Currency Matha: కరెన్సీ నోట్లతో భక్తిని చాటుకున్న భక్తులు.. కోట్ల రూపాయలతో అమ్మవారి అలంకరణ..
ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఎక్కడ విన్నా.. చూసినా అక్కడి అమ్మవారి గురించే చర్చ. భారీ మొత్తంలో కరెన్సీ నోట్ల డెకరేషన్‌లో అమ్మవారి రూపం దేదీప్యమానంగా వెలిగిపోతోంది.
ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఎక్కడ విన్నా.. చూసినా అక్కడి అమ్మవారి గురించే చర్చ. భారీ మొత్తంలో కరెన్సీ నోట్ల డెకరేషన్‌లో అమ్మవారి రూపం దేదీప్యమానంగా వెలిగిపోతోంది. ఇంకేముంది పెద్ద ఎత్తున అమ్మవారిని దర్శించుకునేందుకు బారులు తీరారు భక్తులు.
ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. ఎక్కడా.. ఏ వీధిలో చూసిన అమ్మవారి విగ్రహాలు కొలువుదీరాయి. నవరాత్రులు అమ్మవారిని కొలిచేందుకు ప్రతి రోజూ ప్రత్యేకంగా అలంకరించి భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహిస్తున్నారు. అయితే పాలమూరు పట్టణ ఆర్యవైశ్య సంఘం మాత్రం ఇంకాస్త ఎక్కువ ఆధ్యాత్మిక చింతనతో ఓ ప్రత్యేక కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. భక్తుల దృష్టిని ఆకర్షించడమే కాదు ఔరా అనించేలా అమ్మవారిని అలంకరించారు.
దేవి శరన్నవరాత్రి ఉత్సవాలలో భాగంగా పాలమూరు బ్రాహ్మణవాడి వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంలో ప్రతిరోజూ ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. రోజుకో రూపంలో అమ్మవారిని అలంకరిస్తూ భక్తులకు దర్శనం కల్పిస్తున్నారు. ఈ క్రమంలోనే అమ్మవారిని మహాలక్ష్మి రూపంలో అలంకరించాలని నిర్వాహకులు నిర్ణయించారు. ఇందుకోసం భారీ మొత్తంలో కరెన్సీ నోట్లతో అలంకరించాలని భావించారు. ఇంకేముంది ఈ సారి అమ్మవారిని రూ. 6,66,66,666.66లతో అలంకరించాలని డిసైడ్ అయ్యారు. అందుకు తగ్గట్టు నగదును సేకరించేందుకు దాతలను ఆశ్రయించారు. దాతల సహకారంతో వచ్చిన విరాళాలను సిద్ధం చేసుకున్నారు. ఇక కరెన్సీ నోట్లతో అమ్మవారిని అలంకరించేందుకు తమిళనాడు నుంచి ప్రత్యేకంగా కళాకారులను రప్పించారు. కాయిన్స్ నుంచి చిన్నా, పెద్దా నోటు తేడా లేకుండా అన్నింటినీ అందంగా సిద్ధం చేసి.. అమ్మవారి ఆలయాన్ని సుందరంగా తీర్చిదిద్దారు. ఒక్క పైసా, 5పైసల నాణేలు కూడా సేకరించి ఔరా అనిపించారు.
ఇక విషయం తెలుసుకున్న అమ్మవారి భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. మహాలక్ష్మి రూపంలో ఉన్న అమ్మవారిని దర్శించుకొని కరెన్సీ నోట్ల డెకరేషన్ ను ప్రత్యేకంగా తిలకించారు. ఇక పెద్ద ఎత్తున కరెన్సీ నోట్లు ఏర్పాటు చేయడంతో నిర్వాహకులు ఆలయం మొత్తం సీసీ కెమెరాలతో పటిష్ట నిఘా ఏర్పాటు చేశారు. భక్తుల దర్శనం అనంతరం ఆదివారం రాత్రి కరెన్సీ నోట్లను తిరిగి దాతలకు ఇవ్వాలని నిర్ణయించినట్లు నిర్వాహకులు తెలిపారు. ప్రతిఒక్కరికీ అష్టైశ్వర్యాలు సిద్దించాలన్న లక్ష్యంతో అమ్మవారిని ఈ రకంగా అలంకరించినట్లు తెలిపారు.
మరిన్ని ఆథ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..