AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

చెట్టు నుంచి ఉద్భవించిన శివ లింగం.. వంకాయలే నైవేద్యం..! ఎక్కడో తెలుసా..?

Bateshwar Nath Dham: బీహార్‌లోని వైశాలిలో ఉన్న బాబా బటేశ్వర్‌నాథ్ ధామ్ ఒక ప్రత్యేకమైన ఆలయం. ఇక్కడ ఒక మర్రి చెట్టు బోలు నుంచి నల్లని శివలింగం ఉద్భవించిందని నమ్ముతారు. ఈ ఆలయం దాని పురాతనత్వానికి, శివుడికి వంకాయలను నైవేద్యంగా సమర్పించే ప్రత్యేక సంప్రదాయానికి ప్రసిద్ధి చెందింది.

చెట్టు నుంచి ఉద్భవించిన శివ లింగం.. వంకాయలే నైవేద్యం..! ఎక్కడో తెలుసా..?
Bateshwar Nath Dham
Rajashekher G
|

Updated on: Jan 22, 2026 | 9:23 AM

Share

Bateshwar Nath Dham: దేశంలోని అనేక హిందూ దేవాలయాలలో వివిధ పద్ధతులు పాటిస్తుంటారు. అక్కడి సంప్రదాయాలు ఆచారాల ప్రకారం తమ ఇష్ట దైవాలకు నైవేద్యాలు సమర్పిస్తుంటారు. ఇప్పుడు బీహార్‌లోని వైశాలిలో ఉన్న బాబా బటేశ్వర్‌నాథ్ ధామ్ ప్రత్యేకత గురించి తెలుసుకుందాం. ఇక్కడ ఒక మర్రి చెట్టు బోలు నుంచి నల్లని శివలింగం ఉద్భవించిందని భక్తులు నమ్ముతారు. ఈ ఆలయం దాని పురాతనత్వానికి, శివుడికి వంకాయను ప్రసాదంగా సమర్పించే ప్రత్యేక సంప్రదాయానికి ప్రసిద్ధి చెందింది. దూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులు, ముఖ్యంగా రైతులు, తమ పంటలో మొదటి వంకాయను కోరికలు తీర్చుకోవడానికి సమర్పిస్తారు. దేశంలోనే మర్రి చెట్టు బోలు నుంచి నల్లని శివలింగం కనిపించిన ఏకైక ఆలయం ఇదే. ఈ ఆలయం బీహార్‌లోని వైశాలి జిల్లాలోని జంధహా బ్లాక్ ప్రాంతంలోని వసంతపూర్ ధధువాలో ఉంది, ఇది బాబా బటేశ్వర్‌నాథ్ ధామ్‌కు ప్రసిద్ధి చెందింది.

రైతుల మొదటి పంట శివుడికి నైవేద్యం

దూర ప్రాంతాల నుండి భక్తులు ఈ పురాతన ఆలయానికి ప్రత్యేక పూజ కోసం వస్తారు. బాబా బటేశ్వర్‌నాథ్ ధామ్ ఆలయంలోని గర్భగుడిలో ఉన్న శివలింగానికి భక్తులు వంకాయను ప్రసాదంగా సమర్పిస్తారు. తమ పొలాల్లో కూరగాయలు పండించిన తర్వాత, రైతులు మొదటి పంట వంకాయను శివుడికి సమర్పిస్తారు.

బాబా బటేశ్వర్‌నాథ్ ధామ్ నిర్వాహకులు అనిల్ కుమార్ సింగ్ మాట్లాడుతూ.. ఇది పురాతన ఆలయం. మర్రి చెట్టు నుంచి శివలింగం కనిపించిందని నిరూపించడానికి ఎటువంటి ఆధారాలు లేవు. ఆలయ సముదాయంలో నంది మహారాజ్ విగ్రహం కూడా ఉంది. శివలింగాన్ని పూజించడంతో పాటు, నందిని కూడా పూజిస్తారు. జనక రాజు జనకపూర్ నుంచి చంపా ఘాట్‌లో స్నానం చేయడానికి తన ఏనుగుతో వచ్చినప్పుడు.. అతను బటేశ్వర్‌నాథ్ ఆలయంలో ఆగి బాబా భోలేనాథ్‌ను పూజించేవాడని చెబుతారు. ఈ శివుడిని పూజించిన తర్వాతే ఆయన తిరిగి వెళ్లేవారని చెబుతారు.

రష్యా భక్తుడి కానుక

బీహార్‌లోని అనేక జిల్లాల నుంచే గాక, ఇతర రాష్ట్రాల నుంచి కూడా భక్తులు ఇక్కడకు వస్తారు. ఇది వ్యవసాయ ప్రాంతమని వివరించారు. రైతులు తమ పొలాల్లో కూరగాయలు పండిస్తారు. కూరగాయలు, ముఖ్యంగా వంకాయ సిద్ధమైనప్పుడు.. వాటిని శివలింగానికి నైవేద్యంగా సమర్పిస్తారు. బాబా బటేశ్వర్‌నాథ్ ఆలయంలో హృదయపూర్వకంగా ప్రార్థించే భక్తులకు వారి కోరికలు నెరవేరడం ఖాయం. వైశాలి, ఛప్రా, ముజఫర్‌పూర్, సమస్తిపూర్, పాట్నా వంటి బీహార్ నలుమూలల నుంచి భక్తులు ఈ ఆలయానికి పూజలు చేయడానికి వస్తారని బాబా బటేశ్వర్‌నాథ్ ధామ్ నిర్వాహకులు తెలిపారు. అంతేకాకుండా, నేపాల్, రష్యా లాంటి దేశాల నుంచి కూడా భక్తులు సందర్శిస్తారని వివరించారు. ఈ శివాలయంలో శివరాత్రి, బసంత్ పంచమి నాడు జాతరలు జరుగుతాయి. రష్యాకు చెందిన ఒక శివ భక్తుడు తన దేశ కరెన్సీని కానుకగా ఇచ్చాడని, అది మ్యూజియంలో భద్రపరచబడిందని ఆయన తెలిపారు.

అరుదైన ఆలయంగా..

ప్రపంచంలో మరెక్కడా ఇంత పరిమాణంలో, నల్ల రంగులో ఉన్న శివలింగం కనిపించదని.. మర్రి చెట్టు బోలు నుంచి ఆకస్మికంగా కనిపిస్తుందని ఆయన పేర్కొన్నారు. మహాశివరాత్రి, బసంత్ పంచమి సందర్భంగా ఇక్కడ ఒక గొప్ప ఉత్సవం జరుగుతుంది. మహాశివరాత్రి నాడు వందల క్వింటాళ్ల వంకాయను నైవేద్యంగా పెడతారు. బసంత్ పంచమి నాడు కూడా వంకాయను నైవేద్యం సమర్పిస్తారు.

మహాశివరాత్రి సందర్భంగా నెల రోజుల పాటు జరిగే జాతర జరుగుతుందని, బసంత్ పంచమి నాడు ఒక రోజు జాతర నిర్వహిస్తారని తెలిపారు. ఈ జాతరలలో తులసి ఆకులు, చెక్క వస్తువులు విరివిగా అమ్ముడవుతాయి. ఇక, శ్రావణ మాసంలో శివ భక్తులు పెద్ద సంఖ్యలో ఈ ప్రత్యేక ఆలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహిస్తుంటారు.