగాణ వ్యాప్తంగా పెద్ద ఎత్తున చేసే ఒకానొక భారీ పండుగ. బతుకమ్మ ఆటపాటలు కోలాహాలాలు.. ఆ జోషే సపరేటు. ఇక ఆ దావత్ లు ధూం ధాంగా జరగాల్సిందే. దీంతో బీజేపీ, టీఆర్ఎస్ పార్టీలకు ఇన్ ఫ్రంట్ హుజూరాబాద్ ఫెస్టివల్ కనిపిస్తోందట. ఇప్పటికే డబ్బు పిడికట్లో ఇసుకలాగా జారిపోతోంది. ఇక ఈ పండగలు కూడా ఫేస్ చేయాలంటే.. బాప్ రే అంటున్నారట. మాతల్లి మాంకాళీ మమ్ము కరుణించవమ్మా అంటూ వేడుకుంటున్నారట. ఓ బొజ్జగణపయ్య మమ్ము కాపాడవయ్యా అంటూ పొర్లుదండాలు పెడుతున్నారట.

రాకేష్, టీవీ9 ప్రతినిధి

Read also: Nipah Virus: నిఫా అంటేనే ఎందుకు హడలిపోతున్నారు? తెలుగు రాష్ట్రాలకు ప్రమాదం పొంచి ఉందా.! అసలు దీని కథేంటి.?