Atla Tadde 2024: అచ్చ తెలుగు అమ్మాయిల పండగ అట్లతద్ది.. పూజ విధానం, శుభ సమయం ఎప్పుడంటే..

మహిళలు జరుపుకునే పండగలలో ఒకటి అట్ల తద్ది. ఈ అట్లతద్ది పండుగను పెళ్ళికాని ఆడపిల్ల నుంచి పెళ్లి అయిన స్త్రీల వరకూ ప్రతి ఒక్కరూ ప్రతి సంవత్సరం జరుపుకుంటారు. ఈ అట్లతద్ది పండగ ఆశ్వయుజ మాసంలో దసరా పండుగ తరవాత వచ్చే తదియ తిధి రోజున జరుపుకోవడం సంప్రదాయం. అయిదేళ్ళు దాటిన ఆడపిల్లల నుంచి పెద్దల వరకు జరుపుకునే అట్లతద్ది.పెళ్ళికాని పిల్లలు మంచి భర్తకావాలని, పెళ్ళైనవారు మంచి భర్త దొరికినందుకు, ఆ భర్త దీర్ఘాయుస్సు కోసం చేస్తారు.

Atla Tadde 2024: అచ్చ తెలుగు అమ్మాయిల పండగ అట్లతద్ది.. పూజ విధానం, శుభ సమయం ఎప్పుడంటే..
Atla Tadde 2024
Follow us
Surya Kala

|

Updated on: Oct 13, 2024 | 10:43 AM

మహిళలు జరుపుకునే పండగలలో ఒకటి అట్ల తద్ది. ఈ అట్లతద్ది పండుగను పెళ్ళికాని ఆడపిల్ల నుంచి పెళ్లి అయిన స్త్రీల వరకూ ప్రతి ఒక్కరూ ప్రతి సంవత్సరం జరుపుకుంటారు. ఈ అట్లతద్ది పండగ ఆశ్వయుజ మాసంలో దసరా పండుగ తరవాత వచ్చే తదియ తిధి రోజున జరుపుకోవడం సంప్రదాయం. అయిదేళ్ళు దాటిన ఆడపిల్లల నుంచి పెద్దల వరకు జరుపుకునే అట్లతద్ది.పెళ్ళికాని పిల్లలు మంచి భర్తకావాలని, పెళ్ళైనవారు మంచి భర్త దొరికినందుకు, ఆ భర్త దీర్ఘాయుస్సు కోసం చేస్తారు. ఈ ఏడాది తదియ తిది అక్టోబర్ 19 న ఉదయం 10 గంటలకు ప్రారంభం అవుతుంది. మర్నాడు అంటే అక్టోబర్ 20 వ తేదీ సాయంత్రం 6గంటల వరకూ ఉండనుంది. ఈ నేపధ్యంలో రాత్రి సమయంలో గౌరీపూజ చేయాల్సి ఉన్నందున ఈ ఏడాది అట్లతద్దెను అక్టోబర్ 19 న శనివారం జరుపుకోనున్నారు.

అట్ల తద్ది రోజున పూజచేసి పేరంటాలను పిలిచి వాయనాలు ఇస్తారు. నైవేద్యం సమర్పించి, గోపూజ చేసి చెరువులలో కాలువలలో దీపాలను వదలి, చెట్లకు ఊయలలు కట్టి ఊగుతూ సందడి చేస్తారు. ఇది పది సంవత్సరాలు చేసే నోము. ఎవరైనా సరే అట్లతద్దిని పది సంవత్సరాలు చేసుకుంటారు. మంచి భర్త కోసం. పూర్వం చిన్న వయసులోనే పెళ్లి చేసేవారు కనుక వివాహం అనంతరం కూడా ఈ వ్రతం చేసేవారు మధ్యలో ఆపకుండా ఇప్పటికి చేస్తారు కూడా..ఈ వ్రతం చేసే వారు ముందు రోజు చేతికి, కాళ్ళకి గోరింటాకు పెట్టుకుంటారు.

అట్లతద్ది పూజా విధానం

ఆడవాళ్లు తెల్లవారుజామున నిద్ర లేచి, స్నానాలు ముగించి పదకొండు మంది ముత్తదువులతో కలిసి పొట్లకాయ కూర, ముద్దపప్పు, గోంగూర పచ్చడి, పెరుగులతో అన్నం తింటారు. తర్వాత సాయంత్రం వరకూ మంచి నీరు కూడా తాగకుండా ఉపవాసం ఉంటారు. తర్వాత ట్లతద్దోయ్.. ఆరట్లోయ్.. ముద్దపప్పోయ్.. మూడట్లోయ్ అంటూ ఆటపాటలతో సందడి చేస్తారు. చెట్టుకు ఊయల కట్టి ఊయల ఊగుతారు.

ఇవి కూడా చదవండి

గౌరీ పూజా విధానం నైవేద్యం

సాయంత్రం మళ్ళీ స్నానమాచరించి ముత్తైదువులతో గౌరీదేవికి పూజ చేసి చేమంతి, తులసిదళం, తమలపాకు మొదలైన పువ్వులు, పాత్రలతో తోరాలు పెట్టి .. పూజ చేసి తర్వాత వాటిని చేతికి కట్టుకొని గౌరీ పూజ చేస్తారు. కుడుములు, పాలతాలికలు, పులిహోర నైవేద్యంగా సమర్పిస్తారు. మళ్ళీ సాయంత్రం గౌరీ పూజ చేసి చంద్రోదయం అనంతరం ఫలహారం తీసుకుంటారు.

