Kailash Mansarovar Yatra: శివయ్య భక్తులకు గుడ్ న్యూస్.. ఐదేళ్ళ తర్వాత కైలాస మానస సరోవర యాత్ర ప్రారంభం.. ఎప్పటి నుంచి అంటే..
కైలాస మానస సరోవర యాత్ర కోసం ఎదురు చూస్తున్న భక్తుల నిరీక్షణ ఐదు సంవత్సరాల తర్వాత ముగియబోతోంది. కోవిడ్ 19 కారణంగా 2020 నుంచి కైలాస మానస సరోవర యాత్ర నిర్వహించడం లేదు. దాదాపు ఐదేళ్ళ తర్వాత ఈ సంవత్సరం తిరిగి ప్రారంభమవుతుంది. ఈ యాత్రని KMVN నిర్వహిస్తుంది. ఈ యాత్ర ఉత్తరాఖండ్‌లోని పిథోరగఢ్‌లోని లిపులేఖ్ పాస్ మార్గం ద్వారా నిర్వహించబడుతుంది. ఈ యాత్రలో 50 మంది వ్యక్తులతో కూడిన మొత్తం ఐదు గ్రూపులు ఉంటాయి. ఈసారి కైలాస మానస సరోవర యాత్ర జూలై నుంచి ప్రారంభం కానుంది.

కరోనావైరస్ ప్రపంచవ్యాప్తంగా ప్రజలను భయభ్రాంతులకు గురి చేసింది. దీని కారణంగా అనేక కార్యక్రమాలు నిలిచిపోయాయి. ఒకానొక సమయంలో మానవుల మధ్య సంబంధాలు కూడా నిలిచిపోయాయి. ఆ సమయంలో కైలాస మానస సరోవర యాత్ర కూడా ఆగిపోయింది. దాదాపు ఐదు సంవత్సరాలుగా నిలిచిపోయిన కైలాస మానసరోవర యాత్ర జూన్ 30 నుంచి తిరిగి ప్రారంభమవుతుందని అధికారిక సమాచారం అందింది. ఈ యాత్రకు సంబంధించి ఉత్తరాఖండ్ ప్రభుత్వం, భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో సోమవారం న్యూఢిల్లీలో ఒక సమావేశం జరిగింది. ఈ సమావేశంలో యాత్రను తిరిగి ప్రారంభించే అంశంపై చర్చించారు.
కైలాష్ మానసరోవర్ యాత్ర ఉత్తరాఖండ్‌లోని పిథోరగఢ్ జిల్లాలో 17,000 అడుగుల ఎత్తులో ఉన్న లిపులేఖ్ కనుమ గుండా వెళుతుంది. హిందూ విశ్వాసాల ప్రకారం కైలాస పర్వతం శివుని నివాసం. కైలాస శిఖర ప్రదక్షిణ చేసి మానస సరోవరంలో స్నానం చేయడం వల్ల మోక్షం లభిస్తుందని నమ్ముతారు. ప్రతి సంవత్సరం నిర్వహించబడే ఈ తీర్థయాత్ర COVID-19 మహమ్మారి కారణంగా 2020 లో వాయిదా పడింది. అప్పటి నుంచి మళ్ళీ ఈ యాత్ర జరగలేదు. అయితే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి కృషి కారణంగా ఈ సంవత్సరం కైలాస మానస సరోవర యాత్ర మళ్ళీ నిర్వహించనున్నట్లు తెలిపింది.
ఈ యాత్ర జూన్ 30న ఢిల్లీ నుంచి ప్రారంభమవుతుంది, ఒక్కొక్క బృందంలో 50 మంది చొప్పున ఐదు గ్రూపులుగా.. మొత్తం 250 మంది భక్తులు ఈ కైలాస మానస సరోవర యాత్రలో పాల్గొంటారు. కైలాస మానస సరోవర యాత్రలోని మొదటి బృందం జూలై 10న లిపులేఖ్ పాస్ ద్వారా చైనాలోకి ప్రవేశిస్తుంది. చివరి బృందం ఆగస్టు 22న చైనా నుంచి భారతదేశానికి బయలుదేరుతుంది.
ప్రతి బృందం ఢిల్లీ నుంచి బయలుదేరి ఉత్తరాఖండ్‌లోని చంపావత్ జిల్లాలోని తనకాపురలో ఒక రాత్రి, పిథోరగఢ్ జిల్లాలోని ధార్చులాలో ఒక రాత్రి, గుంజిలో రెండు రాత్రులు, నభిడాంగ్‌లో రెండు రాత్రులు బస చేసి చైనాలోని తక్లాకోట్‌లోకి ప్రవేశించాల్సి ఉంటుంది.
కైలాస మానస సరోవర యాత్ర తర్వాత ప్రయాణికులు తిరుగు ప్రయాణంలో చైనా నుంచి బయలుదేరి పిథోరగఢ్ జిల్లాలోని బుండిలో ఒక రాత్రి, చౌకోరిలో ఒక రాత్రి , అల్మోరాలో ఒక రాత్రి బస చేసి దేశ రాజధాని ఢిల్లీ చేరుకుంటారు. ఈ విధంగా ప్రతి బృందం మొత్తం 22 రోజులు ప్రయాణిస్తుంది. కైలాస మానస సరోవర యాత్రకు వెళ్లే అన్ని యాత్రికులకు ఆరోగ్య పరీక్షలు మొదట ఢిల్లీలో .. తరువాత గుంజిలో నిర్వహించనున్నారు.
నిపుణుల సహాయంతో ప్రయాణ సమయంలో శక్తిని అందించే, జీర్ణం కావడానికి సులభమైన ఆహారం అందిస్తారు. ఎత్తైన ప్రాంతాలలో ప్రయాణీకులకు ఎటువంటి సమస్యలు ఎదురుకాకుండా ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటారు. ప్రయాణంలో, వృద్ధులు, యువత, మహిళల అవసరాలను దృష్టిలో ఉంచుకుని ప్రత్యేక ఆహారాన్ని అందించనున్నారు. నిపుణుల సలహా తీసుకున్న తర్వాత కార్పొరేషన్ కుమావోని, సరిహద్దు ప్రాంతాలలో తయారుచేసిన స్థానిక ఆహార పదార్థాలను ఎత్తైన ప్రదేశాలలో ప్రయాణికులకు అందించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు.




