Cheekati Koneru Secrete: మంగళగిరి గాలి గోపురానికి, చీకటి కోనేరుకు ఉన్న సంబంధం.. అసలు రహస్యం ఇదేనా?..
Cheekati Koneru Secrete: దక్షిణ భారత దేశంలోనే ఎత్తైన మంగళగిరి గాలి గోపురానికి, చీకటి కోనేరుకు ఉన్న సంబంధం ఏంటి..? గాలి గోపురానికి వంద అడుగుల
Cheekati Koneru Secrete: దక్షిణ భారత దేశంలోనే ఎత్తైన మంగళగిరి గాలి గోపురానికి, చీకటి కోనేరుకు ఉన్న సంబంధం ఏంటి..? గాలి గోపురానికి వంద అడుగుల దూరంలోనే కోనేరును ఎందుకు తవ్వారు. చీకటి కోనేరు అభివృద్ధి పనులతో బయటపడుతున్న నిజాలేంటి..? మంగళగిరి గోపురం భద్రతపై నీలిమేఘాలు కమ్ముకున్న దశలో చీకటి కోనేరులో దాగి ఉన్న వాస్తవాలు ఏంటో తెలుసుకుందాం..?
మంగళగిరి శ్రీ లక్ష్మీ నృసింహస్వామివారి గాలిగోపురం దక్షిణ భారత దేశంలోనే ఎత్తయినది. రెండు శతాబ్దాలను పూర్తిచేసుకుంది. 11 అంతస్తులతో 157 అడుగుల ఎత్తును కలిగి కేవలం 49 అడుగుల పీఠభాగంతో.. గాలిలో ఠీవిగా నిలబడినట్టు కనిపిస్తూ సందర్శకులను అబ్బురపరిచే అద్వితీయ నిర్మాణమిది. దీనిని 1807-1809 కాలంలో నాటి ధరణికోట జమిందారు శ్రీ రాజా వాసిరెడ్డి వేంకటాద్రినాయుడు నిర్మించారు. ఈ గోపుర పీఠభాగం పూర్తిగా రాతిచే నిర్మితమైంది. అయితే, గత కొంతకాలంగా గాలిగోపురం పడిపోయే స్థితిలో ఉందని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. 2012 నుండి ఈ గోపురాన్ని కాపాడుకునేందుకు స్థానికులు, అధికారులు అనేక ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. నెల రోజుల క్రితం కొన్ని పెచ్చులు విరిగి పడటంతో మరోసారి గోపురం భద్రతపై ప్రశ్నలు తలెత్తాయి. ఈ ఘటన జరిగిన వెంటనే దేవాలయం మూఢ వీధుల్లో హెవీ వెహికిల్స్‌తో పాటు వాహనాలు ఏవీ తిరగకుండా గడ్డర్స్ ఏర్పాటు చేశారు. ఆ తర్వాత శిథిలావస్థకు చేరుకున్న చీకటి కోనేరును అభివృద్ధి చేస్తున్నారు. చీకటి కోనేరును శుభ్రం చేస్తున్న క్రమంలోనే వేంకటేశ్వర స్వామి పంచలోహ విగ్రహం బయటపడింది. వినాయకుడి విగ్రహం కూడా చీకటి కోనేరులో ఉన్నట్లు కనుక్కొని ప్రత్యేక పూజలు చేశారు. అయితే, అసలు చీకటి కోనేరుకు గాలి గోపురానికి సంబంధం ఏంటీ? అన్న ప్రశ్నలు ఇప్పుడు తెరపైకి వచ్చాయి.
