West Bengal Election 2021 Phase 1 Voting Highlights: బెంగాల్‌లో ముగిసిన మొదటి దశ పోలింగ్‌..

Balaraju Goud

| Edited By: Shaik Madar Saheb

Updated on: Mar 27, 2021 | 10:28 PM

పశ్చి‌మ‌బెంగాల్‌ తొలి విడత అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌ ప్రారంభమైంది. తొలి దశలో 30 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరుగుతుండగా..

West Bengal Election 2021 Phase 1 Voting Highlights: బెంగాల్‌లో ముగిసిన మొదటి దశ పోలింగ్‌..
Bengal Elections 2021

West Bengal Election 2021: పశ్చి‌మ‌బెంగాల్‌ తొలి విడత అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌ ప్రారంభమైంది. తొలి దశలో 30 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరుగుతుండగా.. ఎన్నికల కమిషన్‌ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. తొలి విడతలో 73,80,942 మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోను‌న్నారు. బెంగా‌ల్‌లో తొలి‌దశ పోలింగ్‌ కోసం 7,061 పోలింగ్‌ స్టేషన్లు, 10,288 పోలింగ్‌ బూత్‌లు ఏర్పా‌టు ‌చే‌శారు. కరోనా మహమ్మారి నేపథ్యంలో కోవిడ్ నిబంధనలు అనుసరిస్తూ, అన్ని ఏర్పాట్లు చేసినట్లు ఎన్నికల కమిషన్‌ పేర్కొంది. పోలింగ్ కేంద్రాల వద్ద థర్మల్‌ స్కానర్లు, హ్యాండ్‌ శానిటైజర్లు, సబ్బులు.. సిబ్బందికి మాస్క్‌లు, ఇతర సామగ్రిని అందుబాటులో ఉంచినట్లు తెలిపింది. ఉదయం నుంచే ఆయా రాష్ట్రాల్లో పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు బారులు తీరారు. పోలింగ్‌ ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు సాగనుంది. కరోనా మహమ్మారి వేళ గంట సమయం పొడగించారు.

ప్రస్తుతం ఎన్నికలు జరుగుతున్న రాష్ట్రాల్లో అందరి దృష్టి బెంగాల్‌పైనే నెలకొంది. అధికార తృణమూల్ కాంగ్రెస్, భారతీయ జనతా పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో ఎన్నికలు అసక్తికరంగా మారాయి. శనివారం మొదటి విడతలో30 స్థానాలకు పోలింగ్‌ ప్రారంభమైంది. తొలి విడతలో నక్సల్స్‌ ప్రభావిత ప్రాంతాల్లో ఎన్నికలు జరుగుతుండగా.. పోలీసులు భారీ భద్రతను ఏర్పాటు చేశారు. తొలి విడత ఎన్నికల కోసం 684 కంపెనీల బలగాలను మోహరించనున్నట్లు ఎన్నికల సంఘం వెల్లడించింది. పురులియా, బంకురా, జార్‌గ్రామ్‌, పుర్బా మేదినిపూర్‌, పశ్చిమ మేదినిపూర్‌లో ఎన్నికలు జరుగుతుండగా.. మావోయిస్టు ప్రభావిత ప్రాంతం కావడంతో గతంలో ఎన్నడూ లేని విధంగా బూత్‌కు 11 మంది చొప్పున పారామిలటరీ సిబ్బందితో భద్రతను ఏర్పాటు చేశారు. జిల్లా పరిధిలో ఉన్న మొత్తం 1,307 పోలింగ్‌ బూత్‌లన్నింటినీ నక్సల్స్‌ ప్రభావిత ప్రకటించగా.. 144 కేంద్ర బలగాల జార్‌గ్రామ్‌లో అధికారులు మోహరిస్తున్నారు. బెంగాల్‌ తొలి విడత ఎన్నికల్లో 191 మంది అభ్యర్థులు తమ అదృష్టం పరీక్షించుకుంటుండగా.. 74లక్షల మంది ఓటర్లు వారి భవితవ్యాన్ని నిర్ణయించనున్నారు.

LIVE NEWS & UPDATES

The liveblog has ended.
  • 27 Mar 2021 08:40 PM (IST)

    భారీగా పోలింగ్‌..

    పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల మొదటి దశ ఓటింగ్ ముగిసింది. సాయంత్రం 6 గంటల వరకు క్యూలైన్లల్లో నిల్చున్న వారిని ఓటు వేసేందుకు అనుమతించడంతో.. పోలింగ్‌ శాతం భారీగా పెరిగింది. అయితే సాయంత్రం వరకు 80 శాతానికిపైగా ఓట్లు పోలయ్యాయని ఎన్నికల అధికారులు పేర్కొంటున్నారు. అయితే ఎన్నికల సంఘం ఇంకా అధికారికంగా ప్రకటించాల్సి ఉంది.

  • 27 Mar 2021 07:44 PM (IST)

    82 శాతం ఓటింగ్..

    పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల మొదటి దశ ఓటింగ్ ముగిసింది. సాయంత్రం 6గంటల వరకు క్యూలైన్లల్లో నిల్చున్న వారిని ఓటు వేసేందుకు ఇంకా అనుమతిస్తున్నారు. అయితే సాయంత్రం వరకు 82 శాతం ఓట్లు పోలయ్యాయని ఎన్నికల అధికారులు పేర్కొంటున్నారు.

  • 27 Mar 2021 07:20 PM (IST)

    నందిగ్రామ్‌లో బీజేపీ, టీఎంసీ కార్యకర్తల మధ్య ఘర్షణ..

    పశ్చిమ బెంగాల్‌లోని నందిగ్రామ్‌లో బీజేపీ, టీఎంసీ కార్యకర్తల మధ్య ఘర్షణ జరిగింది. ఈ ఘర్షణలో ముగ్గురికి గాయాలైనట్లు తెలుస్తోంది. ముఖ్యమంత్రి, టీఎంసీ చీఫ్ మమతా బెనర్జీ నందిగ్రామ్ అసెంబ్లీ సీటు నుంచి పోటీ చేస్తున్నారు.

  • 27 Mar 2021 06:11 PM (IST)

    సాయంత్రం 5:20 గంటల వరకు 78.64 శాతం ఓటింగ్..

    పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల మొదటి దశ ఓటింగ్ ఇంకా కొనసాగుతోంది. సాయంత్రం 5:20 నిమిషాల వరకు 78.64 శాతం ఓట్లు పోలయ్యాయని ఎన్నికల సంఘం వెల్లడించింది. కాగా.. తూర్పు మిడ్నాపూర్‌లో 82.42 శాతం, పశ్చిమ మిడ్నాపూర్‌లో 80.16 శాతం, పురులియాలో 77.13 శాతం, బంకురాలో 80.03 శాతం, ఝార్గ్రామ్‌లో 80.55 శాతం మంది తమ ఓట్లను వినియోగించుకున్నారు.

  • 27 Mar 2021 04:27 PM (IST)

    షల్బానీలో సీపీఎం, బీజేపీ కార్యకర్తల మధ్య ఘర్షణ

    ఓటింగ్ సందర్భంగా షలబానిలో సీపీఎం, బీజేపీ కార్యకర్తల మధ్య ఘర్షణ జరిగింది. ఈ ఘర్షణలో ఇద్దరు సీపీఎం మద్దతుదారులు గాయపడినట్లు సమాచారం. ఈ సంఘటన షలబనిలోని అమ్లాసోల్ ప్రాంతంలో చోటుచేసుకుంది.

  • 27 Mar 2021 04:11 PM (IST)

    ప్రధాని మోదీ నిబంధనలను ఉల్లంఘిస్తున్నారుః మమతా

    ప్రధాని మోదీ నిబంధనలను ఉల్లంఘిస్తున్నారని బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆగ్రహం వ్యక్తచేశారు.  బెంగాల్ ఈ రోజు మొదటి దశ పోలింగ్ జరుగుతోంది. ఈ క్రమంలో మమతా ఖరగ్‌పూర్‌లో మాట్లాడుతూ.. బెంగాల్ ఓ వైపు ఓటింగ్ జరుగుతోందని, మరోవైపు ప్రధాని బంగ్లాదేశ్‌లో పర్యటిస్తున్నారన్నారు. బెంగాల్‌పై ప్రసంగం చేస్తున్నారని.. ఇది ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించడమేనని ఆమె పేర్కొన్నారు.

  • 27 Mar 2021 04:05 PM (IST)

    3 గంటల వరకు 55.27 శాతం ఓటింగ్

    పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల మొదటి దశ ఓటింగ్ కొనసాగుతోంది. మధ్యాహ్నం 3 గంటల వరకు 55.27 శాతం పోలింగ్ నమోదైనట్లు ఎన్నికల సంఘం తెలిపింది.

