Dwaraka Tirumala: నేటి నుంచి చిన వెంకన్న బ్రహ్మోత్సవాలు మొదలు.. స్వామి, అమ్మవారు పెళ్లికొడుకు, పెళ్లికూతురుగా దర్శనం
తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు ముగిశాయి. కోనసీమ వాసులు చిన్న తిరుమలగా పిలిచే.. ద్వారకా తిరుమలలో బ్రహ్మోత్సవాలు నేటి నుంచి ప్రారంభం అవుతున్నాయి. చిన వెంకన్న బ్రహ్మోత్సవాల సందర్భంగా భారీ ఏర్పాట్లు చేశారు ఆలయ అధికారులు. ఎనిమిది రోజుల పాటు జరిగే ఈ బ్రహ్మోత్సవాలకు భారీ సంఖ్యలో భక్తులు తరలి రానున్నారు.
పశ్చిమ గోదావరి జిల్లాలోని ప్రముఖ పుణ్య క్షేత్రం ద్వారకా తిరుమల. చిన తిరుపతి బ్రహ్మోత్సవాలకు వేళయింది. ఈ రోజు నుంచి ఈ నెల 20వరకు స్వామివారి బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. ఈ మేరకు అంతా సిద్ధం చేశారు. ద్వారకా తిరుమలలో ఏడాదిలో రెండు సార్లు బ్రహ్మోత్సవాలను నిర్వహిస్తారు. ఒకసారి వైశాఖమాసంలో, మరోసారి అశ్వయుజ మాసంలో స్వామివారికి వైభవంగా బ్రహ్మోత్సవాలు జరుపుతారు. ఈ బ్రహ్మోత్సవాలను ఎనిమిది రోజులపాటు ఘనంగా నిర్వహిస్తారు.
- బ్రహ్మోత్సవాలలో మొదటి రోజు స్వామి, అమ్మవార్లను పెళ్లికొడుకు, పెళ్లికూతుర్లుగా అలంకరిస్తారు. వీటితో ఉత్సవాలు ప్రారంభమవుతాయి.
- 17న స్వామివారి తిరు కళ్యాణ మహోత్సవం జరుగుతుంది.
- 18న ద్వారకా తిరుమలలోని మాఢ వీధుల్లో స్వామివారి రథోత్సవం నిర్వహిస్తారు.
- అశ్వయుజ మాస బ్రహ్మోత్సవాలు జరిగే 8 రోజులపాటు వివిధ వాహనాలపై స్వామి, అమ్మవార్లు దర్శనం ఇస్తారు.
- ఈ ఎనిమిది రోజులపాటు ద్వారకా తిరుమలకు భక్తులు భారీగా తరలిరానున్నారు. ఆ వెంకటేశ్వరుడ్ని దర్శించుకుని తరించనున్నారు.
చిన వెంకన్న బ్రహ్మోత్సవాల సందర్భంగా.. నిత్యార్జిత కళ్యాణాలు, సేవలు రద్దు చేశారు. ఉత్సవాల కోసం ఆలయాన్ని సర్వాంగ సుందరంగా ముస్తాబు చేశారు. ప్రధాన ఆలయంతో పాటు.. నాలుగు రాజగోపురాలను రంగురంగుల విద్యుత్ దీపాలతో అలంకరించారు. అనివేటి మండపం, ఆలయ ప్రాంగణాలన్నీ విద్యుత్ కాంతుల్లో మెరిసిపోతున్నాయి.
బ్రహ్మోత్సవాల సందర్భంగా ప్రతిరోజు సాయంత్రం శ్రీహరి కళాతోరణంలో భక్తుల కోసం వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయని ఆలయాదికారులు చెప్పారు. భక్తులకు ఇబ్బంది లేకుండా అన్ని ఏర్పాట్లు చేశామని చెబుతున్నారు. భద్రత పరంగానూ అన్నిరకాల చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు పోలీసులు. బ్రహోత్సవాలు విజయవంతం చేసేందుకు ప్రతి ఒక్కరు సహకరించాలని కోరుతున్నారు ఆలయ అధికారులు.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..