Statue of Equality: పుడమి పుణ్యం.. భగవద్రామానుజుల జననం..! భారతావని సుకృతం.. ఆ సమతామూర్తి దివ్య విగ్రహం..!!

సహస్ర కాంతుల దీపం భగవద్రామానుజులవారు! విశ్వానికి మానవతా సందేశాన్ని అందించిన మహనీయులు! ఈ భువిపై ఆ పావనమూర్తి అవతరించి వెయ్యేళ్లు

Statue of Equality: పుడమి పుణ్యం.. భగవద్రామానుజుల జననం..! భారతావని సుకృతం.. ఆ సమతామూర్తి దివ్య విగ్రహం..!!
Samatamurthy Statue
Venkata Narayana

|

Sep 18, 2021 | 7:05 PM

Sri Ramanuja Sahasrabdi Samaroham: సహస్ర కాంతుల దీపం భగవద్రామానుజులవారు! విశ్వానికి మానవతా సందేశాన్ని అందించిన మహనీయులు! ఈ భువిపై ఆ పావనమూర్తి అవతరించి వెయ్యేళ్లు గడిచాయి! అందుకే.. ఆ సమతామూర్తికి కృతజ్ఞతగా.. వచ్చే ఏడాది 2 నుంచి 14వ తేదీ వరకూ సహస్రాబ్ది మహోత్సవాలను నిర్వహిస్తున్నారు శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన్నజీయర్‌ స్వామి!

అంతేకాదు.. వారి సత్య సంకల్పం సిద్ధించి.. దివ్య సాకేతంలో 216 అడుగుల భగవద్రామానుజాచార్యుల మహా విగ్రహం రూపుదిద్దుకుంది. ఆ సమతామూర్తి విగ్రహావిష్కరణకు విచ్చేయవలసిందిగా.. ప్రధాని మోదీని కలిసి సాదరంగా ఆహ్వానించారు చిన్నజీయర్‌ స్వామి. 130 కోట్ల భారతీయుల ప్రతినిధిగా.. వచ్చే ఫిబ్రవరి 5వ తేదీన భగవద్రామానుజుల మహా విగ్రహాన్ని ఆవిష్కరిస్తారు ప్రధాని!!

అవును.. శ్రీరామానుజ వైభవం అద్భుతం..అపురూపం! ఆ జగద్గురువు అవతరించి వెయ్యేళ్లయిన సందర్భంగా..ఆ మానవతా స్ఫూర్తికి కృతజ్ఞతగా..సహస్రాబ్ది విశిష్ట వేడుకలు తలపెట్టారు శ్రీశ్రీశ్రీ త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చిన్నజీయర్‌ స్వామి! వారి శుభ సంకల్పానికి సాకార రూపమే..216 అడుగుల భగవద్రామానుజుల పంచ లోహమయమూర్తి.! ఆ సమతామూర్తి సహస్రాబ్ది వేడుకలు వచ్చే ఏడాది ఫిబ్రవరి 2 నుంచి 14 వరకు హైదరాబాద్‌లోని ముచ్చింతల్‌ శ్రీరామనగరంలో వైభవంగా జరగనున్నాయి.

1

భగవద్రామానుజ సంప్రదాయం మనది అని ఆనందంగా.. సగర్వంగా చెప్పుకునే అదృష్టం ఈ జాతిది.! అందుకే రామానుజాచార్యుల సహస్రాబ్ది విశిష్ట వేడుకలకు యావత్‌ దేశంలోని ప్రముఖులను స్వయంగా ఆహ్వానిస్తున్నారు శ్రీశ్రీశ్రీ చినజీయర్‌స్వామి! ఆ క్రమంలోనే భారత ప్రధాని నరేంద్ర మోదీని కలిసి..శ్రీరామానుజుల మహావిగ్రహ ఆవిష్కరణ మహోత్సవ ఘట్టానికి విచ్చేయవలసిందిగా ఆహ్వానించారు చినజీయర్‌ స్వామి! 216 అడుగుల సమతామూర్తి పంచలోక విగ్రహాన్ని ఆవిష్కరించాలని కోరారు.