  • 27 Mar 2021 02:22 PM (IST)

    మధ్యాహ్నం 1 గంట వరకు 40.73 శాతం పోలింగ్

    పశ్చిమ బెంగాల్‌లో మధ్యాహ్నం 1 గంట వరకు 40.73 శాతం పోలింగ్ నమోదైంది. బంకురాలో 47.77 శాతం ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.

  • 27 Mar 2021 01:01 PM (IST)

    ఓటు వేసిన బెంగాల్ బీజేపీ అధ్యక్షుడు దిలీప్ ఘోష్

    పశ్చిమ బెంగాల్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు దిలీప్ ఘోష్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల మొదటి దశలో తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. జార్‌గ్రామ్‌లోని పోలింగ్ బూత్‌లో ఆయన తన ఓటు వేశారు.

  • 27 Mar 2021 12:55 PM (IST)

    సోమెందు అధికారిపై దాడి

    కాశీలో తన కారుపై 50 మందికి పైగా టీఎంసీ కార్యకర్తలు దాడి చేశారని బీజేపీ నేత సోమెందు అధికారి ఆరోపించారు.

  • 27 Mar 2021 12:27 PM (IST)

    పురులియాలో బారులుతీరిన మహిళా ఓటర్లు

    పురులియాలో ఓటు వేసేందుకు మహిళలు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. పోలింగ్ బూత్ వద్ద మహిళా ఓటర్లతో పొడవైన క్యూలతో నిండిపోయాయి.

  • 27 Mar 2021 11:31 AM (IST)

    ఉదయం 11 గంటల వరకు 24.61 శాతం పోలింగ్ నమోదు

    పశ్చిమ బెంగాల్‌లో చెదురు మదురు సంఘటనలు మినహా పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతుంది. తొలి విడతలో 30 నియోజకవర్గాల్లో ఓటింగ్ జరుగుతుంది. ఉదయం 11 గంటల వరకు 24.61 శాతం పోలింగ్ నమోదైనట్లు ఎన్నికల కమిషన్ వెల్లడించింది. కాగా, ఓటింగ్ కోసం ప్రజలు భారీగా పోలింగ్ బూత్‌లకు బారులు తీరుతున్నారు.

  • 27 Mar 2021 11:25 AM (IST)

    ఎన్నికల అధికారిని కలవనున్న బీజేపీ నేతలు

    పోలింగ్ సందర్భంగా టీఎంసీ నేతలు దౌర్జన్యాలకు పాల్పడుతున్నారని బీజేపీ నేతలు ఆరోపించారు. ఈ నేపథ్యంలో సీఈసీని మధ్యాహ్నం 2గంటల బీజేపీ నేత కైలాష్ విజయవర్గీయ నేతృత్వంలోని ప్రతినిధుల బృందం కలవనుంది. ఈ సందర్భంగా వారు టీఎంసీ నేతలపై ఫిర్యాదు చేయనునన్నట్లు సమాచారం.

  • 27 Mar 2021 10:34 AM (IST)

    టీఎంసీ, బీజేపీ వర్గీయుల బాహాబాహీ

    టీఎంసీ, బీజేపీ వర్గీయులు బాహాబాహీకి దిగారు. వెస్ట్‌ మిడ్నాపూర్‌ సల్బోనీలో టీఎంసీ అభ్యర్థి సుశాంత ఘోష్‌ను అడ్డుకున్నారు గుర్తు తెలియని వ్యక్తులు. దీంతో ఆయన్ని పోలీసులు అక్కడి నుంచి పంపించే ప్రయత్నం చేశారు. అయినా ఆయన్ను వెంబడించిన దుండగులు..కారుపై దాడికి దిగారు.

  • 27 Mar 2021 10:23 AM (IST)

    బీజేపీ కార్యకర్తలపై గుర్తు తెలియని వ్యక్తులు దాడి

    ఉత్తరకాంతిలోని పోలింగ్ బూత్ నెంబర్ 178 దగ్గర బీజేపీ కార్యకర్తలపై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారు. ఈ దాడిలో నలుగురు బీజేపీ కార్యకర్తలు గాయపడ్డారు.

