Hyderabad: హైదరాబాద్ ప్రజలకు సూపర్ న్యూస్.. నగరం నడిబొడ్డు నుంచి 6 లైన్ల భారీ రహదారి.. నిధులు కూడా మంజూరు
హైదరాబాద్‌లో ట్రాఫిక్ రద్దీని తగ్గించేందుకు ప్రభుత్వం అనేక కొత్త రహదారులను నిర్మిస్తోంది. రద్దీగా ఉన్న ప్రాంతాల్లో కొత్త రోడ్ల నిర్మాణం చేపడుతోంది. 4 లైన్లు, 6 లైన్ల రహదారులను ఎక్కువగా నిర్మిస్తోంది. ఈ క్రమంలో నగరంలో మరో రెండు కొత్త రహదారుల నిర్మాణానికి సిద్దమైంది.

నగర వాసులకు హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్‌మెంట్ అథారిటీ(హెచ్‌ఎండీఏ) శుభవార్త అందించింది. నగరంలో రోడ్లను భారీగా విస్తరించేందుకు సిద్దమవుతోంది. ప్రస్తుతం ఉన్న 3 లైన్ల రోడ్లను 4 లైన్లుగా విస్తరించనుండగా.. మరో కొత్త 6 లైన్ల రహదారి నిర్మాణానికి రెడీ అయింది. నగరం మధ్యలో నిర్మించనున్న ఈ రహదారుల వల్ల ట్రాఫిక్ రద్దీ భారీగా తగ్గడంతో పాటు ప్రయాణ సమయం తగ్గనుంది. నగరంలో ఎక్కడికైనా వెళ్లాలంటే ట్రాఫిక్ రద్దీ వల్ల ఎక్కువ సమయం పడుతుంది. దీంతో ప్రయాణికులు నగరంలో ఎక్కడికైనా సులువుగా చేరుకునేందుకు వీలుగా కొత్త ఫ్లైఓవర్లు, అండర్‌పాస్‌లు నిర్మిస్తోంది. త్వరలో నగరం నడిబొడ్డులో భారీ 6 లైన్ల రోడ్డు నిర్మాణానికి ప్రణాళికలు సిద్దం చేసింది.
మణికొండలో 6 లైన్ల రహదారి
మణికొండలో 6 లైన్ల భారీ రహదారిని కొత్తగా నిర్మించేందుకు హెచ్‌ఎండీఏ ప్రణాళికలు సిద్దం చేసింది. మణికొండ, కోకాపేట, పుష్పాలగూడ ప్రాంతాలు వేగంగా అభివృద్ది చెందుతున్న క్రమంలో అక్కడ జనజీవనం ఎక్కువైపోతుంది. దీని వల్ల ట్రాఫిక్ కష్టాలతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. దీనిని దృష్టిలో పెట్టుకుని ఎంజీఐటీ నుంచి మణికొండ వరకు 6 లైన్ల రహదారిని నిర్మించనుంది. ఈ రహదారి పొడవు 3.57 కిలోమీటర్లు ఉంటుంది. దీని నిర్మాణం కోసం రూ.110 కోట్లు ఖర్చు చేయనున్నారు. రహదారి పక్కన ల్యాండ్ స్కేపింగ్, నీటి కాలువలు, ఫుట్‌పాత్‌లు నిర్మించనున్నారు. ఇది పూర్తైతే గండిపేట నుంచి మణికొండ చుట్టుపక్కల ప్రాంతాలకు చేరువుగా చేరుకోచ్చని అధికారులు చెబుతున్నారు.
4 లైన్లుగా విస్తరణ
ఇక ఫైనాన్షియల్ డిస్ట్రిక్‌లో రోడ్లు విస్తరణ చేపట్టాలని హెచ్‌ఎండీఏ నిర్ణయించింది. నానక్ రాంగూడ నుంచి గచ్చిబౌలి వరకు ఉన్న రోడ్డును విస్తరించేందుకు ప్లాన్ సిద్దం చేసింది. ప్రస్తుతం మూడు వరుసల రహదారి ఈ మార్గంలో ఉండగా.. దీనిని నాలుగు లైన్లుగా విస్తరించనుంది. ఇందుకోసం ప్రభుత్వం రూ.26.50 కోట్ల నిధులను ఇప్పటికే మంజూరు చేసింది. అలాగే ఇతర అనుమతులకు కూడా గ్రీన్ సిగ్నల్ రాగా.. త్వరలో పనులు ప్రారంభం కానున్నాయి. ఈ రోడ్డు పూర్తైతే గచ్చిబౌలి పరిసర ప్రాంతాల నుంచి ఔటర్ రింగ్ రోడ్డుకు ఈజీగా చేరుకోవచ్చు. హైదరాబాద్ నడిబొడ్డులో నిర్మించనున్న ఈ కొత్త రోడ్ల నిర్మాణం పూర్తైతే నగరంలో ప్రయాణ సమయం భారీగా తగ్గనుంది. సులువుగా ఇతర ప్రాంతాలకు చేరుకోవచ్చు. అలాగే సిటీ నుంచి బయటకు వెళ్లేవారు, లోపలికి వచ్చేవారు త్వరగా చేరుకోవచ్చు. ఉపాధి కోసం తరచూ లక్షల మంది సిటీలోకి వస్తారు. వీళ్లు నగరంలోకి రావాలంటే ట్రాఫిక్ వల్ల గంటల కొద్ది సమయం పడుతుంది. దీంతో ప్రభుత్వం కొత్త రోడ్ల నిర్మాణానికి మోగ్గు చూపుతుంది.