వాయినం ఇచ్చే విధానం

ఒక్కొక్క ముత్తైదువుకి 11 అట్లు చొప్పున గౌరీదేవివద్ద పెట్టిన కుడుములను కలిపి తాంబూలం పెట్టి వాయనం ఇస్తారు. ఇలా అందుకున్న వాయనం ఆ మహిళ లేదా ఆ ఇంటి సభ్యులు మాత్రమే తినాలి. వాయనం ఇచ్చి పుచ్చుకునేటప్పుడు స్త్రీలు తమ కొంగును ముందుకు చాచి.. అందులో వాయనం ఉంచి ఇస్తినమ్మ వాయనం.. పుచ్చుకుంటినమ్మ వాయనం.. అందించానమ్మా వాయనం … అందుకున్నానమ్మా వాయనం అంటూ ఇస్తారు.. అందుకునే స్త్రీలు కూడా అలాగే అందుకుంటారు.

అట్లతద్ది రోజున అట్లవాయినం ఎందుకంటే

అట్లను వాయినంగా ఎందుకు ఇతరంటే నవగ్రహాలలో కుజుడికి మినుము అంటే మహాప్రీతి. కనుక ఆయనకు ఇష్టమైన మినుమతో చేసిన అట్లు నైవేద్యంగా పెడితే కుజదోషం పోయి సంసారం సుఖ సంతోషాలతో సాగుతుందని నమ్మకం.

అట్లతద్ది రోజున చదవాల్సిన కథ

పూర్వం సునామ అనే ఒక రాజకుమారి ఉండేది. ఆమె చాలా సుకుమారంగా ఉండేది వాళ్ళ అన్నలకు ఆమె చాల గారాభం. అందరిలానే ఆమెకు కూడా మంచి భర్త లభించాలని కోరిక ఉండేది. తనతో ఉండే ఆమె స్నేహితులు మంచి భర్త కోసం అట్లతద్దె నోము చేస్తున్నారని తెలిసి తాను కూడా చేయాలి అనుకుంటుంది. సునామ రాజకుమారి మొదలు పెట్టిన సంవత్సరమే మధ్యాహ్ననికే బాగా నీరసం రావడంతో సొమ్మసిల్లి పడిపోయిందట. చంద్రుడుని చూడకుండా ఏమి తినకూడదు.. చెల్లెలని అలా చూసిన అన్నయ్యలు బాధపడుతూ బాగా ఆలోచించి ఒక చెట్టుకి అద్దం కట్టి దాని వెనుక కొంచెం దూరంలో మంటను పెడతారు. అప్పుడు ఆ మంట ప్రతిబింబం అద్దంలో చంద్రుని ఆకారంలో కనిపించగా రాజకుమారి చంద్రోదయం అయిపోయింది అనుకొని గౌరీ వ్రతం చేసుకొని, ముత్తైదులకి వాయనం ఇచ్చేసి ఫలహారం తీసుకుంటుంది. తర్వాత ఆమెకు పెళ్లి వయసు వచ్చే సరికి అందరూ ముసలి వాళ్ళ సంబంధాలే వచ్చేవి, కొంత కాలం చూసారు ఇంకా ముసలి వాళ్ళు తప్ప తన ఈడుజోడు సరిపడే సంబంధం ఒక్కటి రాకపోవడంతో ఇంక చేసేది ఏమి లేక ముసలి వాడితో వివాహం చేసేద్దాము అని ఇంట్లో వాళ్ళు అనుకుంటగా ఆమెకి ఏమి చేయాలో తోచక ముసలి వాడిని పెళ్లిచేసుకోవడం కంటే చావడం మేలు అనుకోని అడవిలోకి పారిపోతుంది.

అలా వెళుతుండగా పార్వతి పరమేశ్వరులు సునామ ఎదుట ప్రత్యక్షమవుతారు. వ్రతమే సరిగా చేయనపుడు దేవుళ్ళు ఎలా దర్శనమిస్తారు అనే అనుమానం రావచ్చు కానీ పార్వతి పరమేశ్వరులు ప్రత్యక్షమవడానికి కారణం అమే సంకల్పం.. రాజకుమారి ఎలా అయినా అట్లతద్ది నోము చేయాలి అని సంకల్పంతో మొదలుపెట్టింది. అయితే ఆమె అన్నగార్లు చేసిన పని వలన ఆ నోము భంగం జరిగింది. అడవిలో వెళుతున్న తనని పార్వతి పరమేశ్వరులు ఎక్కడికి వెళుతున్నావు అని అడగగా జరిగిన విషయం చెబుతుంది. దీంతో పార్వతి దేవి నువ్వు ఆచరించిన అట్లతద్ది నోములో నీ అన్నగార్లు చేసిన తప్పిదంతో ఉల్లంఘన జరగడం వలన ఈ పరిస్థితి వచ్చింది కనుక మరోసారి నిష్ఠగా అట్లతద్ది నోముని చేయమని.. ఎలా చేయాలో ఆ రాజకుమారికి చెబుతుంది. పార్వతి దేవి చెప్పినట్టుగానే అట్లతద్ది వ్రతం చేస్తుంది. తర్వాత ఆమెకు తగిన వరుడుతో పెళ్లి జరుగుతుంది. అప్పటి నుంచి అట్లతద్దె నోముని ఎటువంటి వ్రత భంగం లేకుండా జరుపుకోవడం ఆనవాయితీగా మారింది అని పురాణాల కథనం.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Note: ఈ కథనంలో అందించిన సమాచారం పూర్తిగా నిజం, ఖచ్చితమైనది అని మేము ధృవీకరించడం లేదు. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోండి