Tractor Rally Violence: రైతు ట్రాక్టర్ ర్యాలీ విధ్వంసంపై పిటిషన్లు… సుప్రీంకోర్టులో విచారణ…
కేంద్రం తీసుకువచ్చిన మూడు వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఉద్యమిస్తున్న రైతులు...

కేంద్రం తీసుకువచ్చిన మూడు వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఉద్యమిస్తున్న రైతులు గణతంత్ర దినోత్సవం సందర్భంగా జనవరి 26న ట్రాక్టర్ ర్యాలీ నిర్వహించారు. దానిలో హింస చోటు చేసుకుంది. వేలాది మంది ఆందోళనకారులు పోలీసులు ఏర్పాటు చేసిన బారికేడ్లను బద్దలు కొట్టి, పోలీసులపై సైతం దాడికి దిగారు. ఎర్రకోటలో మతానికి సంబంధించిన జెండాలను ఎగుర వేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో సుప్రీం కోర్టులో పలు పిటిషన్లు దాఖలయ్యాయి. వాటిపై సుప్రీం కోర్టులో నేడు విచారణ జరగనుంది. ప్రధాన న్యాయమూర్తి ఎస్‌ఏ బోబ్డే, న్యాయమూర్తులు జస్టిస్ ఏఎస్ బోపన్న, జస్టిస్ వీ రామ సుబ్రహ్మణ్యన్‌లతో కూడిన ధర్మాసనం విచారణ జరుపనుంది.
పలు పిటిషన్లు….
న్యాయవాది తివారి తన పిటిషన్లో రైతు ర్యాలీలో జాతీయ జెండాను అవమానించిన వ్యక్తులు, సంస్థలపై ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేసేలా చూడాలని సంబంధిత అధికారులను ఆదేశించాలని కోరారు. ట్రాక్టర్ పరేడ్ సందర్భంగా ‘హింసాత్మక మలుపు’ తీసుకుందని పిటిషన్‌లో పేర్కొన్నారు. ఈ ఘటన ప్రజల రోజువారి జీవితాన్ని ప్రభావితం చేసిందని, ప్రభుత్వ ఆదేశాలతో ఇంటర్నెట్ సేవలకు అంతరాయం ఏర్పడిందన్నారు. ప్రస్తుతం న్యాయవాదులతో సహా పలు వృత్తుల్లో ఉన్న వారికి ఇంటర్నెట్ చాలా అవసరమని పిటిషన్‌లో పేర్కొన్నారు. మరోవైపు ఎలాంటి ఆధారాలు లేకుండా రైతులను ఉగ్రవాదులుగా ముద్ర వేయకుండా అధికారులకు, మీడియాకు ఆదేశాలివ్వాలంటూ మనోహర్‌లాల్ శర్మ అనే మరో న్యాయవాది పిటిషన్ దాఖలు చేశారు.