AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vastu Tips: ఈ వాస్తు చిట్కాలు పాటిస్తే.. ప్రశాంతమైన జీవితం, ఆధ్యాత్మిక పురోగతి..

జీవితంలో ఆధ్యాత్మికత కూడా ఒక ముఖ్యమైన భాగంగా మారుతోంది. వయోభేదం లేకుండా చిన్నా పెద్దా అందరూ ఆధ్యాత్మిక చింతనను అలవాటు చేసుకుంటున్నారు. ప్రశాంతమైన ఆధ్యాత్మిక జీవితం గడపటానికి, ఆధ్యాత్మిక చింతనలో పురోగతి సాధించడానికి ఇతర ప్రయత్నాలతో పాటు వాస్తు పరంగా...

Vastu Tips: ఈ వాస్తు చిట్కాలు పాటిస్తే.. ప్రశాంతమైన జీవితం, ఆధ్యాత్మిక పురోగతి..
Vastu Tips
TV9 Telugu Digital Desk
| Edited By: Narender Vaitla|

Updated on: Jan 14, 2023 | 11:05 AM

Share

జీవితంలో ఆధ్యాత్మికత కూడా ఒక ముఖ్యమైన భాగంగా మారుతోంది. వయోభేదం లేకుండా చిన్నా పెద్దా అందరూ ఆధ్యాత్మిక చింతనను అలవాటు చేసుకుంటున్నారు. ప్రశాంతమైన ఆధ్యాత్మిక జీవితం గడపటానికి, ఆధ్యాత్మిక చింతనలో పురోగతి సాధించడానికి ఇతర ప్రయత్నాలతో పాటు వాస్తు పరంగా ఎటువంటి చిట్కాలు, మార్గాలు అనుసరించాలనేది క్రమంగా ప్రాధాన్యం సంతరించుకుంటోంది. దీనిపై ప్రత్యేకంగా అధ్యయనం చేసిన వాస్తు శాస్త్ర నిపుణులు వివిధ ప్రామాణిక గ్రంథాల ద్వారా ఇందుకు కొన్ని వాస్తు పరమైన మార్గాలను సూచిస్తున్నారు. ఇళ్లల్లో పూజా మందిరాలను ఏర్పాటు చేసుకోవడం సహజమే. వీటినే ఆధ్యాత్మిక మందిరాలుగా కూడా ఉపయోగిస్తున్నారు. ఈ మందిరాలతో వారి భక్తి భావనలు, ఆశలు, నమ్మకాలు ముడిపడి ఉంటాయి. చాలా మంది మానసిక ప్రశాంతత కోసం కూడా వీటిని ఆశ్రయిస్తుండటం సర్వసాధారణం అయిపోయింది. కొందరు తమ ఇళ్లల్లో పూజా మందిరాలు కాకుండా ఆధ్యాత్మిక మందిరాలను లేదా ప్రదేశాలను విడిగా, ప్రత్యేకంగా కూడా ఏర్పాటు చేసుకుంటుంటారు. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని వాస్తు పరంగా ఒక సరైన ప్రదేశాన్ని ఇళ్లల్లో డిజైన్ చేయాల్సి ఉంటుంది.

వ్యక్తిగత జీవితంలో ఆధ్యాత్మిక పురోగతిని, పరిపక్వత ను కోరుకునేవారు ప్రధానంగా తూర్పు లేదా ఈశాన్య దిశలోనే కూర్చోవడం మంచిది. ఈశాన్యం అనే పేరు ఈశ్వరుడు అనే పదం నుంచే వచ్చిందని చెబుతారు. ఈ దిశలోనే భూమికి సంబంధించిన అతి శక్తివంతమైన ఎనర్జీ విడుదల అవుతుంటుంది. అందువల్ల పూజా మందిరం అయినా, ధ్యాన మందిరం అయినా ఈశాన్య దిశనే ఎంచుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ ఇంట్లో తూర్పు లేదా ఈశాన్య దిశలో కాకుండా మరి ఎక్కడైనా ఈ మందిరాన్ని ఏర్పాటు చేసుకున్నట్లయితే, ఈశాన్యం లేదా తూర్పు దిశకు అభిముఖంగా కూర్చోవడం మంచి ఫలితాలను ఇస్తుంది. ఆధ్యాత్మిక సాధనకు కూర్చున్నప్పుడు మనసు గజిబిజిగా, అల్లకల్లోలంగా ఉండకూడదనేది అందరికీ తెలిసిన విషయమే. ప్రార్థనకు లేదా ధ్యానానికి కూర్చున్నప్పుడు మనసు ప్రశాంతంగా ఉండవలసిన అవసరం ఉంది. అందుకు తూర్పు, ఈశాన్య దిశలే అత్యుత్తమం.

శ్రద్ధాసక్తులకు సహకారం..

ధ్యానానికి లేదా మరేదైనా ఆధ్యాత్మిక సాధనకు అతి సూక్ష్మమైన ప్రాణశక్తి అవసరమవుతుంది. ఆ శక్తి శరీరంలోకి ప్రవేశిస్తే తప్ప ఆధ్యాత్మికంగా పురోగతి సాధ్యం కాదు. తూర్పు, ఈశాన్య దిశలకు అభిముఖంగా కూర్చున్న వారికి తప్పకుండా ఈ ప్రాణశక్తి అందుతుంది. దీనివల్ల ఆరోగ్యం మెరుగుపడుతుంది. మానసిక ప్రశాంతత లభిస్తుంది. ఏకాగ్రత సాధ్యమవుతుంది. స్థిర చిత్తం అలవడుతుంది. అంతేకాదు, ఇది మనసు లోతుల్లోంచి వ్యక్తిని క్రమంగా ఆధ్యాత్మిక పురోగతి వైపు నడిపిస్తుంది. పూజా మందిరంలో అయినా, ఆధ్యాత్మిక మందిరంలో అయినా ఎదురుగా ఒక పీఠాన్ని ఏర్పాటు చేసుకుని, ఆ పీఠం మీద ఇష్ట దైవానికి సంబంధించిన ప్రతిమనో, చిత్తరువునో, ఆధ్యాత్మిక గురువుల ఫోటోలనో అమర్చుకోవాల్సి ఉంటుంది. పువ్వులతోనూ, పూలదండలతోనూ పీఠాన్ని అలంకరించి, దీపం వెలిగించడం వల్ల మానసిక ప్రశాంతత ఏర్పడుతుంది.

ఇవి కూడా చదవండి

సాధారణంగా తెల్లటి వస్త్రాన్ని కింద పరచి ధ్యానానికి కూర్చోవడం మంచిది. దీనివల్ల మనసు ప్రశాంతంగా ఉంటుంది. ఏకాగ్రత కుదురుతుంది. పాజిటివ్ ఎనర్జీ మెరుగుపడుతుంది. ధ్యానం చేసుకునే ప్రదేశం మొత్తం ప్రశాంతంగా, పరిశుభ్రంగా, మనోహరంగా, ఉల్లాసంగా ఉండటం చాలా అవసరం. ఈ ప్రదేశంలో గంధపు చెక్కలను లేదా అగరవత్తులను లేదా దీపాన్ని వెలిగించడం వల్ల అవి ప్రాణశక్తిని ఆకర్షిస్తాయని, వీటివల్ల చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు తొలగిపోతాయని వాస్తు నిపుణులు చెబుతున్నారు. అంతేకాక, మనసులోని ఆందోళనలు, ఆదుర్గాలు, ఒత్తిడి, కుంగుబాటు వంటివి కూడా తగ్గిపోతాయని వారు సూచించారు. మనసు, మేధ చురుకుగా పనిచేయడానికి కూడా ఇవి తోడ్పడతాయని సూచించారు.

ధ్యాన మందిరాల్లో ఏ రంగులు వాడితే ఏ రకమైన ఫలితం ఉంటుందో కూడా వాస్తు నిపుణులు వివరించారు. ధ్యాన మందిరంలోని గోడలకు గానీ, పూజా మందిరానికి గానీ లేదా పీఠానికి గానీ లేత పసుపు రంగును పూయటం వల్ల ఆధ్యాత్మిక సంబంధంగా పట్టుదల పెరుగుతుంది. ఆత్మవిశ్వాసం ఇనుమడిస్తుంది. శ్రద్ధ ఎక్కువవుతుంది. పచ్చ రంగు పూస్తే మనసు నిలకడగా ఉంటుంది. చేస్తున్న పని మీద దృష్టి కేంద్రీకరించడం సాధ్యపడుతుంది. ఇక తెలుపు రంగును ఉపయోగించడం వల్ల మనసు స్వచ్ఛంగా ఉంటుంది. అనవసర విషయాల మీదకు మళ్ళకుండా ఉంటుంది. ధ్యానం మీదే లగ్నం అవుతుంది. లేత గోధుమ రంగును ఉపయోగిస్తే ధ్యానంలో ఎంతసేపైనా కూర్చోవడానికి అవసరమైన ఓర్పు, సహనం, దీక్ష మనసుకు పడతాయి. ఆధ్యాత్మిక సాధనలో అతివేగంగా పురోగతి చెందటానికి వాస్తు పరంగా ఇవన్నీ తప్పనిసరిగా చేయవలసి ఉంటుందని వాస్తు నిపుణులు వివరించారు.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం క్లిక్ చేయండి..