800 Year Old Temple : 800ఏళ్ల చరిత్ర కలిగిన శైవ క్షేత్రం.. నలభై ఒక్క ప్రదక్షిణలతో కోరికలు తీర్చే రుద్రేశ్వరాలయం
కాకతీయులు కళలకు పట్టంకట్టారు. సంగీతం, సాహిత్యం, నృత్యం... అన్నింటినీ సమానంగా ఆదరించారు. ముఖ్యంగా కాకతీయ రాజుల ప్రోత్సాహంతో వికసించిన కాకతీయ శిల్పం .. ఓ శిల్పరీతిగా విశిష్టత సంతరించుకుంది, అందుకే కాకతీయ యుగంలో సాహిత్యం వర్ధిల్లింది...
800 Year Old Temple : కాకతీయులు కళలకు పట్టంకట్టారు. సంగీతం, సాహిత్యం, నృత్యం… అన్నింటినీ సమానంగా ఆదరించారు. ముఖ్యంగా కాకతీయ రాజుల ప్రోత్సాహంతో వికసించిన కాకతీయ శిల్పం .. ఓ శిల్పరీతిగా విశిష్టత సంతరించుకుంది, అందుకే కాకతీయ యుగంలో సాహిత్యం వర్ధిల్లింది. ఇక కాకతీయ రాజులు శైవ, వైష్ణవ మతాలను సమాన రీతిలో ఆదరించారు. ఆలయాలను నిర్మించారు. ఇక కాకతీయ శిల్పకళా సంపద కు ప్రతిభకు… నిర్మాణ శైలికి తార్కాణం… ఉమ్మడి మెదక్ జిల్లా కొండపాక లోని రుదేశ్వరస్వామి ఆలయం.. తూర్పునకు అభిముఖంగా ఉన్న సుమారు 820 ఏళ్లనాటి చరిత్ర గల ఈ ఆలయంలోకి వెళ్ళగానే… మధ్యలోని మంటపంలో శివలింగ స్వరూపంలో రుద్రేశ్వరుడు దర్శనమిస్తాడు.
వరంగల్‌లోని వేయిస్తంభాల గుడిలోని ప్రాణవట్టం నమూనాలోనే ఇక్కడి ప్రాణవట్టం కూడా చతురస్రాకారంలో ఉంటుంది. ఉమ్మడి మెదక్ జిల్లాలోనే అత్యంత పురాతనమైన, అత్యంత పెద్దదైన శివలింగంగా రుద్రేశ్వరుడు ప్రసిద్ది గాంచాడు. ఆలయం చుట్టూ ఉన్న ప్రాకారంలో కన్యకాపరమేశ్వరి, ఆంజనేయస్వామి, నవగ్రహాలు, మార్కండేయుడు, వీరభద్రుడు, త్రిమాతలు, సుబ్రహ్మణ్యస్వామి ఆలయాలున్నాయి.
ఆలయ చరిత్ర:
రుద్రదేవుడు పాలన చేస్తున్న సమయంలో…కాకతీయుల కొలువులో పనిచేసిన ముప్ఫైమంది సైనికులు ఈ ఆలయాన్ని కట్టించారు. రుద్రేశ్వరాలయ నిర్మాణం క్రీ.శ 1194లో జరిగింది. ప్రాంగణంలోనే త్రికూటేశ్వర (సూర్య-శివ-అంబిక) ఆలయమూ ఉండేదట. గణపతిదేవుడు పాలిస్తున్న కాలంలో… డెబ్భై గ్రామాలపై అధికారమున్న ఆదిత్య అమాత్యుడు త్రికూటేశ్వర ఆలయాన్ని నిర్మించినట్టు తెలుస్తోంది. ఈ ఆలయ చరిత్రనంతా ఇక్కడున్న శాసనాల్లో నిక్షిప్తం చేశారు.
కోరికలు తీర్చే రుద్రుడు:
ఈ ఆలయంచుట్టూ నలభై ఒక్క ప్రదక్షిణలు చేసి, శివుడి ఎదురుగా ఉండే నందికేశ్వరుడి చెవిలో ఏ కోరిక కోరుకున్నా… జరిగి తీరుతుందని ప్రతీతి. కాబట్టే స్థానికులు, రుద్రేశ్వరుడిని కోరికలు తీర్చే దేవుడిగా కొలుస్తారు. వందేళ్లక్రితం ఓసారి, ఈ ప్రాంతంలో తీవ్ర వర్షాభావ పరిస్థితులు ఏర్పడ్డాయి. ఆ సమయంలో రుద్రేశ్వరుడికి గ్రామస్థులు సహస్ర ఘటాభిషేకం (వెయ్యి బిందెలతో గర్భాలయంలో నీళ్లు నింపడం) చేశారట. వెంటనే కుండపోత వర్షం కురిసి … కరవు కనిపించకుండా పోయిందట!
