Sabarimala Temple: శబరిమల వెళ్లే భక్తులకు అలర్ట్.. కేరళలో భారీ వర్షాలు.. అయ్యప్ప దర్శనానికి ఆంక్షలు..
శబరిమలలో భక్తుల దర్శనాలు భారీ వర్షంతో మొదలయ్యాయి. టెంపుల్ ఓపెన్ అయిన మొదటి రోజే ఆలయం పరిసరాల్లో భారీ వర్షం కురిసింది. అటు.. కొవిడ్ ప్రభావంతో సుదీర్ఘకాలం తర్వాత పూర్తిస్థాయిలో ఆలయం తలుపులు తెరుచుకున్నాయి.
కేరళలోని శబరిమలలో అయ్యప్ప స్వాముల సందడి మొదలైంది. భారీ వర్షం మధ్య శబరిమల ఆలయంలో అయ్యప్ప స్వామి దర్శనాలు బుధవారం సాయంత్రం 5గంటల నుంచి ప్రారంభం అయ్యాయి. తంత్రి కందరరు రాజీవరు సమక్షంలో పదవీ విరమణ చేసిన మేల్శాంతి పరమేశ్వరన్ నంపూతిరి మండలపూజ చేసి గర్భగుడిని ప్రారంభించారు. ట్రావెన్ కోర్ దేవస్వం బోర్డు అధ్యక్షుడు కె.అనంతగోపాలన్, సభ్యుడు పి.ఎం.తంకప్పన్, కార్యనిర్వహణాధికారి కృష్ణకుమార్ ఈ పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. డిసెంబర్ 27 వరకు మండల పూజ కొనసాగనుంది. గత రెండేళ్ళుగా పరిమిత సంఖ్యలో భక్తులను అనుమతించిన శబరిమల ట్రావెన్ కోర్ దేవస్థానం బోర్డు.. ఈ యేడాది అన్ని కోవిడ్ ఆంక్షలను పూర్తిగా తొలగించింది. అయితే, భారీ వర్షాల నేపథ్యంలో కేరళ ప్రభుత్వం అప్రమత్తమైంది. ప్రస్తుతం నెలకొన్న వాతావరణ పరిస్థితుల దృష్ట్యా శబరిమల ఆలయానికి భక్తుల ప్రవేశంపై కొన్ని ఆంక్షలు విధిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. భారీ వర్షాల నేపథ్యంలో భక్తులు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. పంబా నది భారీగా ప్రవహిస్తుండటంతో ఈ ప్రాంతంలో అలర్ట్ జారీ చేసింది. కొన్ని మార్గాల్లో ప్రవేశంపై నిషేధం విధించింది. మరిన్ని వివరాల కోసం.. వెబ్‌సైట్ చూడాలని సూచించింది.
గత రెండేళ్ళుగా రోజుకి 30,000 మందిని మాత్రమే అనుమతించడంతో అయ్యప్ప భక్తులు తీవ్ర ఇబ్బందులెదుర్కొన్నారు. మండలం-మరవిలక్కు సీజన్‌లో భాగంగా ఈ యేడాది శబరిమలకు భక్తులు పోటెత్తనున్నారు. అయ్యప్ప ఆలయాన్ని బుధవారం తెరిచిన ట్రెవెన్ కోర్ బోర్డు.. వార్షిక మండలం-మకరవిలుక్కు యాత్రను కూడా ప్రారంభించింది. అయ్యప్ప దర్శనం కోసం మధ్యాహ్నం నుంచి అయ్యప్పస్వాములు, భక్తులు వేలాదిగా తరలివచ్చారు. ఇప్పటికే ట్రావెన్‌కోర్ బోర్డ్ వర్చువల్ క్యూ టోకెన్ల జారీని ప్రారంభించింది. వర్చువల్ క్యూ టోకెన్లు బుక్ చేసిన భక్తులకు మాత్రమే దర్శనం లభిస్తుందని ట్రావెన్‌కోర్ బోర్డ్ వెల్లడించింది. మరోవైపు కేరళ ప్రభుత్వం శబరిమల అయ్యప్ప భక్తులు తీసుకోవాల్సిన జాగ్రత్తల్ని అధికారిక వెబ్‌సైట్‌లో వెల్లడించింది.
#WATCH | Kerala: Sabarimala temple reopened for pilgrims
Devotees will be allowed to have darshan from today, on the 1st day of Malayalam month of Vrishchikam. Due to prevailing climatic conditions, state govt has decided to restrict entry of devotees to Sabarimala temple. pic.twitter.com/DrV8dQdS2l
— ANI (@ANI) November 16, 2022
శబరిమలలో భక్తుల దర్శనాలు భారీ వర్షంతోనే మొదలయ్యాయి. మొదటి రోజే ఆలయం పరిసరాల్లో భారీ వర్షం కురవడంతో భక్తులు ఇబ్బందులు పడ్డారు. కొద్ది రోజులుగా కేరళలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో దక్షిణాది రాష్ట్రాలను భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. ఇప్పటికే తుఫాన్ ప్రభావంతో ఆంధ్ర, తమిళనాడు, కేరళాలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. వర్షాల తీవ్రత ఎక్కువగా ఉండటంతో శబరిమల యాత్రకు వెళ్లిన భక్తులు ఇబ్బందులకు గురవుతున్నారు. పంబా నదిలో వరద నీరు భారీస్థాయిలో ప్రవహిస్తుండటంతో డ్యామ్ పరిసరాల్లో రెడ్ అలర్ట్ ప్రకటించారు.
ప్రతియేటా లక్షలాది మంది అయ్యప్పస్వామిక భక్తులు శబరిమలకు తరలివెళతారు. శబరిమల పర్యాటకుల సంఖ్య ఈ యేడాది భారీగా పెరిగే అవకాశం ఉంది. గత రెండేళ్ళుగా కోవిడ్ ఆంక్షల కారణంగా శబరిమల అయ్యప్ప స్వామిని ఎక్కువ మంది దర్శించుకోలేకపోయారు ఈ యేడాది భక్తుల సంఖ్య 40 నుంచి 50 శాతం పెరిగుతుందని అంచనా వేస్తున్నారు అధికారులు. రాబోయే పదిరోజుల్లో 7 లక్షల మంది భక్తులు అయ్యప్పస్వామి దర్శనానికి శబరిమలకు వస్తారని అధికారులు అంచనావేస్తున్నారు.
గత ఏడాది మొత్తం సీజన్‌లో 27 లక్షల మందికి మాత్రమే అయ్యప్పస్వామి దర్శనం దక్కింది. ఈ యేడాది 41 రోజుల మండల పూజ ఫెస్టివల్ డిసెంబర్ 27తో ముగుస్తుంది. శబరిమలకు ఈ యేడాది అత్యధిక సంఖ్యలో భక్తులు పోటెత్తే అవకాశం ఉండడంతో భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు ఆలయ అధికారులు.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి