Atla Tadde: తెలుగువారింట ఘనంగా అట్లతద్ది పండగ.. సంప్రదాయంగా నిర్వహించిన మహిళలు
అట్లతద్ది పండుగ ముందు రోజు నుంచే స్త్రీలు హడావిడి మొదలుపెడతారు. అట్లు పోసేందుకు ముందు రోజే పిండి కొట్టుకోవడం, మినప్పప్పు రుబ్బి అట్లు తయారుచేయటం ఒక పెద్ద క్రతువులా నిర్వహిస్తారు. అట్లతద్దినాడు వేడి వేడిగా అట్లు తినడానికి, తినిపించడానికి మహిళలు పోటీ పడతారు. ఇక ఇంట్లో మగవాళ్ళంతా ఉయ్యాల కట్టడం, అందుకు కావాల్సిన ఏర్పాట్లను పర్యవేక్షిస్తారు.

అట్లతద్ది ఆరొట్లయ్… ముద్దపప్పు మూడట్లయ్ అంటూ పిల్లలు, పెద్దలు సందడి చేశారు. బాపట్ల జిల్లా అద్దంకి పట్టణంలోని హరిహర గోకులం వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో అట్లతద్ది వేడుకలు ఘనంగా నిర్వహించారు. బహిరంగంగా ఉయ్యాల వెయ్యడంతో మహిళలు, యువతులు పాల్గొన్నారు, పట్టణంలోని పలువురు మహిళలు అట్లతద్ది సందర్భంగా తద్ది తీర్చుకునేందుకు గోశాలకు తరలి వస్తున్నారు, పురాతన సాంప్రదాయాలను కాపాడుతూ, గోవులను సంరక్షిస్తున్న గోశాల నిర్వాహకులు గోనుగుంట సుబ్బారావును పలు స్వచ్ఛంద సంస్థలు అభినందించారు. ఈ కార్యక్రమంలో గార్లపాటి శ్రీనివాసరావు సంధి రెడ్డి శ్రీనివాసరావు చిన్ని శ్రీనివాసరావు పోకూరి శ్రీనివాసరావు అమర శ్రీను హనుమ పాల్గొన్నారు. భారీ సంఖ్యలో మహిళలు హాజరయ్యారు.
ప్రతి సంవత్సరం ఆశ్వయుజ బహుళ తదియనాడు మహిళలు, యువతులు అట్లతద్ది జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోంది. అట్లతద్దికి ముందురోజు మహిళలు, యువతులు చేతులకు, పాదాలకు, గోరింటాకు పెట్టుకుంటారు. ఎవరి చేయి ఎర్రగా పండితే వారికి అదృష్టం బాగుంటుందని, మంచి భర్త వస్తాడని విశ్వసిస్తారు. అట్లతద్ది పండుగ ముందు రోజు నుంచే స్త్రీలు హడావిడి మొదలుపెడతారు. అట్లు పోసేందుకు ముందు రోజే పిండి కొట్టుకోవడం, మినప్పప్పు రుబ్బి అట్లు తయారుచేయటం ఒక పెద్ద క్రతువులా నిర్వహిస్తారు. అట్లతద్దినాడు వేడి వేడిగా అట్లు తినడానికి, తినిపించడానికి మహిళలు పోటీ పడతారు. ఇక ఇంట్లో మగవాళ్ళంతా ఉయ్యాల కట్టడం, అందుకు కావాల్సిన ఏర్పాట్లను పర్యవేక్షిస్తారు.
అట్లతద్ది ఎందుకు చేయాలి..
పురాణాల ప్రకారం గౌరీదేవి తన భర్తగా శివుడ్ని పొందేందుకు సిద్దమవుతుంది. నారదమహాముని సూచనలతో వ్రతం చేయాలని సంకల్పిస్తుంది. గౌరీదేవి మొదటిసారిగా చేసిన విశిష్టమైన వ్రతమే ఈ అట్లతద్ది అని చెబుతారు. వివాహిత మహిళలు సౌభాగ్యం కోసం చేసుకునే వ్రతంగా అభివర్ణిస్తారు. ఈ వ్రతం ద్వారా కుటుంబంలో సుఖశాంతులు వర్ధిల్లుతాయని భావిస్తారు. ఈ పండుగ రోజు అట్లని అమ్మవారితో పాటు కుజగ్రహానికి అధిపతి అయిన కుజుడికి కూడా నైవేద్యంగా పెడతారు. నవగ్రహాల్లోని కుజుడికి అట్లంటే మహా ప్రియంగా చెబుతారు. ఈ పండుగ నాడు అట్లను కుజుడికి నైవేద్యంగా పెడితే కుజదోషం నశించి సంసారంలో ఎలాంటి ఇబ్బందులు ఉండవని నమ్ముతారు.
ఉయ్యాల పండుగ…
అట్లతద్ది రోజున గౌరీదేవికి అట్లను నైవేద్యం పెట్టిన తరువాత అట్లుతిని ఉత్సాహంగా ఉయాల ఊగుతారు మహిళలు.. దీన్నే ఉయ్యాల పండుగ అని కూడా అంటారు. దీని వల్ల గౌరీదేవి అనుగ్రహంతో పెళ్ళికాని అమ్మాయిలకు మంచి భర్త లభిస్తాడని అంటారు. సంతానం లేని వారికి పిల్లలు పుడతారని నమ్ముతారు. అందువల్ల ఈ అట్ల తద్ది నాడు పెళ్ళయిన వివాహిత మహిళలతో పాటు పెళ్ళికాని పడుచులు ఉయ్యాల ఊగడానికి, అట్లు నైవేద్యం పెట్టడానికి ఉత్సాహం చూపిస్తారు.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..