  • 27 Mar 2021 10:21 AM (IST)

    బెంగాలీ బిడ్డలు బెంగాలీ ద్రోహులను ఓడిస్తారుః ఎంపీ డెరెక్ ఓ బ్రెయిన్

    బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో తామే విజయం సాధిస్తామని తృణమూల్ రాజ్యసభ సభ్యుడు డెరెక్ ఓ బ్రెయిన్ ధీమా వ్యక్తం చేశారు. నందిగ్రామ్‌లో బెంగాలీ బిడ్డలు బెంగాలీ ద్రోహులను ఓడిస్తారని అన్నారు. దేశంలోని రాజ్యాంగ వ్యవస్థలను నాశనం చేయడానికి ప్రయత్నిస్తున్నారని ఆయన మండిపడ్డారు. బెంగాలీ మహిళలు తమకు తోచిన విధంగా చీరలు ధరిస్తారని ఓ బ్రెయిన్ స్పష్టం చేశారు.

  • 27 Mar 2021 09:44 AM (IST)

    సీఈసీని కలవనున్న టీఎంసీ బృందం

    తొలి విడత పోలింగ్ సందర్భంగా నెలకొన్న ఆందోళనల నేపథ్యంలో టీఎంసీ ఎంపీల బృందం బెంగాల్ సీఈసీని కలవనుంది. మధ్యహ్ననం 12గంటలకు ఈ బృందం భేటీ కానుంది.

  • 27 Mar 2021 09:40 AM (IST)

    ఉదయం 9 గంటల వరకు 7.72% శాతం పోలింగ్

    పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలలో మొదటి దశ పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతుంది. ఉదయం 9 గంటల వరకు 7.72% శాతం పోలింగ్ నమోదు అయ్యినట్లు భారత ఎన్నికల కమిషన్ వెల్లడించింది.

  • 27 Mar 2021 09:35 AM (IST)

    ఓటేసిన బీజేపీ అభ్యర్థి సమిత్ దాస్

    పశ్చిమ మిడ్నాపూర్ బీజేపీ అభ్యర్థి, సమిత్ దాస్ తన ఓటు హక్కు వినియోగించుకున్నారు.

  • 27 Mar 2021 09:32 AM (IST)

    టీఎంసీ నేతలు ఓటర్లను భయపెడుతున్నారుః సౌమేందు అధికారి

    టీఎంసీ నేతలు ఓటర్లను భయభ్రాంతుకు గురిచేస్తున్నారని బీజేపీ నేత సువేందు అధికారి సోదరుడు సౌమేందు అధికారి ఆరోపించారు. ప్రజలు స్వేచ్ఛగా ఓటేసేందుకు వీలు కల్పించాలని ఎన్నికల సంఘాన్ని కోరినట్లు ఆయన తెలిపారు. ప్రజాస్వామ్యంలో ప్రజలు తమకు కావలసిన వారిని ఎన్నుకునే హక్కుందన్నారు.

  • 27 Mar 2021 09:26 AM (IST)

    సత్సత్‌మల్ వద్ద కాల్పుల్లో ఇద్దరు భద్రతా సిబ్బందికి గాయాలు

    తూర్పు మిడ్నాపూర్: పశ్చిమ బెంగాల్ ఎన్నికలకు ఓటు వేయడానికి ముందే భగవాన్‌పూర్ అసెంబ్లీ నియోజకవర్గంలోని సత్సత్‌మల్ వద్ద ఈ రోజు తెల్లవారుజామున జరిగిన కాల్పుల్లో ఇద్దరు భద్రతా సిబ్బంది గాయపడ్డారు. అర్గోల్ పంచాయతీ ప్రాంతంలో తీవ్రవాదులతో టీఎంసీ నేతలకు సంబంధం ఉన్నాయని బీజేపీ జిల్లా అధ్యక్షులు అనుప్ చక్రవర్తి ఆరోపించారు.

  • 27 Mar 2021 08:49 AM (IST)

    పటాష్‌పూర్ అసెంబ్లీ నియోజకవర్గంలో పోలింగ్ ప్రశాంతం

    తూర్పు మిడ్నాపూర్‌లోని పటాష్‌పూర్ అసెంబ్లీ నియోజకవర్గంలో పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. బూత్ నెంబర్ 67 ఎ ఓటేసేందుకు ప్రజలు భారీగా తరలివచ్చారు.

  • 27 Mar 2021 08:45 AM (IST)

    నిర్భయంగా ఓటు వేయండిః అమిత్ షా

    మొదటి దశలో వీలైనంత వరకు ఓటు వేయాలని హోంమంత్రి అమిత్ షా బెంగాల్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. బెంగాల్ అహంకారాన్ని పునరుద్ధరించడానికి ప్రజలు నిర్భయంగా ఓటు వేయాలని అన్నారు.

