‘మీ వీసాను రద్దు చేయాల్సిందే’, ప్రధాని మోదీపై బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఫైర్
బంగ్లాదేశ్ పర్యటనలో ఉన్న ప్రధాని మోదీపై బెంగాల్ సీఎం, టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ నిప్పులు కక్కారు. బెంగాల్ లో ఓవైపు ఎన్నికలు జరుగుతుండగా మరో వైపు మీరు ఆ దేశాన్ని సందర్శించి ఈ రాష్ట్ర ఓటర్లపై ప్రభావాన్ని చూపాలనుకుంటున్నారా అని ఆమె ప్రశ్నించారు.
బంగ్లాదేశ్ పర్యటనలో ఉన్న ప్రధాని మోదీపై బెంగాల్ సీఎం, టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ నిప్పులు కక్కారు. బెంగాల్ లో ఓవైపు ఎన్నికలు జరుగుతుండగా మరో వైపు మీరు ఆ దేశాన్ని సందర్శించి ఈ రాష్ట్ర ఓటర్లపై ప్రభావాన్ని చూపాలనుకుంటున్నారా అని ఆమె ప్రశ్నించారు. ‘ఇక్కడ (బెంగాల్లో) పోలింగ్ మొదలైంది. అక్కడ మీరు లెక్చర్లు ఇస్తున్నారు. ఇది పూర్తిగా ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఉల్లంఘన కిందికే వస్తుంది’ అని ఆమె అన్నారు. ఖరగ్ పూర్ లో జరిగిన ఎన్నికల ర్యాలీలో ఆమె పాల్గొన్నారు. 2019 లో జరిగిన లోక్ సభ ఎన్నికల్లో బంగ్లాదేశ్ కి చెందిన ఓ నటుడు మా పార్టీ ర్యాలీలో పాల్గొన్నాడని.. అప్పుడు మీరు (మీ పార్టీ) ఆ దేశ ప్రభుత్వంతో మాట్లాడి అతడి వీసాను రద్దు చేయించారని ఆమె అన్నారు. ఇప్పుడు ఇక్కడ ఎన్నికలు జరుగుతుండగా.. మీరు ఆ దేశానికి వెళ్లి ఒక వర్గం వారి ఓట్లనుకోరుతున్నారు..ఇది కోడ్ ఉల్లంఘన కిందికే వస్తుంది. మేం ఈసీకి ఫిర్యాదు చేస్తాం అని మమతా అన్నారు. బంగ్లాదేశ్ లోని ఓరకండిలో గల ఓ ఆలయంలో మోదీ ప్రార్థనలు చేయడాన్ని ఆమె ప్రస్తావించారు. ఇదంతా బెంగాల్లోని హిందూ మథువా కులస్థుల ఓట్లను చేజిక్కించుకోవడానికి అన్నారు.
కాగా- ఓరకండిలో మథువా కులస్థులను ఉద్దేశించి ప్రసంగించిన మోదీ.. వారి ప్రయోజనాలకు తమ ప్రభుత్వం అధిక ప్రాధాన్యమిస్తుందని చెప్పారు. ఆ తరువాత మీడియాతో మాట్లాడిన ఆయన.. ఒక భారత ప్రధాని తమతో మాట్లాడేందుకు వస్తారని తాము ఊహించనైనా ఊహించలేదని అన్నారని తెలిపారు. ఇండియా నుంచి ఇక్కడికి వారు సులభంగా ప్రయాణించేందుకు తగిన సౌలభ్యం కలిస్తామని హామీ ఇచ్చినట్టు చెప్పారు. ఇక్కడ ఓ ప్రైమరీ స్కూలును ఏర్పాటు చేయడానికి తమ ప్రభుత్వం ప్రయత్నిస్తుందన్నారు . బంగ్లాదేశ్ స్వాతంత్య్రం కోసం తాను ఒకప్పుడు జైలుకు వెళ్లానని మోదీ చెప్పారు. ఇలా బెంగాల్ ఎన్నికల్లో పరోక్షంగా మథువా కులస్థుల ఓట్లను పొందడానికి ఆయన యత్నించారని మమత ఆరోపించారు.
మరిన్ని ఇక్కడ చదవండి: ఒకప్పుడు అది ఉద్రిక్త సరోవర ప్రాంతం. ఇప్పుడు జవాన్ల ‘ఆనంద నిలయం’, పాంగాంగ్ సో
ఆటో ఎక్కి, స్కూటర్ పై ప్రయాణించి.. బీజేపీ మహిళా కార్యకర్తలతో కోలాటం ఆడిన కేంద్ర మంత్రి