కోవిడ్ 19 ఎఫెక్ట్… హరిద్వార్‌లో కార్తీక స్నానాలపై నిషేధం.. సరిహద్దులు మూసివేత..
కార్తీక పౌర్ణమి పర్వదినం వేళ ఉత్తరాఖండ్ పోలీసులు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆధ్యాత్మిక నగరమైన హరిద్వార్‌కు వచ్చే మార్గాలన్నింటినీ మూసివేస్తున్నట్లు ప్రకటించారు.
కార్తీక పౌర్ణమి పర్వదినం వేళ ఉత్తరాఖండ్ పోలీసులు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆధ్యాత్మిక నగరమైన హరిద్వార్‌కు వచ్చే మార్గాలన్నింటినీ మూసివేస్తున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు. నేటి నుంచి నవంబర్ 30వ తేదీ(సోమవారం) వరకు హరిద్వార్ సరిహద్దులన్నింటినీ మూసివేస్తున్నట్లు పోలీసు అధికారులు తెలిపారు. కార్తీక పౌర్ణమి సందర్భంగా ప్రతి ఏటా దేశ వ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద ఎత్తున హరిద్వార్‌కు తరలి వస్తారు. ఆ సందర్భంగా హరిద్వార్ గుండా ప్రవహిస్తున్న గంగా నదిలో పవిత్ర స్థానాలను ఆచరిస్తారు. ఈ ఏడాది కూడా భక్తులు భారీగా తరలివచ్చే అవకాశం ఉండటం, కోవిడ్ 19 వ్యాప్తి నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సీనియర్ ఎస్పీ సెంథిల్ అబుదాయ్ క్రిషన్‌రాజ్ వెల్లడించారు. దీనికి ముందు కోవిడ్ 19 వ్యాప్తి నేపథ్యంలో హరిద్వారలో కార్తీక స్నానాలను నిషేధిస్తూ జిల్లా అధికార యంత్రాంగం ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. తాజాగా ఆ ఉత్తర్వులకు అనుగుణంగా పోలీసులు సైతం యాక్షన్ ప్లాన్ సిద్ధం చేశారు. వివిధ ప్రాంతాల నుంచి హరిద్వార్‌కు వచ్చే మార్గాలన్నింటినీ మూసివేశారు.