తృణమూల్ కాంగ్రెస్ ఉపాధ్యక్షునిగా యశ్వంత్ సిన్హా, టీఎంసీ జాతీయ కార్యవర్గ సభ్యుడుగా కూడా నియామకం
తృణమూల్ కాంగ్రెస్ ఉపాధ్యక్షునిగా కేంద్ర మాజీ మంత్రి యశ్వంత్ సిన్హాను నియమించారు. అలాగే ఈ పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యత్వ పదవి కూడా ఆయనకు లభించింది.
తృణమూల్ కాంగ్రెస్ ఉపాధ్యక్షునిగా కేంద్ర మాజీ మంత్రి యశ్వంత్ సిన్హాను నియమించారు. అలాగే ఈ పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యత్వ పదవి కూడా ఆయనకు లభించింది. బెంగాల్ సీఎం, టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ తరువాత ఇప్పుడు యశ్వంత్ సిన్హా పార్టీలో రెండో అతి ముఖ్యుడయ్యారు. ఈ నెల 13 న ఆయన తృణమూల్ కాంగ్రెస్ లో చేరారు. నందిగ్రామ్ లో మమతపై దాడి జరిగినట్టు తెలియగానే తాను టీఎంసీలో చేరాలని నిర్ణయించుకున్నాననని ఆయన చెప్పారు. ఎన్నికల్లో గెలవాలని అనుకుంటే ఈ ప్రభుత్వం ఏమైనా చేయవచ్చునని, కానీ మమతపై దాడి జరగడంతోనే నేను ఈ పార్టీలో చేరాలనుకున్నానని ఆయన చెప్పారు. ఇన్నాళ్లూ రాజకీయాలకు దూరంగా ఉన్న నేను ఇప్పుడు ఈ నిర్ణయం తీసుకున్నానంటే మీరే ఊహించండి అని ఆయన వ్యాఖ్యానించారు. దేశంలో ప్రజాస్వామ్యం ప్రమాదకర పరిస్థితుల్లో పడిందని, ఈ తరుణంలో తృణమూల్ కాంగ్రెస్ ఘన విజయం సాధించాల్సి ఉందని యశ్వంత్ సిన్హా పేర్కొన్నారు.
ప్రస్తుతం 83 ఏళ్ళ వయసున్న సిన్హా 2018 లో బీజేపీని వీడారు. అప్పటి నుంచి ప్రధాని మోదీ విధానాలను విమర్శిస్తూ వస్తున్నారు. బెంగాల్ ఎన్నికల్లో బీజేపీ అధికారంలోకి రాకుండా చూసేందుకు తాను టీఎంసీ తరఫున ప్రచారం చేస్తానని ఆయన చెప్పారు. కాగా బీజేపీ లోని లోటుపాట్లన్నీ సిన్హాకు తెలుసునని, అందువల్ల అది తనకు ప్లస్ పాయింట్ కాగలదని మమత సన్నిహితవర్గాలు కూడా భావిస్తున్నాయి. అంతేకాదు.. ఈ రాష్ట్ర భౌగోళిక స్వరూపమంతా సిన్హాకు తెలుసునని, పార్టీ ప్రచారం సందర్భంగా అయన ముఖ్యమంత్రికి తగిన సూచనలు, సలహాలు (ఇన్-పుట్స్) ఇవ్వవచ్చునని, అవి దీదీకి ప్రయోజనకరమవుతాయన్నది ఈ వర్గా ల అంచనా. పార్టీ ఉపాధ్యక్ష పదవే కాకుండా పార్టీ జాతీయ కార్యవర్గ కమిటీ సభ్యునిగా కూడా యశ్వంత్ సిన్హాను నియమించారంటే పార్టీ ఆయనపై ఎంత విశ్వాసం ఉంచిందో తెలుస్తోందని అంటున్నారు.
మరిన్ని ఇక్కడ చూడండి: వావ్ ! మరో దేశీ రోబో ‘ షాలూ’ సృష్టి, హ్యాట్సాఫ్ టు యూపీ ఐఐటీ ప్రొఫెసర్