అత్యంత ఎత్తైన గాలి గోపురం నిర్మాణం చేస్తున్న సమయంలోనే గోపురం ఉత్తరం వైపునకు వంగిపోయిందని స్థానికులు చెబుతారు. దాన్ని సరి చేసేందుకు గోపుర నిర్మాణ కర్తలు కొంతమంది తమిళనాడులోని కాంచీపురం పంపించారని చెప్పారు. దేవాలయాల ఆర్కిటెక్చర్‌లో కాంచీపురం శిల్పులు అప్పటికే ప్రసిద్ధి చెందారని, వారిచ్చిన సలహాతోనే చీకటి కోనేరును తవ్వినట్లు చెప్పారు. గోపురానికి ఈశాన్య దిశలో వంద అడుగుల దూరంలో గోపురం ఎత్తు అంత లోతులో కోనేరు తవ్వాలని అక్కడి వారు సలహా ఇచ్చారట. దీంతో ఈశాన్య దిశలో 153 అడుగుల లోతులో చీకటి కోనేరును నిర్మించారని, ఆ తర్వాతే గోపురం ఎటువంటి వంకలు లేకుండా సరైనట్లు చెబుతారు. చీకటి కోనేరు కూడా గోపురాన్ని తల కిందులుగా చేసినట్లు నిర్మించారట. లోతుకు పోయే కోద్దీ వెడల్పు తగ్గించుకుంటూ పోయారు. గోపురం కింద నుండి పైకి ఉంటే కోనేరు అందుకు వ్యతిరేకంగా నిర్మించారంటున్నారు. చీకటి కోనేరును అభివృద్ధి చేయడం పట్ల స్థానికులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
చరిత్రలో భాగమైన గోపురాన్ని కాపాడుకునేందుకు అందరూ కట్టుబడి ఉండాలని స్థానికులు చెబుతున్నారు. గతంలోనూ గోపురం భద్రతపై అనుమానాలు కమ్ముకున్నాయని ఒకానోక దశలో పడేసేందుకు సిద్ధమయ్యారని అంటున్నారు. అయితే స్థానికుల ఆందోళన తర్వాత పడేయాలన్న ఆలోచన విరమించుకోని ఏ విధంగా కాపాడుకోవాలో ప్రయత్నాలు చేస్తున్నారని చెప్పారు. గోపురం పునాదులు గతంలో తడికే రూపంలో వెడల్పుగా వేసేవారని, గోపురం పక్కనే ఉన్న రోడ్డు కింద కూడా పునాదులున్నాయని చెబుతున్నారు. భారీ వాహనాలు తిరగడంతోనే పునాదులు దెబ్బతిని గోపురం భద్రత ప్రశ్నార్థకమైందన్నారు. చీకటి కోనేరును అభివృద్ధి చేయడం మంచిదేనన్నారు. అయితే ఇటలీలోని పీసా టవర్ పడిపోకుండా రీట్రో ఫిట్టింగ్ టెక్నాలజీని వాడారని అటువంటి సాంకేతికత ద్వారా గోపురాన్ని కాపాడుకోవచ్చునంటున్నారు. 2012 లో చెన్నై ఐఐటీ నిపుణులు ఇచ్చిన నివేదిక బయటపెట్టాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. గోపురం చుట్టు పక్కల చిన్నచిన్న గుంతలు ఏర్పాటు చేసి అందులో కాంక్రీట్ ఫిల్లింగ్ చేయాలన్నారు. ప్రభుత్వం ఆ దిశగా చర్యలు చేపట్టి గోపురాన్ని కాపాడాలని డిమాండ్ చేస్తున్నారు. చీకటి కోనేరును అభివృద్ధి చేయడంతో పాటు గోపురాన్ని కాపాడుకోవటానికి తగిన చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకుంటుందో వేచి చూడాలి.
Also read:
Telangana Employees: ఉద్యోగుల వర్గీకరణపై త్వరలో ఉత్తర్వులు.. బదిలీల ప్రక్రియ ఎలా ఉంటుందంటే..
Boat Sinking River: జవాద్ తుపాను బీభత్సం.. కళ్ల ముందే పల్టీ కొట్టిన బోటు.. వైరల్ అవుతున్న వీడియో..
Threat Calls: రోజులు లెక్కపెట్టుకో.. నిన్ను చంపేస్తాం.. ఉద్యమ నేతకు అగంతకుల వార్నింగ్..!