- Telugu News Photo Gallery Spiritual photos Interesting facts to know about tirumala tirupati lord venkateswara
Tirumala Brahmotsavam : బ్రహ్మత్సవాల్లో ఉపయోగించే పల్లకిని ఏ రాజు గిఫ్ట్ గా ఇచ్చారో తెలుసా.. అది దేనితో తయారైందంటే..!
కలియుగదైవం .. కోరిన కోర్కెలు తీర్చే భక్తుల పాలిట కొంగుబంగారంగా కొలవబడుతున్న కోనేటిరాయుడు కొలువైన క్షేత్రం తిరుమల. ఏ పని మొదలు పెట్టాలన్నా శ్రీవారిని దర్శించుకుని కానుకలు సమర్పిస్తున్నారు. ఈ ఆచారం ఇప్పటిది కాదు.. కొన్నివేల సంవత్సరాల నుంచి వస్తుంది.
Updated on: Mar 18, 2021 | 5:00 PM

తిరుమల వెంకన్న పూజించినవారిలో పురాణ పురుషులున్నారు.. రాజులున్నారు. ఈ స్వామివారిని సేవించి ఆయన ఆశీసులను పొందడానికి దేశ విదేశాల నుంచి ప్రముఖులు కూడా క్యూ కడతారు. అప్పట్లో రాజాధిరాజులు శ్రీవారిని సేవించుకుంటే.. ఇప్పుడు కార్పొరేట్ దిగ్గజాల నుంచి రాజకీయ నేతలు వరకూ సేవించుకుంటున్నారు. శ్రీకృష్ణ దేవరాయలు, మైసూర్ మహారాజులు స్వామివారికి భూరి కానుకలు సమర్పించి ఏడుకొండలవాడి కృపకు పాత్రలయ్యారు. వీరిలో మైసూరు మహారాజులు స్వామివారికి వారు సమర్పించిన కానుకలను ఇప్పటికీ వినియోగిస్తున్నారు. ఈరోజు మైసూర్ మహారాజులు సమర్పించిన కానుకల గురించి తెలుసుకుందాం..

ఏడుకొండల మీద కొలువైన వెంకన్నకు మైసూరు మహారాజు పరమ భక్తులు. ఆలయ అభివృద్ధి కోసం ఈ రాజులు ఎన్నో కానుకలను సమర్పించారు. ముఖ్యంగా శ్రీవారి మూలవిరాట్టుతో పాటు ఉత్సవమూర్తులకు బంగారు, వెండి, వజ్రాలు, కెంపులు, పచ్చలతో తయారు చేయించిన అనేక అమూల్యమైన ఆభరణాలను బహూకరించారు.

శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో ఉపయోగిస్తున్న గరుడ, గజ, ముత్యపు పందిరితో పాటు సర్వభూపాల, అశ్వ, సూర్యప్రభ, చంద్రప్రభ వాహనాలను మైసూరు మహారాజులే ఇచ్చారు. బ్రహ్మోత్సవాల్లోని ఐదవ రోజు ఉదయం శీవారు పల్లకీలో ఊరేగుతారు.. ఈ పల్లకిని మైసూరు మహారాజు ప్రత్యేకంగా ఏనుగు దంతాలతో తయారు చేయించారు.

300 ఏళ్ల క్రితం వెంకన్న నిత్య దీపారాధనకు అవసరమైన ఆవు నెయ్యి మైసూర్ సంస్థానం నుంచే వచ్చేది.. ఆ సంప్రదాయం ఇప్పటికీ కర్ణాటక ప్రభుత్వం కొనసాగిస్తుంది. నిత్య ధీపారాధనకు అవసరమైన ఆవునెయ్యిని శ్రీవారికి పంపిస్తుంది. ప్రతి రోజూ తెల్లవారుజామున శ్రీవారి సుప్రభాతం సేవకు ముందు నవనీత హారతి, శ్రీవారి ఆలయంలో అఖండ దీపాలైన బ్రహ్మదీపానికి ప్రతి రోజు 5 కిలోల ఆవునెయ్యి ఇప్పటికీ అందుతోంది.

తిరుమల శ్రీవారి ఆలయాభివృద్ధికి మైసూరు మహారాజు చేసిన సేవలకు గుర్తుగా ఆయన జన్మించిన ఉత్తరాబాధ్ర నక్షత్రాన్ని పురస్కరించుకొని ప్రతి నెల ఆ రోజు రాత్రి రాత్రి 7.30 గంటలకు ప్రత్యేక ఆస్థానం నిర్వహిస్తారు. ఇక శ్రీవారికి నిర్వహించే ఉగాది, దీపావళి, అణివార ఆస్థానాల్లో మైసూరు మహారాజు పేరిట ప్రత్యేక హరతి ఉంటుంది.

తిరుమల దేవస్థానంలో శ్రీకృష్ణాష్టమి ఉత్సవాల్లో భాగంగా ఉట్లోత్సవం నిర్వహిస్తారు. ఈ పర్వదినాన శ్రీ మలయప్ప స్వామి కర్ణాటక సత్రాలకు విచ్చేసి ఉట్లోత్సవంలో పాల్గొని అనంతరం ఆలయానికి చేరుకొంటారు. ఈ విధానం గత 300 ఏళ్లుగా క్రమం తప్పకుండా జరుగుతూ ఉండటం విశేషం.