దేశం గర్వించే ఈ బృహత్కార్యంలో పాల్గొనడానికి ప్రధాని నరేంద్ర మోదీ సుముఖత వ్యక్తం చేశారు. శ్రీరామానుజాచర్యుల సహస్రాబ్ది వేడుకల ఆహ్వానాన్ని భక్తిపూర్వకంగా అంగీకరించారు. వచ్చే ఫిబ్రవరి 5వ తేదీన హైదరాబాద్‌లోని ముచ్చింతల్లో వెలిసిన సమతామూర్తి మహా విగ్రహాన్ని ప్రధాని ఆవిష్కరిస్తారు.

ప్రపంచానికి సమతా సందేశాన్ని అందించే లక్ష్యంతో..216 అడుగుల భగవద్రామానుజుల మహా విగ్రహాన్ని రూపొందించడం అభినందనీయమన్నారు ప్రధాని! ఈ మహాకార్యం సాకారం చేసిన చిన్నజీయర్‌ స్వామి సంకల్పాన్ని కొనియాడారు. ప్రధానిని ఆహ్వానించిన చిన్నజీయర్‌ స్వామి వెంట.. మై హోం గ్రూప్ చైర్మన్ జూపల్లి రామేశ్వరరావు ఉన్నారు.

భగవద్రామానుజుల సిద్ధాంతమంటే మానవతా సందేశమే! విశిష్టాద్వైత విశ్వరూపమే! అందుకే ఆ మహనీయుని విగ్రహావిష్కరణ ఘట్టానికి అతిరథ మహారథులు విచ్చేయనున్నారు. ఇప్పటికే రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌, ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్వీ రమణలను స్వయంగా కలిసి..ఈ మహోత్సవాలకు రావాలంటూ ఆత్మీయ ఆహ్వానం పలికారు చిన్నిజీయర్‌ స్వామి.

Ramanujan Statue (4)

అలాగే రక్షణమంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌, హోంమంత్రి అమిత్‌షా, కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్‌రెడ్డి, కేంద్ర మంత్రులు నితిన్‌ గడ్కరీ, అశ్విని కుమార్‌ చౌబే, శోభా కరంద్లాజే, భూపిందర్‌ యాదవ్‌తోబాటు ఆర్‌ఎస్‌ఎస్‌ చీఫ్‌ మోహన్‌ భగవత్‌లను కూడా కలిసి..శ్రీ రామానుజాచార్యుల మహా విగ్రహావిష్కరణకు సాదరంగా ఆహ్వానించారు.

స్వామీజీ ఆహ్వానాన్ని వినయపూర్వకంగా అందుకున్నారు నేతలు! చిన్నజీయర్‌స్వామిని కలవడం పూర్వజన్మ సుకృతమని ఈ సందర్భంగా అమిత్‌ షా ట్వీట్‌ చేశారు.

హైదారాబాద్‌ ముచ్చింతల్‌లోని దివ్య సాకేతంలో 2022 ఫిబ్రవరి 2 నుంచి 14 వరకు జరగబోయే శ్రీరామానుజ సహస్రాబ్ది వేడుకల సంరంభం.. లోక కల్యాణదాయకం! ఈ సందర్భంగా సహస్ర కుండాత్మక లక్ష్మీనారాయణ యాగం నిర్వహించనున్నారు. 1035 హోమగుండాలతో ప్రత్యేక యాగం చేస్తారు. ఇందుకోసం 2 లక్షల కిలోల ఆవునెయ్యితోబాటు ఇతర హోమ ద్రవ్యాలు వినియోగించనున్నారు.

భగవద్రామానుజుల మహా విగ్రహావిష్కరణతోబాటు.. 108 దివ్య దేశాలు భక్తులను అనుగ్రహిస్తాయి. 200 ఎకరాల్లో 1000 కోట్లకుపైగా వ్యయంతో నిర్మించిన 216 అడుగుల భగవద్రామానుజుల పంచలోక మహా విగ్రహావిష్కరణ భారతజాతి చరిత్రలో ఓ సువర్ణాక్షర ఘట్టంగా నిలవనుంది. సమతాస్ఫూర్తిని చాటుతూ నిర్వహించనున్న రామనుజ సహస్రాబ్ది సంరంభం ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తోంది.

Read also: AP Politics: ఏపీలో కరకట్ట మహా సంగ్రామం.. అయ్యన్న, బాబుపై విరుచుకుపడుతోన్న మంత్రులు, ఎమ్మెల్యేలు

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu