Chitragupta Swamy Temple: భారతదేశంలో ఏకైక చిత్రగుప్తుని ఆలయం ఎక్కడ ఉందో తెలుసా..? ప్రత్యేకత ఏమిటి..?
Chitragupta Swamy Temple: భారతదేశంలో ఏకైక చిత్రగుప్తుని ఆలయం ఉన్న విషయం చాలా మందికి తెలియదు. అధ్యాత్మికంగా అనుభవం ఉన్నవారికి, పెద్దలకు మాత్రమే తెలిసి ఉంటుంది...
Chitragupta Swamy Temple: భారతదేశంలో ఏకైక చిత్రగుప్తుని ఆలయం ఉన్న విషయం చాలా మందికి తెలియదు. అధ్యాత్మికంగా అనుభవం ఉన్నవారికి, పెద్దలకు మాత్రమే తెలిసి ఉంటుంది. అయితే ఈ చిత్రగుప్తుని ఆలయం తమిళనాడులోని కాంచీపురంలో ఉంది. ప్రత్యేకంగా చిత్రగుప్తుని ఆలయం నిర్మించబడి ఉంది. భారతదేశం మొత్తం మీద ఈ ఒక్క కాంచీపురంలోనే కావడం ఒక విశేషం. పాపపుణ్యాల చిట్టా రాయడంలో చిత్రగుప్తుడికి ఉన్న నేర్పు మరెవరికీ ఉండదు. ఎందుకంటే ఆయన మానవులు చేసిన పాపపుణ్యాలను కూడా కనిపెట్టి రాయగలిగినవాడు. ఈ ఆలయంలోకి అడుగుపెట్టగానే మనకు దర్శనమిచ్చేది ఒక చేతి పుస్తకం, మరో చేతిలో కలం పట్టుకున్న చిత్రగుప్తుడి రూపమే. ఆ రూపం చూడగానే జీవితంలో ఎప్పుడూ పాపం చేయకుండా ధర్మ మార్గంలో జీవించాలనే ఆలోచన రాకమానదు.
పురాణాల ప్రకారం.. ఒకసారి యముడు బ్రహ్మ దగ్గరకు వెళ్లి పాపులకు శిక్షలు విధించే కార్యక్రమంలో తనకు సహకరించగల ఒక సమర్ధుడైన గణకుడిని ప్రసాదించమని కోరాడు. యముడు కోరికను అంగీకరించిన బ్రహ్మదేవుడు అందుకు ఏం చేయ్యాలా అని ఆలోచించాడు. యమధర్మరాజు కోరికను అతని తండ్రి అయిన సూర్యనారాయణుడే నెరవేర్చగలడని బ్రహ్మకు అనిపించింది. బ్రహ్మ సంకల్పంతో మార్తాండుని మనసులోకి మదనుడు ప్రవేశించాడు. ప్రపంచానికంతటికీ వెలుగును ప్రసాదించే ప్రభాకరుడు ఒక రోజున ఆకాశ మార్గాన తన ఏకచక్ర రథంలో ప్రయాణిస్తున్నాడు. ఆ సమయంలో సూర్యకిరణాలు సముద్ర జలాలపై ప్రసరించి ఏడు రంగులతో కూడిన అందమైన ఒక కాంతిపుంజం ఉద్భవించింది. అది చూసి భానుడు పులకరించిపోయాడు. ఇటువంటి సౌందర్యంగల ఇంద్రచాపం ఒక స్త్రీ రూపం ధరిస్తే ఎలా ఉంటుందో కదా అనుకున్నాడు. సూర్యుని మనస్సులో చెలరేగుతున్న శృంగార భావాలను దివ్యదృష్టితో గ్రహించిన విధాత విచిత్రంగా నవ్వుకున్నాడు. ఫలితంగా బ్రహ్మ సంకల్పంతో ఆ ఏడురంగుల అపూర్వమైన ఇంద్రధనస్సు కాస్తా అపూర్వ సుందరిగా మారిపోయింది. ఆమెను చూసి సూర్యుడు ఎంతో పులకించిపోయాడు. బ్రహ్మ యొక్క అనుమతితో భానుడు ఆమెను దగ్గరకు తీసుకున్నాడు. ఆపై పేరులేకుండా ఆవిర్భవించిన ఆమెకు నీలాదేవి అని పేరు పెట్టి అర్థాంగిగా స్వీకరించాడు. సూర్యుడు, నీలాదేవి కొంత కాలం పాటు శృంగార సముద్రంలో తేలియాడారు. బ్రహ్మసంకల్పం ఫలించింది. చిత్రగుప్తుడి అవతారం ఉదయించే సమయం ఆసన్నమైంది. ఫలితంగా చైత్రపూర్ణిమ రోజున వారికి కుమారుడు కలిగాడు. అందుకు ఆ బాలునికి ‘చిత్ర పుత్రుడు’ అని నామకరణం చేశారు. అతడే చిత్రగుప్తుడుగా ప్రసిద్ధుడయ్యాడు. పుడుతూనే ఆ బాలుని ఎడమ చేతిలో పుస్తకం, కుడిచేతిలో కలం ఉన్నట్టు రేఖలు కనిపించాయట.
చిత్రగుప్తుని ముగ్గురు మహాత్ములైన బ్రహ్మల కుమార్తెలతో వివాహం జరిగింది. చిత్రగుప్తుని భార్యల పేర్లు మరియు వారి తండ్రుల పేర్లు ఏమిటంటే శివాంశతో జన్మించిన దేవశిల్పి మయబ్రహ్మ కుమార్తె ప్రభావతి, మనుబ్రహ్మ కుమార్తె నీలావతి, విశ్వబ్రహ్మ కుమార్తె కర్ణికలు. పంచలోహాలతో రూపొందించబడ్డ శ్రీ కర్ణికాదేవి సమేతంగా చిత్రగుప్తుని ఉత్సవ విగ్రహం కాంచి ఆలయంలో దర్శనమిస్తుంది. 1910 సంవత్సరంలో తిధిరోజున భక్తులు అధిక సంఖ్యలో ఈ ఆలయాన్ని సందర్శిస్తారు. అయితే వరుసగా ఐదు చైత్ర పౌర్ణములలో చిత్రగుప్తునికి అర్చన చేయిస్తే వివాహం నిశ్చయమవుతుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం.
నవగ్రహాలలో ఒకడైన కేతువు ఆరాధించే ప్రధాన దైవం చిత్రగుప్తుడు. మోక్షాన్ని ప్రసాదించేది కేతువేనని శాస్త్రవిశ్వాసం. కేతుమహాదశ ప్రారంభమవుతున్నవారూ, అశ్వని, మూల నక్షత్రాలలో జన్మించినవారు చిత్రగుప్తునికీ, కేతువులకూ అర్చనలు, అభిషేకాలు చేయిస్తే చాలా మంచిదని జ్యోతిషశాస్త్ర పండితులు చెబుతున్నారు.