ఈ ప్రాచీన ఆలయం పునర్నిర్మాణ సంకల్పం:
పంచాక్షరీ మంత్రం మారుమోగినచోట శతాబ్దాలపాటూ శ్మశాన నిశ్శబ్దం రాజ్యమేలింది. నరపతులూ గజపతులూ కొలిచిన శివలింగం శిథిలాల మధ్య చిక్కుకుపోయింది. ఆ పరిస్థితుల్లో… కొండపాక ప్రజలు కొండంత చారిత్రక స్పృహతో వ్యవహరించారు. రుద్రేశ్వరాలయాన్ని పునర్నిర్మించుకున్నారు. ఈ ప్రాచీన ఆలయాన్ని పునర్నిర్మించాలని మొదట సంకల్పించింది కొండపాక గ్రామానికి చెందిన మరుమాముల సీతారామశర్మ. సంకల్పించడమే కాదు, కొంత మొత్తాన్ని విరాళంగా కూడా ఇచ్చారు. దురదృష్టవశాత్తూ పనులు ప్రారంభించకుండానే ఆయన కన్నుమూశారు. తర్వాత ఓసారి… శ్రీగురుమదనానంద సరస్వతీ పీఠాధిపతులు మాధవానంద స్వామి ఈ ప్రాంతానికి వచ్చినపుడు ఆలయ చరిత్ర గురించి విన్నారు. గ్రామస్థుల్ని సమావేశపరచి, పునః ప్రతిష్ఠాపనకు ప్రేరణ కలిగించారు. పల్లెజనమంతా కలిసి కోటి రూపాయలకుపైగా ఖర్చుచేసి, చారిత్రక ఆలయానికి జీవంపోశారు.
రుద్రేశ్వరాలయ పునర్నిర్మాణం:
2006 ఆగస్టులో ప్రారంభమైంది. ఆలయ నిర్మాణ శైలికి ఏ భంగమూ వాటిల్లకుండా చాలా జాగ్రత్తలు తీసుకున్నారు. తమిళనాడు నుంచి నిపుణులైన శిల్పులను పిలిపించారు. ఆ కార్యక్రమానికి ఓ రూపం రావడానికి ఆరేళ్లు పట్టింది. 2012 ఫిబ్రవరి 12న ప్రతిష్ఠాపన మహోత్సవం ఘనంగా జరిగింది. కాకతీయుల శివలింగాన్నే పునఃప్రతిష్ఠించారు. లింగాన్ని కళావరోహణం చేశాక… మళ్లీ ప్రతిష్ఠించే వరకూ జలాధివాసంలోనే ఉంచారు. ఆ ఆరేళ్లూ అఖండదీపం వెలిగించారు. అప్పటి రాతి ధ్వజస్తంభం చెక్కుచెదరకుండా ఉండటంతో దాన్నే నిలబెట్టారు.
రుద్రేశ్వరాలయం విశేష పూజలు:
రుద్రేశ్వరాలయంలో ప్రతి మాసశివరాత్రికీ మాస బ్రహ్మోత్సవాలూ మహన్యాసపూర్వక శతరుద్రాభిషేకం జరుగుతాయి. శివరాత్రికి ఘనంగా జాతర నిర్వహిస్తారు. ఆ రోజు గ్రామస్థులంతా ఎడ్ల బండ్లనూ వాహనాలనూ చక్కగా అలంకరించుకొని గుడిచుట్టూ ప్రదక్షిణలు చేసే కార్యక్రమం కన్నుల పండువగా ఉంటుంది.
వెళ్ళే మార్గం: హైదరాబాద్ నుంచి సిద్దిపేటకు వెళ్లే రాజీవ్ రహదారిపైనే కొండపాక ఉంది. సమీపంలోని కొమురవెల్లి, సిద్దిపేట కోటిలింగాల గుడి… దర్శనీయ స్థలాలు.
Also Read: పొలం బాట పట్టిన స్టార్ హీరోయిన్ .. హలం పట్టి పొలం దున్నిన కన్నడ సోయగం