  • 27 Mar 2021 08:41 AM (IST)

    కరోనా నిబంధనలు పాటించి ఓటు వేయండిః జేపీ నడ్డా

    ఒక్క ఓటు రాష్ట్ర భవిష్యత్తును నిర్ణయిస్తుందని భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా అన్నారు. ప్రతి ఒక్కరు కోవిడ్ నిబంధనలు అనుసరించి ఓటు వేయాలని బెంగాల్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఆయన ట్విట్టర్ వేదికగా వెల్లడించారు.

  • 27 Mar 2021 08:36 AM (IST)

    హార్‌గ్రామ్‌లో భారీ తరలి వచ్చిన ఓటర్లు

    పశ్చిమ బెంగాల్: హార్‌గ్రామ్‌లోని కిచండా పార్ట్ బేసిక్ స్కూల్‌లో ఓటింగ్ ప్రశాంతంగా జరుగుతోంది. పోలింగ్ కేంద్రం వద్ద ఓటర్లు భారీ సంఖ్యలో క్యూ లైన్‌లో నిల్చున్నారు.

  • 27 Mar 2021 08:28 AM (IST)

    పోలింగ్ జరుగుతున్న నియోజకవర్గాలు ఇవే…

    పశ్చిమ బెంగాల్‌లో ఇవాళ మొదటి దశలో 30 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోలింగ్ జరుగుతోంది.

    1-పటాష్‌పూర్ 16-మెడినిపూర్
    2-కాంతి నార్త్ 17-బినుపార్ (ఎస్టీ)
    3-భగబన్‌పూర్ 18-బంద్వాన్ (ఎస్టీ)
    4-ఖేజూరి (ఎస్సీ) 19-బల్రాంపూర్
    5-కాంతి సౌత్ 20-బాగ్ముండి
    6-రామ్‌నగర్ 21-జాయ్‌పూర్
    7-ఇగారా 22- పురుషాలియా
    8-దంతన్ 23-మన్‌బజార్ (ఎస్టీ)
    9-నయాగ్రామ్ (ఎస్టీ) 24-కాశీపూర్
    10-గోపిబల్లభ్‌పూర్ 25-పారా (ఎస్సీ)
    11-జారాగ్రామ్ 26- రఘునాథ్‌పూర్ (ఎస్సీ)
    12-కేశరి (ఎస్టీ) 27-సాల్టోడా (ఎస్సీ)
    13-ఖరగ్‌పూర్ 28-ఛట్నా
    14-గార్బెట్టా 29-రాణిబంద్ (ఎస్టీ)
    15-సాల్బోని 30- రాయ్‌పూర్ (ఎస్టీ)
  • 27 Mar 2021 08:18 AM (IST)

    పశ్చిమ మిడ్నాపూర్‌లో పోలింగ్ ప్రశాంతం

    పశ్చిమ మిడ్నాపూర్‌లోని పోలింగ్ కేంద్రంలో ఓటింగ్ ప్రశాంతంగా కొనసాగుతుంది. పోలింగ్ బూత్ వద్ద ఓటేసేందుకు ప్రజలు భారీ తరలివస్తన్నారు.

  • 27 Mar 2021 08:15 AM (IST)

    తొలి దశలో రికార్డు స్థాయిలో ఓటు వేయాలిః ప్రధాని

    బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రతి ఒక్కరు ఓటు వేయాలని ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. తొలి దశలో రికార్డు స్థాయిలో ఓటు హక్కు వినియోగించుకోవాలని బెంగాల్ ప్రజలకు ప్రధాని విజ్ఞప్తి చేశారు.

  • 27 Mar 2021 08:12 AM (IST)

    టీఎంసీ కార్యాలయంలో పేలుడు

    పశ్చిమ బెంగాల్ ఎన్నికలలో మొదటి దశ ఎన్నికలకు ముందు బాంబు పేలుడు సంభవించింది. బంకురా జిల్లాలోని జైపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఉత్తరాన గ్రామ పంచాయతీలోని ముర్లిగంజ్ లోని తృణమూల్ కాంగ్రెస్ కార్యాలయంలో ఈ పేలుడు జరిగింది. ఈ ఘటనలో ముగ్గురు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. బాంబు దాడులకు వామపక్ష-కాంగ్రెస్ కూటమినే కారణమని టీఎంసీ వర్గాలు ఆరోపించాయి. ఇదిలావుంటే టీఎంసీ పార్టీ కార్యకర్తలు కార్యాలయంలో బాంబులను తయారు చేస్తున్నారని, ఈ సమయంలో అది పేలిందని బీజేపీ ఆరోపించింది.

  • 27 Mar 2021 08:08 AM (IST)

    పోలింగ్ సిబ్బందికి అహారాన్ని అందిస్తున్న వాహనానికి నిప్పు

    పురులియాలోని బందోయన్‌లోని గారు ప్రైమరీ హెల్త్ సెంటర్ – సాగా సుప్రూడి గ్రామాల మధ్య రోడ్డుపై టాటా మ్యాజిక్ కారును గుర్తు తెలియని వ్యక్తులు నిప్పుపెట్టారు. కారులో మంటలు చెలరేగడంతో ఆ ప్రాంతంలో తీవ్ర భయాందోళనలు నెలకొన్నాయి. పోలింగ్ సిబ్బందికి ఆహారాన్ని పంపిణీ చేసిన తిరిగి వస్తుండగా ఈ ఘాతుకం చోటుచేసుకుంది. డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్న భద్రతా సిబ్బంది విచారణ చేపట్టింది.

    Vehicle Fire

    Vehicle Fire

  • 27 Mar 2021 07:54 AM (IST)

    కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా పోలింగ్

    కరోనా మహమ్మారి నేపథ్యంలో కోవిడ్ నిబంధనలు అనుసరిస్తూ, అన్ని ఏర్పాట్లు చేసినట్లు ఎన్నికల కమిషన్‌ పేర్కొంది. పోలింగ్ కేంద్రాల వద్ద థర్మల్‌ స్కానర్లు, హ్యాండ్‌ శానిటైజర్లు, సబ్బులు.. సిబ్బందికి మాస్క్‌లు, ఇతర సామగ్రిని అందుబాటులో ఉంచినట్లు తెలిపింది. ఉదయం నుంచే ఆయా రాష్ట్రాల్లో పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు బారులు తీరారు.

  • 27 Mar 2021 07:52 AM (IST)

    భారీ భద్రత నడుమ పోలింగ్

    అత్యంత సున్నిత ప్రాంతాలు కావడంతో పురూలియాలో 185, ఝార్ర్గామ్‌లో 144 కంపెనీల కేంద్ర బలగాలు పహారా కాస్తున్నాయి. చిత్రమేంటంటే ఇప్పుడు మావోయిస్టుల టెన్షన్ కంటే తృణమూల్ కాంగ్రెస్, బీజేపీ శ్రేణుల మధ్య ఘర్షణలు జరగకుండా చూడటమే అతి పెద్ద సవాలుగా మారింది. 2011, 2016ల్లో లెఫ్ట్ పార్టీలు, తృణమూల్ కార్యకర్తల మధ్య ఘర్షణలు జరిగాయి. ఓటింగ్‌ శాతం బాగా తగ్గింది.

  • 27 Mar 2021 07:45 AM (IST)

    సాయంత్రం 6గంటల వరకు పోలింగ్

    ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 6 గంటల దాకా జరుగుతుంది. బెంగాల్‌లోని మావోయిస్ట్‌ ప్రభావ ప్రాంతమైన జంగల్‌మహల్‌ పరిధిలోని జిల్లాలైన బంకురాలో 4 స్థానాలు, పురూలియాలో 9 సీట్లు, ఝార్ర్గామ్‌‌లో 4 స్థానాలు, తూర్పు మిడ్నపూర్‌‌లోని 7 అసెంబ్లీ నియోజకవర్గాలు, పశ్చిమ మిడ్నపూర్‌‌లోని 6సీట్లకు పోలింగ్ జరుగుతోంది. ఉదయం నుంచే ఓటర్లు బారులు తీరుతున్నారు.

    West Bengal Polling 2021

    West Bengal Polling 2021

  • 27 Mar 2021 07:40 AM (IST)

    మొదలైన పోలింగ్

    రాష్ట్రంలో ఎనిమిది దశల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగుతున్నాయి. మొదటి దశలో 30 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికల పోలింగ్ ఉదయం 7గంటలకు మొదలైంది. మొదటి దశ పోలింగ్‌లో 21 మంది మహిళలతో సహా 191 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు.

Published On - Mar 27,2021 8:41 PM

Follow us